ఆ విధంగా గెలీలియో తన పరిశీలనలని మాత్రమే ప్రచారం చేస్తూ కోపర్నికస్ ప్రసక్తి తేకుండా ఎంతో కాలం జగ్రత్తపడుతూ వచ్చాడు. కాని 1613 లో ఒక సందర్భంలో తన సహనం చచ్చిపోయినట్టుంది. ఆ సంవత్సరం సూర్యబిందువుల (sunspots) గురించి తను చేసిన పరిశీలనల గురించి ఓ చిన్న పుస్తకం రాశాడు. లిన్సియన్ సదస్సు ఆ పుస్తకాన్ని ప్రచురించింది. పుస్తకం ముందుమాటలో గెలీలియోని ఆకాశానికెత్తుతూ సూర్యబిందువులని మొట్టమొదట పరిశీలించిన ఘనత గెలీలియోదే నన్నట్టుగా రాశారు లిన్సియన్ సభ్యులు. కాని అది నిజం కాదు. గెలీలియో కన్నా ముందు సూర్యబిందువులని గమనించినవారు మరి కొందరు ఉన్నారు. వారిలో ఒకరు ఓ జెసూట్ ఖగోళవేత్త. అతడి పేరు క్రిస్టఫర్ షైనర్. తనకు రావలసిన ఘనత గెలీలియోకి దక్కడం చూసి ఇతగాడికి ఒళ్ళుమండిపోయింది. అయితే ఇతడికి కూడా నిజానికి ఒళ్లు అంతగా మండాల్సిన పనిలేదేమో! ఎందుకంటే ఇతడి కంటే ముందు థామస్ హారియట్ అనే ఇంగ్లండ్ కి చెందిన వ్యక్తి, యోహాన్ ఫాబ్రీసియస్ అనే ఓ డచ్ వ్యక్తి సూర్యబిందువులని కనిపెట్టారు. ఘనత ఎవరికి దక్కినా ఈ వివాదం వల్ల గెలీలియో పేరు నలుగురు నోటా నానింది. కాని అసలు సమస్యకి కారణం ఇది కాదు. పుస్తకం చివర్లో గెలీలియో బాహటంగా కోపర్నికస్ విశ్వదర్శనాన్ని సమర్ధిస్తూ రాశాడు. అందుకు ఉదాహరణగా జూపిటర్ చందమామల వృత్తాంతాన్ని పేర్కొన్నాడు. అసలు గొడవ అక్కడ మొదలయ్యింది.
చర్చితో కలహం తన ఆరోగ్యానికి మంచిది కాదని గెలీలియోకి బాగా తెలుసు. ఎలాగైనా పోప్ ని స్వయంగా కలుసుకుని తన అభిమతాన్ని స్పష్టంగా వివరించాలని అనుకున్నాడు.
రోమ్ ని మరో సారి సందర్శించడానికి తగ్గ అవకాశం కోసం ఎదురుచూడసాగాడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, ఇప్పుడు వద్దని హితులు వారించారు. ఎందుకంటే ఈ నడిమి కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి. అప్పటి పోప్ పాల్ V, కోపర్నికస్ బోధనలు మతబోధనలకి అనుకూలంగా ఉన్నాయో, లేక మతధిక్కారాన్ని (heretic) సూచిస్తాయో తీర్పు చెప్పమని ఓ సదస్సుని నియమించాడు. ఆ సదస్సు సమావేశమై, విషయాన్ని పరిశీలించి, సూర్యుడు విశ్వానికి కేంద్రం అని చెప్పే బోధన “అవివేకం, అసంగతం... పూర్తిగా మతవిరుద్ధం” అని తేల్చిచెప్పింది. ఆ కారణం చేత రోమ్ లో గెలీలియోకి వ్యతిరేకమైన వాతావరణం నెలకొంది. ఆ నేపథ్యంలో గెలీలియో 1615 డెసెంబర్ లో రోమ్ ని సందర్శించినప్పుడు వెంటనే పోప్ ని కలుసుకోలేకపోయాడు గాని అక్కడ టస్కనీ దూత ఇంటికి విందుకు మాత్రం వెళ్లగలిగాడు. పోప్ పాల్ V మాత్రం చర్చి కి ప్రతినిధిగా, కార్డినల్ బెలార్మిన్ ద్వారా గెలీలియోకి ఈ ఘాటైన సందేశం పంపించాడు. ఆ సందేశంలోని ముఖ్యాంశాలు ఇవి:
1. సూర్యుడు స్థిరంగా ఉన్నాడన్న భావనని గాని, భూమి కదులుతోందన్న భావనని గాని గెలీలియో ఎక్కడా సమర్ధించకూడదు, బోధించకూడదు
2. అసలు ఆ భావనలని గెలీలియో స్వయంగా నమ్మకూడదు
3. ఊరికే వాదన కోసం కూడా వాటి తరపున వాదించకూడదు
కాని తదనంతరం మార్చ్ 1616 లో గెలీలియో పోప్ ని స్వయంగా కలుసుకుని తన పరిస్థితిని పుర్తిగా వివరించాడు. తనకి చర్చికి ఎలాంటి విరోధం లేదని, తనకి దైవం పట్ల భక్తి, పోప్ పట్ల గౌరవం మెండుగా ఉన్నాయని విన్నవించుకున్నాడు. పోప్ అంతా విన్నాడు. గెలీలియో పాండిత్యం పట్ల, ప్రతిభ పట్ల ఎంతో గౌరవం ఉన్నవాడు ఈ పోప్. తన వల్ల చర్చి యొక్క అధికారానికి ప్రమాదం లేదనుకున్నాడు. తన కంఠంలో ప్రాణం ఉండగా గెలీలియోకి ఏ ప్రమాదమూ లేదని, చర్చి వల్ల ఏ సమస్యా రాదని హామీ ఇచ్చి పంపాడు. తేలకపడ్డ మనసుతో గెలీలియో టస్కనీకి తిరిగి వెళ్లాడు.
ఆ తరువాత కూడా గెలీలియోకి, చర్చికి మధ్య అడపాదపా భావసంఘర్షణ జరుగుతూనే ఉంది. 1618 లో మూడు తోకచుక్కలు కనిపించాయి. వాటిని చూసిన కొందరు జేసూట్ ఖగోళవేత్తలు (వాళ్లలో షైనర్ కూడా ఉన్నాడు) వాటి శకునం గురించి నానా వ్యాఖ్యానాలు చేశారు. అది చదివిన గెలీలియో వాటిని హేళన చేస్తూ ఇలా రాశాడు. హోమర్ లాంటి కవులు ఇలియడ్ లాంటి కమ్మని కవితలు అల్లినట్టు, ఖగోళ శాస్త్రం అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు అందమైన కల్పనలు అల్లడం కాదన్నాడు. విశ్వ గ్రంథాన్ని చదవాలంటే
“... ముందు ఆ పుస్తకం రాయబడ్డ భాష అర్థం కావాలి, ఆ భాషలోని అక్షరాలు చదవడం రావాలి. ఆ భాష గణిత భాష. అందులోని అక్షరాలు త్రిభుజాలు, వృత్తాలు మొదలైన జ్యామితీయ ఆకారాలు. ఆ ఆకృతుల రహస్యాలు తెలియకపోతే ఆ పుస్తకంలో ఒక్క పదం కూడా అర్థం కాదు...”
ఆ విధంగా జెసూట్ ల వ్యాఖ్యానాలు వట్టి కాకమ్మ కథలని దుమ్మెత్తి పోసి తనలోతనే సంతోషించి ఉంటాడు గెలీలియో. కాని ఈ ’ఎత్తిపోతల’తో తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడని గ్రహించలేకపోయాడు.
(సశేషం...)
0 comments