హెలెన్ అని ఓ పది నెలల పాప మా ఆఫీస్ గుమ్మంలో ‘Land of Oz’ అని ఓ పిల్లల నవల పట్టుకు కూర్చుంది. దాంతో హాయిగా
ఆడుకుంటోంది. ఆమెకి అది కేవలం ఓ మెరిసే దీర్ఘ చతురస్రాకారపు వస్తువు. దాన్ని చేతిలో
పట్టుకుని గిలకలా ఆడించాలని చూస్తోంది. కాని పైన మెరిసే కాగితం నునుపుగా ఉండడంతో పుస్తకం
పట్టు జారిపోతోంది. మధ్య మధ్యలో దబ్బు మని కిందపడిపోతోంది. కొన్ని సార్లు వట్టి కవరు
పేజీతో పట్టుకుని పైకెత్తుతుంది. కాని ఆ పుస్తకంలో ఇంకా ఎన్నో సన్నని పేజీలు వున్నాయని
వాటిని చూడొచ్చని, తిప్పొచ్చని, నలపొచ్చని, చింపొచ్చని అలా ఇంకా ఎన్నో సరదా విన్యాసాలు
చెయ్యొచ్చని ఆ పాపకి ఇంకా తెలీలేదు పాపం!
నిన్నే ఆ పాప వాళ్ల అక్క ‘అన్నా’ (మూడేళ్లది) వచ్చింది. ఓ
పెద్ద కుర్చీలో కూర్చుని ‘A.J. Wentworth B.A.’ అన్న పుస్తకం పట్టుకుని వాళ్లమ్మ మేరీకి
‘చదివి’ వినిపిస్తోంది అన్నా. నిజంగా పెద్దవాళ్లు చదువుతున్నట్టే చదువుతోంది. అయితే
ఆమె అనే మాటలకి చేత్తో పట్టుకున్న పుస్తకానికి ఏ సంబంధమూ లేదు. ఎవరో అదృశ్య స్నేహితుల
విచిత్ర గాధలేవో చెబుతోంది. అల్లంత దూరంలో నన్ను చూసి, “మా అమ్మకి చదివి వినిపిస్తున్నాను.
అచ్చంగా పదాలన్నీ నేనే చదువుతున్నాను,” అనేసి మళ్లీ చదువులో మునిగిపోయింది. “అవునవును,
వింటున్నా!” అని కాసేపు కథ విని మళ్లీ నా పన్లో పడిపోయాను. ఆ తరువాత వాళ్లమ్మ మేరీ
చెప్పింది. అన్నా చదువుతూ, చదువుతూ మధ్యలో చదవడం ఆపి పేజీ తిప్పి మళ్లీ కొనసాగిస్తుందట!
నిన్న హెలెన్ చదువు, ఇవాళ హన్నా చదువు – ఈ రెండు చూస్తుంటే
పిల్లలకి పుస్తకాలతో పరిచయం ఏర్పడడానికి రెండు పూర్తిగా భిన్నమైన మార్గాలు ఉన్నాయని
పించింది. మొదటి పద్ధతిలో వరుసగా ముందు అక్షరాలు, తరువాత చిన్న చిన్న పదాలు, తరువాత
కొన్నే పదాలతో కూర్చిన వాక్యాలు, తరువాత చిన్న పుస్తకాలు, తరువాత పెద్ద పుస్తకాలు,
ఇలా పరిచయం చేస్తూ పోతే చివరికి ఏ పుస్తకం అయినా చదివే సామర్థ్యం వచ్చే అవకాశం వుంది.
కాని ఈ పద్ధతిలో వచ్చిన చిక్కేంటంటే ఇలా ఒక్క పుస్తకం పూర్తయ్యేసరికి గగనం అయిపోతుంది.
ఈ పద్ధతిలో పుస్తక ప్రపంచం లోకి ప్రవేశించడం అంటే వరుసగా ఎన్నో అవరోధాలని దాటుకుంటూ
పోవడం అన్నమాట. ఒక అవరోధం దాటగానే మరో అవరోధం సిద్ధంగా వుంటుంది. ఒక తలుపు తెరవగానే
మరో ముసిన తలుపు ఆహ్వానిస్తుంది.
రెండో పద్ధతి అన్నాకి పుస్తకాలతో పరిచయం అయిన పద్ధతి. ఈ పుస్తకం
నాది అని ఓ పుస్తకాన్ని తీసుకుని మనసుకి హత్తుకున్న నాడు అన్నాకి పుస్తక ప్రపంచంలోకి
పరిచయం దొరికింది. ఆ ప్రపంచంలో పౌరసత్వం లభించింది. చిన్న చిన్న అక్షరాల నుండో, పదాల
నుండో ప్రారంభించక “పెద్ద వాళ్ల దగ్గర పుస్తకాలు
వుంటాయి, అలాగే తన వద్ద కూడా పుస్తకాలు ఉంటాయి, ఉండగలవు” అన్న భావనతో పరిచయం మొదలయ్యింది.
ఆ విశాలమైన భావనలో మెల్లగా చిన్న చిన్న భావాలు ఇముడుతూ వచ్చాయి. పుస్తకాల్లో కథలు దాక్కుని
వుంటాయని, వాటిలో మళ్ళీ పదాలు వుంటాయని, ఆ పదాల పని పడితే కథల్లోని రహస్యం తెలిసిపోతుందని,
ఈ కథలని ఇతరులకి చెప్పొచ్చని – ఇలా ఎన్నో విషయాలు ఆ ప్రాథమిక భావన ద్వార వరుసగా ఆమె
మనసులోకి ప్రవేశించాయి.
సాంప్రదాయక పద్ధతిలో నేర్చుకున్న పాపకి తక్కిన విషయాలన్నీ
– పదాలు, వాక్య నిర్మాణం – మొదలైనవి తెలియొచ్చు. అన్నా చివరి నుండి మొదలెట్టింది. ‘ఇది
నాది’ అన్న భావన ఆమె మొదటి మెట్టు. మరి విద్య అనే సుదీర్ఘ ప్రయాసకి అంతరార్థం, విజ్ఞాన
సర్వస్వాన్నీ హృదయానికి హత్తుకుని “ఇది నాదీ” అని ధీమాగా అనగలగడమా?
0 comments