నిన్న డిస్కవరీ సైన్స్ లో ఓ ప్రోగ్రాం చూశాను.
ఎక్కడో ఓ ఎడారిలో రాళ్ళు వాటంతకవే కదుల్తూ పోతుంటాయట. పైగా అవి కదిలిన దారి వెంట ఓ కచ్చితమైన జాడ కూడా పడుతుందట. అదేదో మహత్యం అని మొదట్లో అంతా అనుకునేవారు. కాని అలా మహత్యంలా, విచిత్రంలా కనిపించే విషయంలోకి కూడా క్రమబద్ధంగా శోధించి, అందులోని రహస్యాన్ని అంచెలంచెలుగా బయటకు ఎలా తీశారన్నదే ఈ ప్రోగ్రాం లోని సారాంశం. ఆసక్తికరంగా అనిపించి గూగుల్ చేస్తే మరి కొంత సమాచారం కనిపించింది. ఆ విషయాలన్నీ క్లుప్తంగా ఈ వ్యాసంలో...
అమెరికాలో, కాలిఫోర్నియాలో, డెత్ వాలీ నేషనల్ పార్క్ లో ’Racetrack Playa’ అనే ప్రాంతంలో ఈ విచిత్రమైన రాళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రేస్ట్రాక్ ప్లాయా సముద్ర మట్టానికి 3608 అడుగులు పైన ఉంటుంది. పొడవు 4.5 కి.మీలు, వెడల్పు 2 కి.మీ.లు ఉంటుంది. చాలా చదునుగా ఉంటుంది. కొండల మధ్య ఇమిడి ఉన్న ఓ విశాలమైన మైదానం లాంటిది ఈ ప్లాయా.
ఇక్కడ కనిపించే ఓ విశేషం ఈ కదిలే రాళ్లు. అయితే ఈ కదలిక చాలా నెమ్మదిగా సాగుతుంది. రెండు మూడేళ్లకి ఒకసారి కదులుతాయి. ఒకసారి కదలగా ఏర్పడ్డ బాటలు/జాడలు మూడు నాలుగు ఏళ్ల పాటు నిశ్చలంగా ఉంటాయి. పెద్ద పెద్ద బండలు కూడా నెమ్మదిగా జరుగుతూ పోతుంటాయి (చిత్రం). కొన్ని బండలు సూటిగా సరళ రేఖల్లో కదిలితే, కొన్ని వంకర టింకర గతుల్లో కదులుతుంటాయి. దీన్ని వీడియో తీసిన వాళ్లు ఎవరూ లేరు. ఇది ఎలా జరుగుతుందో ఎవరికీ చాలా కాలం అంతుబట్టలేదు.
ఏంటీ రహస్యం?
దీని గురించి నానా రకాల ఊహాగానాలు బయలుదేరాయి.
ఆ ప్రాంతంలో పెద్దగా జంతు సంచారం కూడా ఉండదు. కనుక అది జంతువుల పని అయ్యే అవకాశం లేదు. జనసంచారం కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువ. అయితే పోలీసులు ప్రతీ చోట గస్తీ తిరుగుతుంటారు కనుక, ఆ ప్రాంతపు పోలీసులు ఊరికే జనాన్ని భయపెట్టాలని ఇలా రాళ్లు జరుపుతున్నారని ఓ సిద్ధాంతం బయలుదేరింది. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆ ప్రోగ్రాంలో “మాకు ఇంతకన్నా వేరే పనే లేదా?” అంటాడు ఆ ప్రాంతపు పోలీసొకడు!
మరి ఎవరు జరుపుతున్నారు వీటిని?
రేస్ట్రాక్ ప్లాయా లో ఓ గమనించదగ్గ విషయం అక్కడి బలమైన ఈదురు గాలులు. 90 mph వేగంతో విస్తుంటాయి అక్కడి గాలులు. ఈ గాలులు సామాన్యంగా నైరుతి (southwest) నుండి ఆ ప్రాంతంలోకి ప్రవేశించి ఈశాన్య (northeast) వైపు నుండి బయటికి పోతాయి. విశేషం ఏంటంటే రాళ్లు వేసే జాడలు కూడా తరచు ఆ దిశలోనే ఉంటాయి. అంటే మరి ఈ రాళ్లు గాలికి కదులుతున్నాయా?
అదే నిజమైతే ఆ విషయాన్ని ప్రయోగశాలలో, కృత్రిమ పరిస్థితుల్లో కూడా సాధించ గలగాలి. ఆ విషయాన్ని శాస్త్రీయంగా శోధించడానికి ఓ వైజ్ఞానిక బృందం పూనుకుంది. (అది ఏ యూనివర్సిటీయో గుర్తులేదు. క్షమించాలి.)
రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతం నుండి కొంత మట్టి తిసుకుని, దాంతో బురద తయారుచేసి, దాన్ని చదునుగా ఓ పళ్లెం మీద పరిచి ఎండబెట్టారు. అది బీటలు వారి రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతంలో సామాన్యంగా కనిపించే బీటలు వారిన నేల (చిత్రం) మాదిరిగా తయారయ్యింది. ఆ కృత్రిమ నేల మీద రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతం నుండి తెచ్చిన ఓ నాలుగు రాళ్లు ఉంచారు. ఇప్పుడు ఈ సరంజామాని ఓ వాయుసొరంగం (wind tunnel) లో పెట్టి వాయు వేగాన్ని క్రమంగా పెంచసాగారు. వాయువేగం 70 mph దాటుతుంటే ఆ రాళ్లలో ఓ చిన్న రాయి కొద్దిగా జరిగి ముందుకు దొర్లిపోయింది.
ఆశించినట్టే అయ్యింది. వైజ్ఞానిక బృందం చాలా సంతోషించింది. గాలికి రాళ్లని కదిలించగలిగే శక్తి ఉందన్నమాట. కాని ఇక్కడ ఓ సమస్య ఉంది. వాస్తవంలో రేస్ట్రాక్ ప్లాయా ప్రాంతంలోని రాళ్లు దొర్లవు (అరుదుగా తప్ప). ఎక్కువగా జారుకుంటూ, జాడలు వేసుకుంటూ ముందుకు పోతాయి. మరి ఆ పరిణామం ప్రయోగశాలలో కనిపించలేదు.
ప్రయోగంలో ఎక్కడో ఏదో లోపిస్తోంది? అదేంటబ్బా?
(మిగతాది వచ్చే పోస్ట్ లో...)
0 comments