శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

చందమామ మీద రైళ్లూ, బస్సులూనా?

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 2, 2010


చందమామ మీద నీరు, ఆక్సిజన్

కాని ఇవన్నీ సాధ్యం కావాలంటే మనం ముఖ్యంగా సమకూర్చుకోవలసినది ఆక్సిజన్, నీరు. చంద్రుడి మీద వీటి కోసం ఎక్కడ వెతకాలో చెప్తాడు క్లార్క్.
చంద్రుడి మీద ఆక్సిజన్ శుద్ధ రూపంలో దొరక్క పోవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. మన భూమిలో కూడా పైపొర (crust) లో బరువు బట్టి చూస్తే సగం భాగం ఆక్సిజనే (ఆక్సైడ్ల రూపంలో, ఉదాహరణకి సిలికాన్ డయాక్సయిడ్ – SiO2) ఉంటుంది. కనుక చందమామ మీద ఉండే మట్టి కూడా ఇందుకు పూర్తిగా ఉండే అవకాశం తక్కువ. కనుక అక్కడ మట్టిలో కూడా తగినంత ఆక్సిజన్ ఉంటుందని ఆశించవచ్చు. తగినంత శక్తి లభ్యమై ఉంటే, ఆ ఆక్సిజన్ ని వెలికితీయవచ్చని సైద్ధాంతికంగా నిశ్చయంగా చెప్పొచ్చు.

మట్టిలో ఉండే ఎన్నో పదార్థాలలో నీరు కలిసి ఉంటుంది. (ఉదాహరణకి ఇనుము తుప్పు పట్టినప్పుడు ఆ ఫెర్రిక్ ఆక్సయిడ్ అణువు తో పాటు కొన్ని నీటి అణువులు కలిసి ఉంటాయి – Fe2O3 . x H20. అలా కలిసిన నీటిని water of hydration అంటారు.) ఆ పదార్థాన్ని వేడి చేసి ఆ నీటిని వెలికి తీయవచ్చు. అయితే అందుకు తగినంత వేడిమి కావాలి. చందమామ మీద వేడిమి కేం కొదవ లేదు. పగటి పూట సూర్యకిరణాలని ఓ నతాకార దర్పణం (concave mirror) తో కేంద్రీకరిస్తే చాలు, కావలసినంత వేడి...

చంద్రుడి మీద నీరు శుద్ధ రూపంలో గాని దొరికితే ఇలాంటి తిప్పలనీ తప్పుతాయి అంటాడు క్లార్క్. బహుశా గుహలలో, లేదా ఉపరితలం మీదనే తాత్కాలిక రూపాలలో నీరు గడ్డకట్టిన మంచు రూపంలో ఉండొచ్చన్న ఆశాభావం వ్యక్తం చేస్తాడు, (ఇటీవల చంద్రయాన్ మిషన్ వల్ల చందమామ మీద నీరు కనుక్కోబడ్డ విషయం అందరికీ తెలిసినదే.)
చందమామ మీద నీరు శుద్ధ రూపంలో దొరికితే రెండు ముఖ్యమైన సమస్యలు ఒకే దెబ్బకి తీరుతాయి. సూర్యతాపాన్ని ఉపయోగించి ఆ మంచుని నీటిగా మార్చుకోవచ్చు. ఆ నీటిని విద్యుత్ విశ్లేషించి (electrolyse) అందు లోంచి ఆక్సిజన్ ని వెలికి తీయొచ్చు. భవిష్యత్తులో కేంద్రక శక్తి మీద పని చేసే రాకెట్ల వినియోగం పెరుగుతుంది కనుక, చందమామ వద్దకి వచ్చే రాకెట్ల నుండి వచ్చే విద్యుచ్ఛక్తిని వాడి ఇవన్నీ చేసుకోవచ్చు ఆని ఊహిస్తాడు క్లార్క్. కాని కేంద్రక శక్తి మీద పని చేసే రాకెట్లు ఇప్పటికీ కేవలం సైన్స్ ఫిక్షన్ నవళ్లకే పరిమితం అని మనకి తెలుసు,

చందమామ లాంటి అపరిచిత లోకం మీద ఏం చెయ్యాలన్నా శక్తి అవసరం అవుతుంది కనుక, శక్తిని కాస్త పొదుపుగా వాడాల్సి ఉంటుంది. ఆ దృష్టితో చూస్తే ఇళ్లు కట్టే పద్ధతి కూడా మార్చుకోవాలంటాడు క్లార్క్. చందమామ మీద మొట్టమొదటి ఇళ్లు ఉపరితలం మీద కట్టుకోవడం ఒక పద్ధతి. అలా కాకుండా మట్టి లోపల నేల మాళిగలో కట్టుకొవడం వల్ల మరిన్ని లాభాలు ఉంటాయంటాడు క్లార్క్. అంతకు ముందు మార్స్ గ్రహం మీదకి వల వృత్తాంతం గురించి చర్చిస్తూ ఒక పోస్ట్ లో మార్స్ లో కూడా అలా నేల మాళిగలో ఇళ్లు కట్టే పథకాల గురించి చర్చించుకున్నాం. నేల లోపల ఇళ్లు కట్టుకుంటే నిర్మాణానికి ప్రత్యేకమైన పదార్థాలు భూమి నుండి మోసుకు రావలసిన పని ఉండదు. కేవలం మట్టిలో తీరుగా గోతులు తవ్వుకుంటే చాలు! పైగా మట్టి లోపల నివాసాలు ఉంటే, అక్కడ గాలి, ఉష్ణోగ్రత మొదలైన వాటిని నియంత్రించడం కూడా సులభం అవుతుంది.

చందమామ మీద నీరు తగినంత మోతాదులో ఉంటే మరో ముఖ్యమైన సమస్య కూడా తీరుతుంది. రాకెట్ల ఇంధనంగా కూడా అది పనికొస్తుంది. నీటిని విద్యుత్ విశ్లేషించినప్పుడు ఆక్సిజన్ తో పాటు హైడ్రోజెన్ కూడా వస్తుంది. ఈ పదార్థాలని రాకెట్ ఇంధనంలో వాడుకోవచ్చు. అప్పుడు దారే పోయే రాకెట్లు చందమామ మీద ఓసారి దిగి అక్కడ “రీఫ్యూయెలింగ్” చేసుకునే అవకాశం ఉంటుంది. అదే నిజం అయితే అంతరిక్షయానం యొక్క ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

ఉదాహరణకి ఒక వ్యోమ నౌక భూమి వాతావరణాన్ని వదిలి, మార్గ మధ్యలో ఇంధనం వాడకుండా సునాయాసంగా వీనస్ గ్రహాన్ని చేరుకోవాలంటే భూమిని వొదిలే సమయానికి 26,ooo mph వేగాన్ని చేరుకోవాలి. అదే చందమామ నుండి వీనస్ కి బయలుదేరిన నౌక కేవలం 7000 mph వేగాన్ని చేరుకుంటే చాలు. దానికి కారణం మన సహజ ఉపగ్రహానికి ఉండే అతి తక్కువ గురుత్వమే. అందుకే చందమామ మీద గాని ఏ కారణం చేతనైన అధిక మొత్తంలో శక్తి వనరులు దొరికాయంటే మాత్రం, మన అంతరిక్ష యానపు కార్యక్రమాలు బాగా పుంజుకుంటాయి. ముఖ్యంగా మన గ్రహాంతర యానం మరింత సులభతరం అవుతుంది. భూమి నుండి బయలుదేరే నౌకలు, భూమికి తిరిగొచ్చే నౌకలు కూడా చందమామ మీద ఆగడం ఆర్థికంగా లాభసాటి అవుతుంది. అయితే ఆ నౌకలు కూడా పూర్తిగా చందమామ మీద దిగవలసిన అవసరం ఉండదు. చంద్రుడికి దగ్గరిగా వచ్చి, చంద్రుడి చుట్టూ కక్ష్యలో ప్రవేశిస్తే చాలు. చంద్రుడి చుట్టూ తిరిగే రవాణానౌకలు, చందమామ ఉపరితలం నుండి పైన ప్రదక్షిణ చేస్తున్న నౌకకి ఇంధనం చేరవేయగలవు.

చందమామ మీద రైళ్లూ, బస్సులూనా?

అయితే చందమామని ఓ వీలైన అంతరిక్ష నౌకాశ్రయంగా పరిగణించడమే తప్ప, అక్కడ ఇక వేరే జీవితమే ఉండదా?
లేకనేం? తప్పకుండా ఉంటుంది అంటాడు ఆర్థర్ క్లార్క్.

(రైనా హువాంగ్ వేసిన చిత్రం – నాసా వెబ్ సైట్ నుండి)
భవిష్యత్తులో చందమామ మీద జీవనం కేవలం కొద్ది పాటి శాస్త్రవేత్తలు, మొదలైన సాంకేతిక సిబ్బందికి మాత్రమే పరిమితం అవుతుందా, లేక కోట్ల కొద్ది స్త్రీపురుషులతో, గొప్ప వృక్ష సంపదతో చంద్ర గ్రహం అలరారుతుందా అన్నది కచ్చితంగా చెప్పడం కష్టం. ఏదేమైనా పలు దేశాలు చందమామ మీద పలు చోట్ల స్థావరాలు స్థాపించి, అక్కణ్ణుంచి తమ వ్యవహారాలు నడిపించే రోజు రాకమానదు. అలాంటి పరిస్థితుల్లో చందమామ మీద వివిధ ప్రాంతాలని కలుపుతూ ఏవో రవాణా సౌకర్యాలు తప్పకుండా ఉండాలి. ఆ నిర్వాతమైన లోకంలో విమానాలు ఎగరలేవు కనుక ఆ సౌకర్యం వీలుపడదు. అలాగని అందుకు రాకెట్లు వాడదామా అంటే అది మరీ ఎక్కువ వ్యయంతో కూడుకున్న వ్యవహారం అవుతుంది. కనుక చందమామ మీద రైల్వేల సంస్థాపన చాలా మేలైన పని అని సూచిస్తాడు క్లార్క్. అవి కాకుండా పెద్ద పెద్ద టైర్లు కలిగిన రోడ్డు వాహనాలు కూడా వాడబడతాయేమో నంటాడు.

ఆ రోజు రానే వస్తే ఇక అప్పుడు సెలవలకని, శ్రీహరి కోటలో రాకెట్ ఎక్కి, చందమామ మీద భారతీయ స్థావరం వద్ద దిగి, అక్కణ్ణుంచి ఓ రైలెక్కి, ఓ బస్సెక్కి, ఓ పేద్ద ఉల్కాబిలం సమీపం లో ఉండే ఓ రిసార్ట్ లో దిగి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో పాటు హాయిగా ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే కవితావేశం పెల్లుబికి ఆ సమయంతో ప్రియురాలి ముఖాన్ని చందమామతో పోల్చకండేం! పళ్లు రాలే ప్రమాదం ఉంది. కావాలంటే చందమామ మీద చీకటి ఆకాశంలో పలచని నీలి కాంతితో మెరిసే పృథ్వితో పోల్చుకోండి...


(సమాప్తం)

2 comments

  1. ఈ నతాకారమేంటోగానీ నేను మాత్రం కుంభాకార దర్పణాలను గురించి చదివాను. ఇవి అవే ఎంత బాగుణ్ణో కదా!

    మీ ప్రయత్నం అభినందనీయం.

     
  2. Indian Minerva garu:

    పుటాకార = నతోదర = నతాకార = concave
    కుంభాకార = convex

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts