ఇప్పుడిక తారల దూరాలని పరిశీలిద్దాం.
మనకి అతిదగ్గర తార పెద్దగా ప్రకాశం లేని ఓ మినుకుమినుకు తార.
దాని పేరు ప్రాక్సిమా సెంటారీ (Proxima Centauri). అది మన నుండి 4.27 కాంతిసంవత్సరాల
దూరంలో వుంది. అంటే సుమారు 25 ట్రిలియన్ల మైళ్ల
దూరం అన్నమాట. అంతకన్నా దగ్గర్లో మరో తార లేదు. అంటే ప్రాక్సిమా సెంటారీ నుండి బయల్దేరిన
కాంతి మనను చేరుకోడానికి 4.27 ఏళ్లు (= 4 ఏళ్ల 99 రోజులు) పడుతుంది. భూమి నుండి చంద్రుడి దాకా 1.25 సెకన్లలో వెళ్లే కాంతి ప్రాక్సిమా సెంటారీని చేరడానికి
నాలుగేళ్లకి పైగా తీసుకుంటుంది.
ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన తార అయిన సిరియస్ (Sirius) మన
నుండి 8.64 కాంతిసంవత్సరాల దూరంలో వుంది. ప్రాక్సిమా
సెంటారీ కన్నా రెండు రెట్లు అన్నమాట.
ఓరియాన్ రాశిలో వున్న రైజెల్ (Rigel) అనే తార మన నుండీ
815 కాంతి సంవత్సరాల దూరంలో వుంది. సిరియస్
వున్న దూరం కన్నా ఇది 95 రెట్ల దూరంలో వుంది.
ఈ సారి ఎప్పుడైనా మీరు రైజెల్ తారని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ కాంతి
ఆ తార వద్ద నుండి బయల్దేరినప్పటికి భూమి మీద కాకతీయులు పరిపాలిస్తూ ఉండేవారు!
అంత దూరంలో వున్న రైజెల్ తార కూడా విశాల విశ్వంలో మన పరిసర
ప్రాంతంలోనే వుందని చెప్పాలి.
సూర్యుడు, ఇంకా మనకి ఆకాశంలో కనిపించే ఎన్నో తారలు ఓ ప్రత్యేకమైన
తారా సందోహానికి చెందుతాయి. అందులో సుమారు రెండొందల బిలియన్ల తారలు ఉన్నాయి. దాని పేరు
పాలపుంత (Milky Way). అది ఓ ‘ఇడ్లీ’ ఆకారంలో వుంటుంది! ఇలాంటి విశాలమైన తారా సందోహాలని
గెలాక్సీలు అంటారు.
మనం వుండే ఈ పాలపుంత గెలాక్సీ కి మనం కేంద్రం వద్ద లేము. అసలు కేంద్రానికి దరిదాపుల్లో కూడా లేము.
మనం ఆకాశంలో చూసే ఎన్నో తారలు గెలాక్సీ కేంద్రం నుండి 25,000 కాంతి సంవత్సరాల దూరంలో
వున్నాయి. గెలాక్సీ కేంద్రం నుండి వచ్చే కాంతి మనకి ఇక్కడికి పెద్దగా కనిపించదు. ఎందుకంటే
గెలాక్సీ కేంద్రానికి మనకి మధ్య విస్తారమైన నల్లని ధూళి మేఘాలు అడ్డుతెరలా వున్నాయి.
అయితే ఆ తెరని కూడా రేడియో తరంగాలు భేదించగలవు. ఆ విధంగా మనకి గెలాక్సీ కేంద్రం గురించి
తెలుస్తుంది.
గెలాక్సీ కేంద్రం నుండి వచ్చిన రేడియో తరంగాలు మరి
25,000 ఏళ్ల క్రితం అక్కణ్ణుంచి బయల్దేరాయి
అన్నమాట. అప్పటికి ఇంకా భూమి మీద మానవులు నాగరికులు కాలేదు.
మొత్తం పాలపుంత గెలాక్సీ ని ఒక కొస నుండి అవతలి కొస వరకు పరిగణిస్తే
లక్ష కాంతిసంవత్సరాల వెడల్పు ఉంటుంది. అంటే కాంతికి మన గెలాక్సీ ని ఒక కొస నుండి అవతలి
కొస వరకు దాటడానికి లక్ష సంవత్సరాలు పడుతుంది.
విశ్వంలో వున్నది కేవలం మన గెలాక్సీ మాత్రమే కాదు. ఇలాంటీ
గెలాక్సీలు కొన్ని బిలియన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని మన కన్నా చిన్నవైతే మరి కొన్ని
మన కన్నా చాలా పెద్దవి.
0 comments