“ఇన్నేళ్ళూ నువు పడ్డ శ్రమ
వృధా అయ్యింది మిత్రమ”
అని హొయల్ తో చేసె రైల్ సవాలు
“ఎన్నడూ మారని విశ్వం
ఎనకటి రోజుల గుడ్డి నమ్మకం
ఎక్కడా కనిపించదు దానికి ఆనవాలు.”
“నా దూరదర్శిని
నీ భావ వినాశిని.
మనం ఉంటున్న విశ్వం
ఎదుగుతోంది దినదినం
అవుతూ ఇంకా ఇంకా విరళం.”
“గామోవ్, లమేత్రులవి పనికిమాలిన భావాలు,”
ఘాటుగా బదులిచ్చాడు హొయలు,
“వారికి రాదు ఓ అంటే ఢం
మహా విస్ఫోటమట మహావిస్ఫోటం!
వారిని ఎందుకు ఊరికనే సమర్ధించటం?”
“ఇదుగో చూడు ప్రియ నేస్తం
చెప్తున్నా వినుకో నిజం
విశ్వానికి లేవు అంతం, ఆరంభం
అంటున్నాం బోండీ, గోల్డ్, నేను
ఇది కల్లయితే అసలు నేనే లేను.”
“అబద్ధం!” అరిచాడు రైలు
ప్రత్యర్థిపై చెరిగె నిప్పులు.
“నువ్వే చూడు గెలాక్సీల ఛందం
దాపున కన్నా దవ్వున సాంద్రం
నిజం అవుతోంది బట్టబయలు.”
’చాల్లే వయ్యా రైలు”
కోపంగా అన్నాడు హొయలు.
“విశ్వంలో కొంగ్రొత్త పదార్థం
పుట్టుకొస్తోంది ప్రతీదినం
నిత్యమై విలసిల్లెను విశ్వం.”
...
పద్యం ఇంకా చాలా బోలెడు ఉండడంతో, చదువుతూ కూర్చుంటే ఇక్కడే తెల్లారుతుందని గ్రహించిన సుబ్బారావు, పద్యాన్ని బాగా ఆకళింపు చేసుకున్న వాడిలా, బయటికి గట్టిగా నవ్వుతూ, చదవమని దాన్ని రమ్యకి అందించాడు. నాలుగు వాక్యాలు చదవగానే ఆ అమ్మాయి ముఖంలో విరిసిన చిరునవ్వు పువ్వులని సంతోషంగా ఓ సారి చూసుకుని, ప్రొఫెసర్ కి, రమ్యకి గుడ్ నైట్ చెప్పి నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు.
--
(ఇక్కడితో “సుబ్బారావు సాపేక్ష లోకం” సమాప్తం. మూల గ్రంథంలో ఇక్కణ్ణుంచి “క్వాంటం మెకానిక్స్” కి సంబంధించిన విశేషాలు మొదలవుతాయి. ప్లాంక్ స్థిరాంకం (Planck’s constant) చాలా పెద్దదిగా ఉన్న ప్రపంచంలో దైనిక జీవన ఘట్టాలలో కూడా క్వాంటం ప్రభావాలు కనిపిస్తుంటాయి. జీవితం గందరగోళంగా మారిపోతుంది. అలాంటి ప్రపంచంలో Mr. Tompkins పడే కష్టాలే ఇక్కణ్ణుంచి వృత్తాంతం. ఈ విషయాలని “సుబ్బారావు-క్వాంటం లోకం” అన్న పేరుతో మళ్లీ ధారావాహికంగా పోస్ట్ చేద్దామని ఉద్దేశం.
అయితే మరీ వరసపెట్టి బాదకుండా చిన్న బ్రేక్...)
0 comments