అధ్యాయం 2.
లెక్కలతో
వచ్చిన చిక్కులు
“పిల్లలు అంకగణితాన్ని
సాంప్రదాయక పద్ధతులతో కన్నా దొడ్డిదోవన అయితే బాగా నేర్చుకుంటారని నాకో నమ్మకం.”
నా మేనగోడలికి
నాలుగేళ్ల వయసులో తన అక్కలు, అన్నలు కలిసి అంకెలు నేర్పించారు. “ఒకటి, రెండు, మూడు…”అంటూ
బిగ్గరగా బయటికి అనమని నేర్పించారు. వాళ్లు నేర్పించినట్టే “ఒకటి, రెండు, మూడు…” అని
అరుస్తూ వుండేది. అలాగే అరుస్తూ ఓసారి “ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఎనిమిది…”
అనేసింది పొరపాట్న. అప్పటికే అంకెల్లో పండిపోయిన తన సోదర సోదరీ మణులు అంతా “ఛీ! ఛీ!
అదేంటే? ఆరు తరువాత ఎనిమిది కాదు, ఏడు!” అంటూ చీవాట్లు పెట్టారు.
ఇలాంటి సన్నివేశాలు
చూస్తుంటే అనిపిస్తుంది. పిల్లలకి అంకెలు ఇలా నేర్పిస్తే అంకెల గురించి వాళ్లకి ఓ చిత్రమైన
ఊహ ఏర్పడుతుంది. పిల్లలకి అంకెలు అనేవి ఓ వరుసక్రమంలో వచ్చే, అర్థం లేని పేర్లు గల
వింత జంతువుల్లా అనిపిస్తాయేమో. అలా వచ్చి వాళ్ల నెత్తిన కూర్చున్న ఈ అంకెల జింకలు
గుంపులు గుంపులుగా కలుస్తూ, మళ్ళీ విడిపోతూ మనో వన సీమల్లో కల్లోలం సృష్టిస్తాయి. అంకెలు చేసే ఈ రాసలీలలనే పెద్దాళ్ళు
“రెండు రెళ్లు నాలుగు, రెండు మూళ్ల ఆరు,” వంటి జిగిబిగి కవితలతో వర్ణిస్తుంటారు. అంకెలని
ఆ విధంగా అర్థం చేసుకునే (లేదా అర్థం చేసుకోలేని) పిల్లలకి అంకెలతో పెద్ద చిక్కే వచ్చి పడుతుంది. నా మేనగోడలి
విషయంలో కూడా సరిగ్గా నేను ఊహించినట్టే జరిగింది. కొన్నేళ్ల తరువాత ఓ సారి, అంకగణితంలో
చిన్నప్పుడు పెద్ద పెద్ద సున్నాలు చుట్టిన పెద్ద మనుషుల్ని కొంతమందిని పట్టుకుని అడిగాను.
కొంచెం సిగ్గుపడి నవ్వేసి అవునని ఒప్పుకున్నారు. సరిగ్గా ఆ కారణం చేతనే అంకెల విషయం
ఎప్పుడూ వాళ్లకి కొంచెం ఇబ్బందిగానే వుండేది అన్నారు.
అందుకే నాకు
ఎప్పుడూ అనిపిస్తుంది. పిల్లలకి వాస్తవ వస్తువుల ఆలంబన లేకుండా కేవలం అమూర్త భావనలుగా
అంకెలు నేర్పడం తప్పని. పిల్లలకి “ఒకటి, రెండు, మూడు…” అని బట్టీ పట్టించడం ఒకటో క్లాసు
టీచర్లకి చాతకాదని కాదు. అయితే అలా వేదంలా అంకెల పేర్లు వల్లె వేయడం, అంకెలంటే ఏంటో
అర్థం చేసుకోవడం – ఈ రెండూ ఒకటి కాదు.
పిల్లలకి అంకెలని
నామవాచకాలుగా నేర్పించకూడదు. విశేషణాలుగా నేర్పించాలి. అంటే “ఒకటి, రెండు…” అనేవి మరో
దానితో సంబంధం లేని ప్రత్యేక పదాలుగా కాక, ఒక వస్తు సముదాయం యొక్క ఒక ప్రత్యేక లక్షణాన్ని
సూచించే పదాలుగా నేర్పించాలి. ఉదాహరణకి “ఒక ఇల్లు, రెండు జడలు, మూడు ముక్కలు…” అంకెలతో
ఇలాంటి సావాసానికి అలవాటు పడ్డ చాలా కాలం తరువాతే పిల్లలకి మూడు వస్తువుల సముదాయాలు
అన్నిటికి మూడు అనేది ఓ సామాన్య లక్షణం అన్న అమూర్త భావన మెల్లగా మనసులోకి ఇంకుతుంది.
అలాగే అంకెలని
వరుస క్రమంలో నేర్పించడం కూడా అంత మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఉదాహరణకి పిల్లలకి
మూడు వస్తువుల సముదాయాన్ని చూపించి, వెంటనే ఏడు వస్తువుల సముదాయాన్ని చూపించాలి. ఎందుకంటే
ప్రకృతిలో అంకెలు వరుసక్రమంలో కనిపించవు. పిల్లలు కూడా ఈ సత్యాన్ని గుర్తించి అర్థం
చేసుకోవాలి.
ప్రథమ దశలో కొంత
కాలం అంకెల్ని దృశ్య రూపంలో వస్తువుల విన్యాసాలుగా పిల్లలు అలవాటు పడితే బావుంటుంది.
ముఖ్యంగా చిన్న అంకెల (పది కన్నా చిన్నవి) విషయంలో అది సాధ్యం అవుతుంది. ఉదాహరణకి మూడు
అంకెని మూడు చుక్కల విన్యాసంగా ప్రదర్శించవచ్చు. ఆ మూడు చుక్కలు ఒకే వరుసలోగాని, త్రికోణపు
కొసలుగా గాని ఉండొచ్చు. అలాగే నాలుగుని ఒకే వరుసలో వున్న నాలుగు చుక్కలుగానో, చదరపు
కొసలుగానో ప్రదర్శించవచ్చు. అలాగే ఐదుని పంచభుజి లాగానో, ఒక చదరానికి పైన ఒక చుక్క
లాగానో (ఇది చూడడానికి ఓ ఇల్లులా ఉంటుంది), లేదా ఒక చదరానికి మధ్య మరో చుక్క లాగానో
ప్రదర్శించవచ్చు. కావాలంటే ఇలా చుక్కల్తో అంకెల బొమ్మల్ని చిన్న చిన్న పేక ముక్కల మీద
ముద్రించి పిల్లల కిస్తే వాటితో రకరకాలుగా ఆడుకుంటారు. చుక్కల బొమ్మని అంకెతో జత చెయ్యడం
మొదలైన ఆటలు ఆడుకోవచ్చు. అలాగని పిల్లలని బలవంతం చేసి ఇలాంటి ఆటలని నేర్పించాలని నేను
సూచించడం లేదు. అంతకన్నా పొరబాటు మరొకటి లేదు. వరస పెట్టి అంకెలని వల్లె వెయ్యడమే కాకుండా
మరెన్నో విధాలుగా కూడా పిల్లలకి అంకెలతో సాన్నిహిత్యం కలిగితే బావుంటుందని మాత్రమే
నేను అంటున్నాను.
(ఇంకా వుంది)
0 comments