“అవును కలవవనే అనుకోవాలి. కాని ఆ విషయాన్ని నిర్ధారించడానికి ఎవరూ ఉండరు. ఎందుకంటే ఆ ఉన్నవారికి ద్రవ్యరాశి గల దేహం ఉండాలిగా?”
“అయితే బహుశా అసలు యూక్లిడ్ అన్న వాడే లేడేమో. అందుకే బొత్తిగా శూన్యమైన విశ్వానికి సంబంధించిన జ్యామితిని ఊహించి రాశాడు!” ఏదో గొప్ప ఆలోచన వచ్చినట్టు ఉత్సాహంగా అన్నాడు సుబ్బారావు.
అతను ఏం మాట్లాడుతున్నాడో ఒక్క నిముషం ప్రొఫెసర్ కి అర్థం కాలేదు. కాని ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి శాల్తీలతో వాదన పొడిగించే కన్నా, మౌనమే మేలని ఊరుకున్నాడు.
ఇంతలో పుస్తకం యొక్క ప్రతిబింబం అది మొదట బయలుదేరిన దిశలోనే ముందుకు సాగి, మళ్లీ రెండవ సారి దగ్గరికి రావడం కనిపించింది. ఇప్పుడా పుస్తకం మునుపటి కన్నా ఎక్కువగా పాడైపోయింది. గుర్తుపట్టలేనంతగా పాడైపోయింది. పుస్తకం నుండి వచ్చే కాంతి రేఖలు విశ్వం అంతా చుట్టి రావడం వల్ల అల కనిపిస్తోందని ప్రొఫెసర్ వివరించాడు.
“మీరు ఒక సారి తల తిప్పి చూస్తే నా పుస్తకం విశ్వం అంతా చుట్టి తిరిగి మన దగ్గరికి రావడం కనిపిస్తుంది.” అని ప్రొఫెసర్ అంటూనే గాల్లో కొట్టుకొస్తున్న పుస్తకాన్ని చెయ్యి చాచి చటుక్కున అందుకుని జేబులో పెట్టుకున్నాడు. “విశ్వంలో ఎంత దుమ్ము, ధూళి ఉందంటే విశ్వం అంచుల వరకే కాక, పూర్తిగా విశ్వం చుట్టుకొలత వెంట స్పష్టంగా చూడడం ఇంచుమించు అసంభవం అవుతుంది. మన చుట్టూ తారాడుతున్న ఛాయారూపాలు మన యొక్క, లేదా మన చూట్టూ ఉన్న వస్తువుల యొక్క ప్రతిబింబాలే కావచ్చు. కాలాయతనపు వంపు వల్ల, ధూళి వల్ల ఈ ప్రతిబింబాలు ఎంతగా విరూపం అయిపోయాయి అంటే, వాటి ఆనవాళ్లు గుర్తించడానికి కూడా వీలుకావడం లేదు.”
“మనం అంతకు ముందు జీవించిన అసలు విశ్వం, ఆ మహా విశ్వంలో కూడా ఇలాంటి పరిణామాలే జరుగుతాయా?” అమాయకంగా అడిగాడు సుబ్బారావు.
“తప్పకుండా జరుగుతాయి. కాని చిక్కేంటంటే ఆ అసలు విశ్వంలో కాంతి విశ్వం అంతా ఓ చుట్టు చుట్టి రావడానికి కోటానుకోట్ల సంవత్సరాలు పడుతుంది. ఆ విశ్వంలో కూడా వెనుక అద్దం లేకుండా క్షవరం చెయ్యించుకోవచ్చు. అయితే ఆ భాగ్యం కోసం మంగలి వాడి వద్ద కోటానుకోట్ల సంవత్సరాలు, విశ్వం అంతా చూట్టి తిరిగొచ్చే కాంతి కోసం, పడిగాపులు కాయవలసి ఉంటుంది. అదీ గాక తారాంతర ధూళి వల్ల దృశ్యం అలుక్కుపోయినట్టు ఉంటుంది. కనుక మంగలివాడి చాతుర్యం ఏ పాటిదో తెలుసుకొవడం అంత సులభం కాదు. ఈ విషయం గురించే ఓ బ్రిటిష్ ఖగోళ వేత్త ఒకసారి పరిహాసంగా అన్నాడు. మనం ప్రస్తుతం చీకటి ఆకాశంలో చూసే తారలలో కొన్ని ఎప్పుడో ఆ స్థానంలో ఉన్న తారల ప్రతిబింబాలు మాత్రమే.”
ఈ విచిత్ర వివరణలన్నీ విని విసిగిపోయిన సుబ్బారావు ఓ సారి ఇబ్బందిగా అటు ఇటు చూశాడు. ఇప్పుడు ఆకాశం మునుపటి కన్నా కాస్త తెరిపిపడడం చూసి ఆశ్చర్యపోయాడు. మునుపు ఉన్నంత ధూళి ఇప్పుడు లేదు. అంత వరకు ముక్కుకి అడ్డంగా కట్టుకున్న రుమాలు తీసేశాడు. ఆకాశంలో కొట్టుకొచ్చే రాళ్ల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. వాటి వేగం, ధాటి కూడా తగ్గింది. తాము నించుని ఉన్న లాంటి పెద్ద పెద్ద బండలు కూడా ఇప్పుడు దూరంగా తరలిపోయాయి.
“హమ్మయ్య!” గుండెల నిండా ఓ సారి ఊపిరి తీసుకున్నాడు సుబ్బారావు. “ఆ రాళ్లలో ఒకటి ఎప్పుడు నా నెత్తిన పడుతుందోనని భయపడి చచ్చాననుకోండి. అయినా ఉన్నట్లుండి మన పరిస్థితులు అలా ఎందుకు మారాయంటారూ?”
“ఓహ్! అదా? చాలా సులభం,” తనకి సులభం కాని ప్రశ్నలే లేవన్న ఫక్కీలో వక్కాణించాడు ప్రొఫెసరు. “మనం ఉంటున్న ఈ చిన్న విశ్వం కూడా వ్యాకోచిస్తోంది. మనం మొదట ఇక్కడికి వచ్చినప్పుడు దీని వ్యాసం ఐదు మైళ్లు అయితే, ప్రస్తుతం దీని వ్యాసం నూరు మైళ్లు. దూరంగా ఉన్న వస్తువులు కాస్త ఎర్రబారినట్టు కనిపించగానే అనుకున్నా, ఈ విశ్వం వ్యాకోచిస్తోందని.”
“అవును నిజమేనే. మీరు చెప్పినట్టు దూరంగా ఉన్న వస్తువులకి ఒక విధమైన గులాబి రంగు ఛాయ వున్నట్టుంది.” ’మీ అమ్మాయి బుగ్గల్లా,’ అని మనసులోనే అనుకుని, బయటికి మాత్రం వినమ్రంగా, “ఎందుకంటారూ?” అని ప్రశ్నించాడు సుబ్బారావు.
(సశేషం...)
నాకొకటి అర్ధం కవడంలేదు చక్రవర్తిగారు....,సుబ్బారావు సాపేక్షలోకంలో ఉన్నాడుకాబట్టి అతడి లోకంలో విశ్వం ఒక closed structure లా కనపడుతుందా (పుస్తకం తిరిగి వచ్చిందికదా..) ?
ప్రస్తుతం మనం విశ్వం అనంతంగా ఉందని అనుకుంటున్నాం an open but limited in expanse
http://scienceintelugu.blogspot.com/2010/08/blog-post_22.html లో చూపించినట్టుగా......ఈ విధమైన విశ్వంలో ఒక మూలనుండి బయల్దేరిన కాంతి మళ్ళి అక్కడకే రావడం ఎలా వీలౌతుంది ?
మన విశ్వంలోకూడా కాంతి విశ్వం అంచుల దగ్గర వంపు ( U-turn) తిరుగుతుందా ?
నాగార్జున గారు:
విశ్వంలో సగటున ప్రతీ చోట ధన వక్రత (positive curvature) ఉంది కనుక విశ్వం ఓ (four-dimensional ) బంతి లా ఉంటుంది. కనుక ఒక చోటి నుండి బయలుదేరిన కాంతి తిరిగి మొదలైన చోటికి వస్తుంది.
మునుపటి పోస్ట్ కి దీనికి మధ్య వైరుధ్యం లేదు.