మర్నాడు ఉదయం సుబ్బారావు టిఫిన్ చేద్దామని మళ్ళీ హోటల్ లో రెస్టారెంట్ కి వెళ్లాడు. మళ్లీ అక్కడ ప్రొఫెసర్ కనిపించాడు. రాత్రి తనకి వచ్చిన చిత్రమైన కల గురించి ప్రొఫెసర్ కి పూస గుచ్చినట్టు చెప్పాడు.
కల అంతా విన్నాక ప్రొఫెసర్ అన్నాడు,
“విశ్వం అంతా అలా అంతరించిపోవడం కాస్త బాధాకరమైన ముగింపే. కాని ప్రస్తుత స్థితిలో గెలాక్సీలు పరస్పరం దూరం అయ్యే వేగం ఎంత ఎక్కువగా ఉందంటే విశ్వం ఇలా అంతులేకుండా వ్యాకోచిస్తూనే ఉంటుంది. గెలాక్సీల మధ్య దూరం పెరుగుతూ విశ్వంలో ద్రవ్యరాశి యొక్క విస్తరణ ఇంకా ఇంకా పలచబడుతూనే ఉంటుంది. ఏదో ఒక దశలో తారలలోని ఇంధనం అంతా హరించుకుపోయాక అవి కూడా చల్లబడిపోతాయి, చచ్చిపోతాయి. అప్పుడిక విశ్వం అంతా అనంతంగా విస్తరించిన ఈ తాపరహిత, క్రియారహిత మహాశిలల మరుభూమిలా తయారవుతుంది. ఇది ఒక వాదం.”
“ఇందుకు భిన్నంగా ఆలోచించే శాస్త్రవేత్తలూ ఉన్నారు. వీళ్లది నిశ్చల స్థితి విశ్వదర్శనం (theory of a steady state universe). వీళ్ల భావన ప్రకారం విశ్వం సంకోచ వ్యాకోచాలు లేకుండా ఎప్పుడూ నిశ్చలంగా ఉంటుంది. అనంతమైన గతంలోనూ అలాగే ఉండేది, అనంతమైన భావిలోనూ అలాగే ఉండబోతుంది. ఇలాంటి విశ్వం బ్రిటిష్ సామ్రాజ్యానికి మహా నచ్చేస్తుందేమో! ఎందుకంటే వాళ్ల హయాంలో ఉన్న రాజ్యాలని ఎదుగు బొదుగు లేకుండా తొక్కి పట్టి ఉంచడం వారికి వెన్నతో పెట్టిన విద్య. కాని నిశ్చల స్థితి సిద్ధాంతం నిజమని నేను నమ్మడం లేదు. ఈ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించిన వ్యక్తి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో సైద్ధాంతిక ఖగోళ శాస్త్రంలో ప్రొఫెసరు. ఈ పెద్దమనిషికి సంగీతం, నాటకం మొదలైన కళా విషయాల్లో కూడా మంచి ప్రవేశం ఉంది. ఈ సిద్ధాంతం గురించి ఆయన ఓ పెద్ద నృత్యనాటిక కూడా రాశాడు. వచ్చే వారమే ఆ నాటక ప్రదర్శన. కావాలంటే మా రమ్యని తీసుకెళ్లు. సరదాగా ఉంటుందేమో!”
బీచి నుండి తమ సొంతూరికి తిరిగొచ్చిన కొన్నాళ్ల తరువాత ఒక రోజు రమ్య, సుబ్బారావులు ఆ నృత్య నాటిక చూడడానికి వెళ్లారు. ఐదొందల రూపాయల టికట్లు కొనుక్కుని, ముందు వరసలో ఉండే మెత్తని సీట్లలో కుర్చుని, యవనిక ఎప్పుడు లేస్తుందా అని ఇద్దరూ ఉత్కంఠతో చూస్తూ కూర్చున్నారు. కాసేపయ్యాక తెరలో చిన్న కదలిక కనిపించింది. ఇద్దరూ ఊపిరి బిగబట్టారు. తెర లేవలేదు గాని సన్నగా, పీలగా ఉన్న ఓ బట్టతలాయన తెరసందుల్లోంచి బయటికి పొడుచుకొచ్చాడు. ఆయన చెవుల్లోంచి పొడుచుకొస్తున్న కేశసౌభాగ్యం అల్లంత దూరం నుండి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ’నాటకం మేనేజరు కామోసు’ అనుకున్నారంతా. ఏవో అనివార్య కారణాల వల్ల నాటకం ఆలీసెం అవుతోందని, కాస్త ఓపిక పట్టమని విన్నవించుకుని వెనక్కు మళ్లాడు. అలా మరో రెండు సార్లు విన్నవించుకునేసరికి ప్రజలకి సహనం చచ్చి, చేతికి వచ్చింది విసరడానకి చేతులెత్తబోయేంతలో ఎవరో తెర ఎత్తేశారు.
గణపతి స్తోత్రంతో మొదలెట్టడం ఆనవాయితీ కనుక వేదిక మీద గణపతి పటం కోసం అందరి కళ్లూ గాలించాయి. కాని అలాంటిదేవీ కనిపించలేదు. అసలు ఏవీ కనిపించలేదు. కళ్లు జిగేలు మనిపించే ప్రచండ కాంతితో వేదిక నిండిపోయింది.
ఐదొందల రూపాయలు, యాభై రూపాయలు అన్న తారతమ్యం లేకుండా, హాల్లో సీట్లన్నిటినీ ఆ కాంతి ఉప్పెనలా ముంచెత్తింది.
నెమ్మదిగా ఆ కాంతి పలచబడింది. దాని స్థానంలో క్రమంగా చీకటి చోటుచేసుకోసాగింది. హాల్లో ఎటు చూసినా చీకటే వ్యాపించింది. ఆ చీకట్లో అక్కడక్కడా దివిటీల్లా... కాదు నిప్పులు చెరిగే దీపావళి విష్ణు చక్రాల్లా అక్కడక్కడ ఏవో కాంతిమయమైన వస్తువులు కనిపిస్తున్నాయి. అంతలో నేపథ్యంలో కమ్మని సంగీతం ఊటలా పుట్టుకురాసాగింది. ఎన్నో వీణలు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని కమ్మని స్వరాల తేనె తీపులతో ఆ నిశిని నింపసాగాయి. వినసొంపైన మృదంగ ధ్వనులు ఆ కాంతి వర్షపు చిటపటల్లా అనిపించసాగాయి. అలా ఆ కాంతివలయాల విశ్వలాస్యం కొనసాగుతుండగా, ఆ విశ్వసంగీత తరంగాలు మిన్నంటుతుండగా ...
...ఓ నిలువెత్తు మనిషి నిండుగా సూటుబూటుతో రంగప్రవేశం చేశాడు.
(సశేషం...)
0 comments