శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
జరిగిన దాని గురించి తలచుకుంటూ ఉంటే నా మనసులో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏది నిజం? దేన్ని నమ్మాలి? నా కళ్ళు చెప్పిన సాక్ష్యం తప్పనుకోవాలా? ఈ భూగర్భ కూపంలో మనషి జీవించడం అనేది సాధ్యమేనా? ఈ పాతాళ కుహరాలలో మానవ జాతులు ఎలా జీవించగలవు? ఈ వైపరీత్యాన్ని ఎలా నమ్మడం?

బహుశ అది మానవాకారాన్ని పోలిన ఏ వానరమో కావచ్చు. వెనకటి భౌగోళిక యుగాలకి చెందిన ప్రోటోపితికా, మెసోపితికా, లేకపోతే శ్రీ లార్టెట్  గారు సన్సావ్ లో ఆ ఎముకల గుహలో కనుక్కున్న ఏ మధ్యయుగపు వానరమో కావచ్చు. కాని ఈ జీవం పరిమాణంలో ఆధునిక పురాజీవశాస్త్రానికి తెలిసిన జీవాలన్నిటినీ మించిపోయింది.

ఏదేమైనా ఆ కాంతులు చిందే కారడవిని దాటి చాలా దూరం వచ్చేశాం. అయినా పరిగెడుతూనే వున్నాం. ఏ క్షణాన ఆ మహాకాయుడు వెనక నుండీ వచ్చి మా మీద పడతాడోనన్న భయంతో పరిగెడుతున్నాం. అలా ముందుకి సాగిపోతూ అనుకోకుండా మళ్లీ లీడెన్ బ్రాక్ సముద్ర తీరానికి వచ్చాం.

ఈ సారి మేం వచ్చిన తీర భాగం ఇంతకు ముందు మేం చూసింది కాదని స్పష్టంగా చెప్పగలను. ఇంతకు ముందు మేం వచ్చిన తీరంలో కొన్ని రాళ్ల సమూహాలు గ్రౌబెన్ రేవుని తలపించేవి. అనుకోకుండానే లీడెన్ బ్రాక్ సముద్రానికి ఉత్తర ప్రాంతానికి చేరుకున్నాం. ఎక్కడ చూసిన రాళ్ల సందుల్లోంచి జలధారలు స్రవిస్తున్నాయి. కాని కాస్త ముందుకు వెళ్తే చిన్న చిన్న గుట్టలు కనిపిస్తున్నాయి. మునుపు చూడని ఓ సెలయేరు. దాంతో మళ్ళీ సందేహంలో పడ్డాను.

నా సందేహం మావయ్యకి వెలిబుచ్చాను. ఆయనకి కూడా కచ్చితంగా తెలియడం లేదు.

“మనం మొదటి మాత్రం రాలేదని అనిపిస్తోంది,” అన్నాను.  “తుఫాను మనల్ని మరింత ముందుకి తీసుకుపోయింది. కాని ఈ తీరాన్ని అనుసరిస్తే మళ్లీ గ్రౌబెన్ రేవుని చేరుకోగలం.”
“అదే నిజమైతే ఈ యాత్రలో ఇంకా ముందుకి సాగడం వల్ల ప్రయోజనం లేదు. కాని నువ్వు పొరబడ్డావేమో?” మావయ్య ప్రశ్నించాడు.
“కచ్చితంగా చెప్పడం కష్టం మావయ్యా. ఈ రాళ్లు మాత్రం ముందు చూసిన రాళ్ల లాగానే వున్నాయి. ఇంతకు ముందు హన్స్ మన తెప్పని నిర్మించింది ఈ గుట్టే అనుకుంటా. ఆ గుట్ట ఇది కాకపోయినా అది ఇక్కడే ఎక్కడో వుండాలని అనిపిస్తోంది.”
“కాని ఇక్కడికి ఇంతకు ముందు వచ్చి వుంటే మన కాలి గుర్తులు కనిపించాలిగా. కాని ఎక్కడా కనిపించడం లేదే?”
“నాక్కనిపించిందోచ్!” ఉత్సాహం పట్టలేక అరిచాను. కింద పడి వున్న ఓ తుప్పు  పట్టిన కత్తిని పైకి తీసి మావయ్యకి చూపించాను.
“అది నీదా?” మావయ్య అడిగాడు.
“కాదు. నీ దనుకున్నానే!”
“లేదు, లేదు. నా వద్ద ఇలాంటి కత్తి ఎప్పుడూ లేదు.”
“అదేంటి? చిత్రంగా వుందే.”
“ఏం లేదు ఏక్సెల్. ఐస్లాండ్ వాసులు ఇలాంటి కత్తులు వాడతారు. ఇది హన్స్ దే అయ్యుంటుంది.”
నేను లేదన్నట్టు తల అడ్డుగా ఊపాను.
“ఇది ఎవడో ఆదిమానవుడి ఆయుధం అయితే? ఇందాక మనం చూసిన పశువుల కాపరికి చెందిందే అయితే? ఇది మాత్రం నిశ్చయంగా రాతి యుగానికి చెందింది కాదు. ఇనుప యుగానికి కూడా కాదు. ఎందుకంటే ఇది స్టీలు కత్తి.”

నా మాటలని మావయ్య మధ్యలోనే ఆపేశాడు.
“ఆగు ఏక్సెల్. కాస్త ఆలోచించు. ఈ కత్తి పదహారవ శతాబ్దానికి చెందింది. దీన్ని పోనియార్డ్ అంటారు. ఇది స్పెయిన్ కి చెందింది. అది నీదీ కాదు, నాదీ కాదు, ఈ వేటగాడిదీ కాదు. దానికి పట్టిన తుప్పు ఎంత దట్టంగా వుందో చూశావా? అంత దట్టంగా తుప్పు పట్టడానికి రోజులు, నెలలు కాదు. శతాబ్దాలు పడుతుంది.”
ప్రొఫెసరు గారి మనసులో ఊహకి పగ్గాలు పటపట మని తెగిపోవడం వినిపిస్తోంది.
“ఏక్సెల్ మనం ఓ అద్భుతమైన ఆవిష్కరణ యొక్క ముఖ ద్వారాల వద్ద నిలిచి వున్నాం. ఒకటి నుండీ మూడు శతాబ్దాల కాలం ఆ కత్తి ఇక్కడే పడి వుంది.”
“కాని అది ఒంటరిగా రాలేదు. అది దానికదే ఇలా కొంకర్లు పోలేదు. మనకన్నా ముందే ఎవరో ఇక్కడికి వచ్చినట్టున్నారు.”
“అవును. ఎవరో మనిషే వచ్చాడు.”
“ఎవరా మనిషి?”
“ఆ మనిషి ఎవరో తన పేరుని ఆ కత్తి మీద చెక్కి వుంటాడు. భూమి కేంద్రానికి ప్రయాణించే బృహత్ యత్నం చేసి ఆ యాత్రకి చిహ్నంగా ఏదో గుర్తు వదిలి వుంటాడు. ఈ ప్రాంతం అంతా గాలిద్దాం పద ఏక్సెల్. ఏవైనా రహస్యాలు బయటపడతాయి.”
ఆ పరిసరాలన్నీ శ్రద్ధగా గాలించాం. మా ఎదుట ఓ పెద్ద కోట గోడలా విస్తరించి వున్న ఆ రాతి గుట్టని శ్రద్ధగా పరిశీలించాం.
అలా ముందుకు సాగిపోతుంటే ఒక చోట గుట్టకి సముద్రానికి మధ్య దారి మరింత ఇరుకు అయ్యింది. అక్కడ సముద్రపు కెరటాలు ఆ రాతి ప్రాకారపు పాదాలని తాకుతున్నాయి. అక్కడ బయటికి వికృతంగా పొడుచుకొస్తున్న రెండు శిలల మధ్య ఓ సొరంగ మార్గం కనిపించింది.
అక్కడ ఓ కరకు బండ మీద రెండు చిత్రమైన అక్షరాలు చిత్రించబడి కనిపించాయి. కాలప్రభావం చేత కాస్త అలుక్కుపోయినట్టు వున్నాయి. ఎవరో పాతకాలపు బాటసారి పేరులోని మొదటి అక్షరాలవి. అవి రూనిక్ లిపిలో రాసి వున్నాయి.
“ఏ. ఎస్.” అరిచాడు మావయ్య. “ఆర్నే సాక్నుస్సేం. ఆర్నే సాక్నుస్సేం…”
(ముప్పై తొమ్మిదవ అధ్యాయం సమాప్తం)














0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts