చంద్రుడిపై కట్టబోయే మొట్టమొదటి ఇళ్లు తప్పనిసరిగా చాలా చిన్నవిగానే ఉంటాయని సులభంగా ఊహించొచ్చు. దాన్ని ఇల్లు అనే కన్నా ఓ అధునాతన గుడిసె అని అనుకోవచ్చేమో! పునశ్శక్తివంతమైన బట్ట (reinforcement fabric) చేతగాని, ప్లాస్టిక్ పొర చేత గాని నిర్మించబడి, అర్థగోళాకారంలో ఉన్న చిన్న మందిరం లాంటిది నిర్మించుకోవాలి. అందులో అధికపీడనం వద్ద గాలి పూరించి అది ఉబ్బెత్తుగా పొంగి ఉండేట్టు చెయ్యాలి. దానికి ద్వారంలా పనిచేసే ఓ ఎయిర్లాక్ ని ఏర్పాటు చెయ్యాలి. దాని మీద పడ్డ సూర్యకిరణాల వల్ల మందిరం లోపలి భాగం వేడెక్కిపోకుండా, దాని మీద సిల్వర్ పూత వేసుకోవచ్చు. ఆ పూత వల్ల మీద పడ్డ కాంతి ప్రతిబింబితమై తిరిగి అంతరిక్షంలోకి పోతుంది. చూడడానికి ఇలాంటి మందిరం ఎస్కిమోల “ఇగ్లూ” లాగా ఉంటుందేమో. మన మొట్టమొదటి చంద్ర స్థావరం (Lunar Base) అలా ఉండొచ్చు.
(చంద్ర గ్రామాన్ని ప్రదర్శించే ఓ ఆధునిక ఊహాచిత్రం)
తొలి దశల్లో చంద్రుడికి ప్రయాణమయ్యే రాకెట్లు అధికశాతం ఆ చంద్ర స్థావరం దరిదాపుల్లోనే వాలే అవకాశం ఉంది. స్థావరాన్ని విస్తరించ డానికి అవసరమయ్యే పదార్థాలని భూమి నుండి బట్వాడా చేసే రాకెట్లు ఆ ప్రదేశంలోనే ఆగుతాయి. అలాంటి ఏర్పాటు వల్ల భూమి నుండి వచ్చే వనరులన్నీ ఒక్కచోటే పోగవుతాయి. అలా కాకుండా తొలిదశల్లోనే భూమి నుండి రవాణా అయ్యే వనరులు మొత్తం చందమామ ఉపరితలం అంతా విస్తరింపజేయడం మంచిది కాదు. ఇంచుమించు ఆఫ్రికా ఖండం అంత పెద్ద చంద్ర ఉపరితలం మీద వనరులని సమంగా పంచడం ఇంచుమించు అసంభవం. కనుక ఆ మొట్టమొదటి స్థావరం ఎక్కడ ఉండాలి అన్న నిర్ణయం చెయ్యడానికి చందమామ ఫోటోల మీద, అధిక సంఖ్యలో మనుషులు చందమామ వద్దకి ప్రయాణించక ముందు రోబో బృందాలు చేసిన పర్యవేక్షణల మీద, ఆధారపడవలసి ఉంటుంది. భూమి నుండి చూసినప్పుడు చందమామకి ఒక పక్కే మనకి కనపిస్తుందని బాగా తెలిసిన విషయమే. ఈ మొట్టమొదటి స్థావరం భూమినుండి కనిపించే ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యడం మంచిది. ఆ విధంగా అయితే స్థావరానికి భూమికి మధ్య సమాచార ప్రసారాలు నిరంతరాయంగా జరిగే అవకాశం ఉంటుంది.
చందమామ మీద స్థావరాన్ని ఏర్పాటు చేశాక అక్కడ మొట్టమొదట తలపెట్టదగ్గ ఓ కార్యక్రమం ఓ వేధశాల (observatory) ని నర్మించడం. కనీసం ఓ 20 ఇంచిల వ్యాసం ఉన్న పరావర్తనపు దూరదర్శిని (reflecting telescope) అక్కడ స్థాపించాలి. దాని కోసమని ప్రత్యేకంగా ఓ వ్యోమనౌకని ఉపయోగించినా నష్టమేం లేదు. చందమామ మీద ఉండే వేధశాల వల్ల కొన్ని ప్రత్యేక లాభాలు ఉన్నాయి. భూమి మీద నుండి ఖగోళాన్ని చూసినప్పుడు వాతావరణం ఓ ఆచ్ఛాదనలా అడ్డొచ్చి దృశ్యాన్ని కలుషితం చేస్తుంది. కాని చందమామ మీద అలంటి సమస్య లేదు కనుక మరింత మేలైన పరిశీలనలు చేసుకోవచ్చు. తరువాత చందమామ మీద రాత్రి 14 (భూమి) రోజులు, పగలు 14 (భూమి) రోజులు ఉంటుంది కనుక వరుసగా 14 రోజుల పాటు రాత్రి పూట హాయిగా రోదసిలోకి తొంగిచూడొచ్చు. అలాంటి అద్భుతమైన వేధశాల వల్ల ఖగోళశాస్త్రంలో ఎంతో కాలంగా తేలని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తాడు క్లార్క్. ఉదాహరణకి మార్స్ గ్రహం మీద వెనకటికి కొన్ని “కాలువలు” ఉన్నాయని, అవన్నీ అక్కడి నాగరిక జీవుల ఉన్కికి ఆనవాళ్ళు అని కొందరు పరిశీలకులు పొరబడ్డారు. చందమామ మీద వేధశాల నిర్మిస్తే అలంటి మార్స్ ఉపరితలాన్ని మరింత స్పష్టంగా చూడొచ్చని, ఆ “కాలువల” సంగతేంటో తేల్చుకోవచ్చని అంటాడు క్లార్క్. అయితే చందమామ మీద వేధశాలతో పని లేకుండానే 1965 లో అమెరికా పంపిన మారినర్-4 నౌక తీసిన మార్స్ చిత్రాల వల్లను, ఆ తరువాత విలియమ్ హార్ట్ మన్ అనే శాస్త్రవేత్త తీసిన చిత్రాల వల్లను ఈ “కాలువల” సమస్య విడిపోయింది. అవి కాలువలు కావని, మార్స్ గాలులు మట్టిలో గీసిన బాటలని ఆ పరిశీలనల వల్ల తేలింది.
చందమామ మీద వేధశాల వల్ల లాభాల్లో మరొకటి కూడా పేర్కొంటాడు క్లార్క్. వాటి వల్ల మరింత మెరుగైన సమాచారం అందడమే కాదు. చందమామ మీద గురుత్వం తక్కువ కావడంతో అక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలుచెయ్యడం భూమి మీద కన్నా కొంచెం సులభం. అయితే తొలి దశల్లో అలాంటి పెద్ద పెద్ద వేధశాలల నిర్మాణం జరిగే అవకాశం తక్కువ. ఎందుకంటే అంత పెద్ద నిర్మాణాల జరగడానికి ముందు అక్కడ ఊరికే స్థావరం ఉంటే సరిపోదు. ఓ పూర్తి గ్రామాన్ని, అంటే ఓ చంద్రగ్రామాన్ని (moon colony) నిర్మించుకోవాలి. అక్కడ తగిన సంఖ్యలో సిబ్బందిని పోగుచేసుకోవాలి.
కాని ఇవన్నీ సాధ్యం కావాలంటే మనం ముఖ్యంగా సమకూర్చుకోవలసినది ఆక్సిజన్, నీరు. చంద్రుడి మీద వీటి కోసం ఎక్కడ వెతకాలో చెప్తాడు క్లార్క్.
(సశేషం...)
Image credits:
http://www.planit3d.com/source/gallery_files/lyne/moonbase.jpg
0 comments