ఆ వచ్చినవాడు జార్జ్ లమేత్ర్. సైద్ధాంతిక ఖగోళశాస్త్రంలో ప్రొఫెసరు. ఇతగాడికి మత చింతనలో కూడా కొంత ప్రవేశం ఉంది. విశ్వం ఓ మహావిస్ఫోటం (Big Bang) లోంచి ఆవిర్బవించిందని మొట్టమొదట ప్రతిపాదించిన వాడు. ఇతగాడు వేదిక మీదకి వచ్చీ రాగానే గొంతు సర్దుకుని దండకం అందుకున్నాడు.
ఓ విరాడ్రూపమా!ఓ విశ్వబీజమా
ఓ ప్రణవనాదమా!
పరమాణురూపమా!
ఓ మహా విస్ఫోటమా!
తొల్లి గురుతెరుంగని యుగంబుల క్రిందటన్
లెక్కింపరానన్ని తుత్తునియలై నీవు
ఆదిశక్తివై, విశ్వశక్తివై,
జగద్రక్షవై, జగద్ధాత్రివై,
విశాల తారామండలాదులన్ సృజియించినావు!
ఓ విరాడ్రూపమా!ఓ విశ్వబీజమా
ఓ దైవకార్యమా!
ఓ ప్రణవనాదమా!
పరమాణురూపమా!
ఓ మహా విస్ఫోటమా!
సుదీర్ఘయుగముల వికాస క్రమమున
జగమంతయు విరిసిన తారావళి
నీ చిరునవ్వు కాంతుల దీపావళి
ప్రచండ హిరణ్య తారాగ్ని కీలలు
సమస్త భక్షక కృష్ణబిలములు
నీ ఆదిమ జన్మకు జ్ఞాపికలు!
ఓ విశ్వబీజమా!
ఓ దైవకార్యమా!
ఓ ప్రణవనాదమా!
పరమాణురూపమా!
ఓ మహా విస్ఫోటమా!
ఆ విధంగా లమేత్ర్ గారు దండకం పూర్తి చేశాక, మరో వ్యక్తి రచ్చకెక్కాడు. ఇతగాడు జార్జ్ గామోవ్ అని ఓ రష్యన్ శాస్త్రవేత్త. సెలవలకని అమెరికా వెళ్లి అక్కడే ఓ ముప్పై ఏళ్లు గడిపిన గడుగ్గాయి ఇతగాడు. ఇదీ ఈ పెద్దమనిషి పాడిన... దాన్ని దండకం అంటారో, పాట అంటారో, వట్టి దండుగ పాట అంటారో మీరే తేల్చుకోండి.
(సశేషం...)
(సశేషం...)
నేను మొత్తం ఫాలో అవలేదు గానీ ఈ దండకం భలే ఉంది. ఇప్పుడు మొదణ్ణించీ చదవాలి!