“అయ్యోరామా! విశ్వం అంతా నిండి ఉన్న పెద్ద పెద్ద బండలన్నీ మన వైపుగా దూసుకొస్తే, మనం వాటి మధ్య నలిగి పచ్చడి కామా?”
ఆ ఆలోచనకే సుబ్బారావుకి గుండె ఆగినంత పనయ్యింది.
“మీరు చెప్పింది అక్షరాలా నిజం,” వత్తాసు పలుకుతూ అన్నాడు ప్రొఫెసర్. “కాని అంతదాకా ఆగాల్సిన పని కూడా ఉండదు. బండల మధ్య మనం నలిగి పచ్చడి అయ్యే లోపు ఉష్ణోగ్రత ఎంతగా పెరిగిపోతుంది అంటే, మన దేహాలు వేరువేరు అణువులుగా పటాపంచలై పోతాయి. విశ్వం అంతా ఓ పెద్ద ప్రజ్వలించే వాయుగోళంగా మారిపోతుంది. ఆ స్థితి నుండి మళ్లీ వ్యాకోచించడం మొదలెట్టాకే కొత్త జీవాలు ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుంది.”
“అయ్యో! అవునా?”” సుబ్బారావు ఆదుర్దా పెరిగిపోతోంది. “ఆ పెద్ద విశ్వంలో అయితే మీరు అన్నట్టు సంకోచించడానికైనా, వ్యాకోచించడానికైనా కోటానుకోట్ల సంవత్సరాలు ఉంటుంది. కాని ఇదేంటి? మనం మాట్లాడుతుండగానే వేడి పెరిగిపోతోంది. వేసుకున్నది పైజమాయే అయినా లోపల ఒళ్లు ఉడికిపోతోంది.”
“అలాగని అది తీసేయకండి,” హెచ్చరిస్తూ అన్నాడు ప్రొఫెసర్. “ఆట్టే లాభం ఉండదు. ఊరికే అలా కింద నేల మీద పడుకోండి, కాస్త ఉపశమనంగా ఉంటుంది.”
సుబ్బారావు బదులు పలకలేదు. అసలు బదులు చెప్పడానికి ఊపిరి ఆడడం లేదు. చుట్టూ ఉన్న ధూళి కణాలు నిప్పుకణికల్లా ఒంటిని కాల్చుతున్నాయి. వెచ్చని దుప్పటిలా తనను కప్పేస్తోంది ఆ ధూళి. ఆ దుప్పటి లోంచి బయటికి చెయ్యి చాచితే వేళ్ల మీదుగా చల్లని గాలి వీచినట్టయ్యింది.
“ఈ విచిత్ర, వికృత ప్రపంచంలో కొంపదీసి రంధ్రం చేశానా?” సుబ్బారావు మనసులో ఆలోచన మెదిలింది. సందేహ నివృత్తి కోసం ప్రొఫెసర్ ని అడగాలని చుట్టూ చూశాడు. కాని పరిసరాలలో ఎక్కడా ప్రొఫెసర్ కనిపించలేదు. చుట్టూ చూసుకుంటే తన హోటల్ రూమ్ లో పక్క మీద ఉన్నాడు.

వెచ్చగా రగ్గు కప్పుకుని పడుకుని ఉన్నాడు. లోపల మరీ వేడి ఎక్కువయ్యిందో ఏమో. ఒక్క చెయ్యి మాత్రం ఎలాగో తప్పించుకుని బయటికి తన్నుకొచ్చింది. అప్పుడే తెల్లవారుతున్నట్టు ఉంది. స్థిరమైన విశ్వగతులకి నిదర్శనంగా సూర్యుడి పసిడి కాంతులు కిటికీ లోంచి గదిలోకి ప్రవహిస్తున్నాయి.
“మళ్లీ వ్యాకోచించడం మొదలెట్టాకే కొత్త జీవాలు ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుంది.”అన్న ప్రొఫెసర్ మాటలు మనసులో మననం చేసుకుంటూ, విశ్వం ఇంత నెమ్మదిగా వ్యాకోచిస్తున్నందుకు మనసులోనే కాలానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కాలకృత్యాలు తీర్చుకుందామని తీరిగ్గా మంచం దిగాడు సుబ్బారావు.
(సశేషం...)

0 comments