పాపులర్ సైన్స్ అనే అమెరికన్ పత్రిక గురించి చాలా మంది వినే ఉంటారు. చాలా కాలంగా దీని గురించి విని ఉండడంతో ఇది పాత పత్రిక అని తెలుసుగాని మరీ ఇంత పాతదని ఇవాళే తెలిసింది. ఆ మాగజైన్ కి చెందిన గత 138 (అవును అంకెలో దోషం లేదు!) ఏళ్లనాటి పాత ప్రతులు ఇప్పుడు నెట్ లో పెట్టారు (గూగుల్ వారి సౌజన్యంతో). అదో మహా విజ్ఞాన భాండారం అని వేరే చెప్పనక్కర్లేదు. అమెరికాలో కొన్ని తరాల వారు పాపులర్ సైన్స్ చదువుతూ, స్టార్ స్ట్రెక్ చూస్తూ, అసిమోవ్, క్లార్క్ నవళ్లు చదువుతూ, స్టాన్లీ కుబ్రిక్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్లు ఉన్నారు. లక్షలాది మందికి ఈ సీరియళ్లు, పత్రికలు, పుస్తకాలు స్ఫూర్తి నిచ్చి సైన్సు దిక్కుగా మరల్చాయి.
పాపులర్ సైన్స్ archives ని ఊరికే తిరగేస్తుంటే ఒక చోట ఆర్థర్ క్లార్క్ రాసిన వ్యాసం ఒకటి కనిపించింది.
http://www.popsci.com/technology/gallery/2010-10/archive-gallery-space-colonies
ఏప్రిల్ 1952 నాటి సంచిక అది. చందమామ మీద స్థావరాలు ఎలా ఏర్పాటుచేసుకోవాలో వివరంగా ఏకరువు పెడుతున్నాడు మహానుభావుడు! (మనిషి చంద్రుడి మీద పాదం మోపడానికి 16 ఏళ్లకి ముందు). వ్యాసం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అందులో కొన్ని విశేషాలు.
కొత్తగా చంద్రుడి మీద మనిషి పాదం మోపిన దశలో ఇంకా స్థావరాలు, సొరంగాలు ఉండవు కనుక ఆ తొలి దశల్లో మనిషిని అక్కడికి మోసుకెళ్లే వ్యోమనౌకే తాత్కాలిక స్థావరంగా పనిచేస్తుంది. ఆ నౌకనే ఇల్లుగా చేసుకుని చుట్టు పక్కల ప్రాంతాలని స్పేస్ సూట్ లలో పర్యవేక్షించి రావలసి ఉంటుంది. బయట గాలి ఉండదు కనుక, స్పేస్ సూట్ లోపల పీడనం హెచ్చుగా ఉంటుంది. ఆ కారణం చేత సూట్ బిగుతుగా, వాహనపు టైర్లలా ఉండక తప్పదు. ఒక్క కీళ్ల దగ్గర మాత్రం సులభంగా వంగే వెసులుబాటు ఉంటుంది. ఇంచుమంచు కవచంలా ఉండే ఈ సూట్ల మరి భారీగానే ఉంటాయి. అయినా చందమామ మీద గురుత్వం తక్కువ కనుక భారీ సూట్లయినా సునాయాసంగా మోసేయొచ్చు అనుకుంటారేమో. బరువు వరకు అది నిజమే కావచ్చు గాని, భారీ సూట్ల ద్రవ్యరాశి ఎక్కువ కనుక వాటి జడత్వం (inertia) మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ఆ సమస్య ఏంటో చెయ్యి విదిలించినప్పుడో, కాలు వేగంగా పైకెత్తినప్పుడో స్పష్టంగా తెలిసొస్తుంది.
ప్రస్తుతం వ్యోమగాములు వాడే స్పేస్ సూట్లు ఇంచుమించు పైన క్లార్క్ చెప్పినట్టే ఉంటాయి. కాని వ్యాసంలో క్లార్క్ మరి కొన్ని రకాల స్పేస్ సూట్లని కూడా ఊహిస్తాడు. స్పేస్ సూట్లు మెత్తగా, శరీరం యొక్క రూపానికి అతుక్కునేట్టుగా ఉండాలంటే పైన చెప్పుకున్న స్పేస్ సూట్ లాంటిది తప్పని సరి అవుతుంది. దాంతో పాటు వచ్చే సమస్యలు కూడా తప్పవు. అలా కాకుండా కఠినంగా ఉండే లోహపు సూట్లు ఫరవాలేదు అనుకుంటే మరో రకం సూట్లని ఊహించుకోవచ్చు. సిలిండర్ లాంటి లోహపు సూట్ లో ముందు దృశ్యం కనిపించడానికి కిటికీ లాంటిది ఉంటుంది. కింద ప్రత్యేకంగా అమర్చిన లోహపు కాళ్లు ఉంటాయి. ఆ కాళ్లని మోటార్లతో/బ్యాటరీ శక్తితో నడిపించాలి. అసలు “కాళ్లు” ఉండే స్పేస్ సూట్లు సర్వశ్రేష్ఠం అనుకోవాల్సిన పని లేదంటాడు క్లార్క్. పోగో స్టిక్ (pogo stick) లాంటి సాధనం మీద కంగారూలలా గెంతుతూ పొవచ్చు అంటాడు. అలాంటి పోగో స్టిక్ ల మీద భవిష్యత్తులో “చందమామ మీద కుందేళ్ల” లా వ్యోమగామలు గెంతుతూ తిరిగే దృశ్యం ఊహించుకోడానికి గమ్మత్తుగా ఉంటుంది.
స్పేస్ సూట్లలో ఓ 12 గంటల పాటు వచ్చే ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు. కాని అంతకన్నా పెద్ద సమస్య సూట్ లోని ఉష్ణోగ్రతని నియంత్రించడం. చందమామ మీద ఇది చాలా పెద్ద సమస్య. ఎందుకంటే పగటి వైపు నుండి చీకటి వైపుకి వెళ్లగానే కొద్ది సెకన్లలోనే ఉష్ణోగ్రత 400 C కింద పడుతుంది. బాహ్య ఉష్ణోగ్రతలో ఈ విపరీతమైన మార్పులకి తట్టుకోవడానికి ఓ సులభమైన ఉపాయం ఉంది – దేహానికి, బహిరంగానికి మధ్య సూట్లో ఓ శూన్యపు పొర ఏర్పాటు చేసుకుంటే చాలు. చందమామ మీద గాలి పెద్దగా ఉండదు కనుక శూన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం పెద్ద కష్ట కాదు. కాని దీని వల్ల మరో సమస్య వస్తుంది. దేహం లోంచి పుట్టుకొచ్చే వేడి బయటికి పోలేక దేహం వేగంగా విపరీతంగా వేడెక్కిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక సూట్ లో పగటి పూట ఏ.సీ. వాడుకోక తప్పదు.
వాతావరణం లేకపోవడం వల్ల మాట్లాడుకోవడానికి రేడియో వాడడం తప్పదు. కాని ఈ రేడియోల రేంజి తక్కువ. చంద్రుడి వ్యాసం తక్కువ కనుక, రడియో తరంగాలు సరళ రేఖల్లో ప్రసారం అవుతాయి కనుక ఆరడుగుల ఎత్తు మనిషి నుండి ప్రసారం అయ్యే సంకేతాలు రెండు మైళ్లు మించి చేరవు... ఆ సహజ ఉపగ్రహం చుట్టూ, మనం కృత్రిమ ఉపగ్రహాలని స్థాపిస్తే తప్ప.
ఆ విధంగా వ్యోమనౌకే ఇల్లుగా, స్పేస్ సూటే వాహనంగా కొంత కాలం వ్యవహారం నడిపించొచ్చు. కాని ఏదో ఓ నాటికి ఇల్లు కట్టుకోవాలిగా? మరి ఆ ఇల్లు ఎలా ఉండాలి?
(సశేషం...)
0 comments