“ఏంటిది సుబ్బూ?” గట్టిగా కుదుపుతూ రమ్య అన్న మాటలకి లేచి కూర్చున్నాడు సుబ్బారావు.
“ఏ కాలంలోనైనా, ఏ స్థలంలోనైనా హాయిగా నిద్రపోగలవని నాకు తెలుసు. కాని ఇంత మంచి సాంస్కృతిక కార్యక్రమంలో కూడా ఇలా నిద్రపోవడం ఏం బాలేదు,” కాస్త బాధగా అంది రమ్య.
కాసేపట్లో సుబ్బారావు రమ్యని వాళ్ల ఇంట్లో దిగబెట్టాడు. బయట వరండాలో ప్రొఫెసర్ కూర్చుని “ఆంధ్ర విజ్ఞానం” అనే పత్రిక తిరగేస్తున్నాడు.
“ఏవయ్యా ఎలా వుంది నాటకం?” అడిగాడు ప్రొఫెసర్.
“ఓ బ్రహ్మాండం!” తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అన్నాడు సుబ్బారావు. “ముఖ్యంగా శాశ్వత, నిశ్చల విశ్వం గురించి ఆయనెవరో పాడిన గీతం చాలా నచ్చింది. హమ్మయ్య అనిపించింది.”
“అనిపిస్తే అనిపించింది. కాని ఆ సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మకు. మెరిసేదంతా బంగారం కాదంటారు. ఇప్పుడే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన మార్టిన్ రైల్ రాసిన వ్యాసం ఒకటి చదువుతున్నాను. ఇతగాడు ఓ పెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మించాడు. మౌంట్ పాలొమర్ లో ఉన్న 200 ఇంచిల టెలిస్కోప్ కన్నా ఇది చాలా శక్తివంతమైనది. దీంతో మరింత దూరాలలో ఉన్న గెలాక్సీలని పరిశీలించొచ్చు. ఆయన పరిశీలనల ప్రకారం మనకి సమీపంలో ఉన్న గెలాక్సీల కన్నా దూరంలో ఉన్న గెలాక్సీలు మరింత దగ్గరి దగ్గరిగా ఉన్నాయి.”
“అంటే మనం ఉన్న చోట గెలాక్సీల సాంద్రత తక్కువగా ఉందని అనుకోవాలా?” అడిగాడు సుబ్బారావు.
“అలాంటిదేం లేదు,” ప్రొఫెసర్ వివరించుకుకొచ్చాడు. “కాంతి వేగం అమితం కాదని మనకి తెలుసు కనుక విశ్వంలో దూరాల లోతుల్లోకి తొంగి చూస్తున్నప్పుడు, ఆయా ప్రాంతాల గతంలోకి కూడా తొంగి చూస్తున్నాం అన్నమాట. ఉదహారణకి సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి ఎనిమిది నిముషాలు పడుతుంది. అంటే సూర్యుడి మీద మనం గమనించిన, ఎగసి పడుతున్న సౌరాగ్నికీల (solar flare) ఎనిమిది నిముషాల క్రితమే జరిగిపోయింది అన్నమాట. అలాగే మనకి సమీపంలో ఉన్న పెద్ద గెలాక్సీ – ఆండ్రోమెడా గెలాక్సీ – పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని చిన్నప్పుడు చదువుకున్నాం. అంటే ప్రస్తుతం మనం తీస్తున్న ఆ గెలాక్సీ చిత్రాలు పది లక్షల సంవత్సరాల క్రితం ఆ గెలాక్సీ ఎలా ఉండేదో చూపిస్తున్నాయి. కనుక మార్టిన్ రైల్ తన రేడియో టెలిస్కోప్ ద్వారా చూస్తున్న, లేదా వింటున్న సంకేతాలన్నీ ఆ విశ్వప్రాంతాల్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విశేషాలు. విశ్వం ఎప్పుడూ నిశ్చలంగా ఉన్నట్లయితే దూరంలో గెలాక్సీల సాంద్రత ఎలా ఉందో, సమీపంలో కూడా అలాగే ఉండాలి. కాని దూరంలో ఉన్న గెలాక్సీల సాంద్రత మరింత ఎక్కువగా ఉందని చూపిస్తున్న రైల్ పరిశీలనలకి అర్థం ఏంటంటే, గతంలో ఆ దశలో విశ్వం అంతటా గెలాక్సీల సాంద్రత కాస్త ఎక్కువగా ఉందన్నమాట. అదే నిజమైతే ’స్థిర స్థితి విశ్వ సిద్ధాంతం’ తప్పన్నమాట. విశ్వం వ్యాకోచిస్తోందని చెప్పే కొత్త సిద్ధాంతాన్ని ఈ పరిశీలనలు సమర్ధిస్తున్నాయి. అయితే ఈ ఒక్క పరిశీలనతోనే ఒక నిర్ణయానికి రాకుండా, మరింత సమాచారం కోసం ఎదురుచూడాలి.”
(సశేషం...)
0 comments