“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”
ఎదురు ప్రశ్నలు వేసి చిత్రహింస పెట్టకుండా ఇలా మా ప్రొఫెసర్ సూటిగా విషయం చెప్పేస్తున్నాడేంటని మేము ఆశ్చర్యపడేటంతలో, ఆయనే మళ్లీ అన్నాడు:
“పోనీ నేను చెప్పే బదులు మీరే ఊహించగలరా మన యాత్రకి లక్ష్యం ఏంటో?”
“మీ మనసులో ఏవుందో మాకెలా తెలుస్తుంది .. కానీ” కాస్త సగౌరవంగా సణిగాడు శేషు. “బహుశ జూపిటర్ ఉపగ్రహాల మీద ఏవైనా కొత్త సంగతులు తెలుసుకోవచ్చేమో నన్న...”
“భేష్ శేషూ!” ప్రొఫెసర్ సంతోషం పట్టలేక ఎప్పట్లా శేషు వీపుని ఓసారి మోగించాలనుకున్నాడు గాని, ఈ శూన్య గురుత్వ లోకంలో ఆ చర్యకి పర్యవసానం ఏంటో తెలిసి తమాయించుకున్నాడు. “భలే చెప్పావ్. మనకి తెలిసి బృహస్పతికి పదిహేను ఉపగ్రహాలు ఉన్నాయి. వాటన్నిటి ఉపరితల విస్తీర్ణత కలిపితే భూమి ఉపరితలంలో సగం ఉంటుందేమో. మనకేమో పట్టున రెండు వారాలు కూడా లేవు. అంత తక్కువ సమయంలో అంత ప్రాంతం ఎలా గాలించడం?” మళ్లీ ప్రశ్న కసిగా విసిరాడు ప్రొఫెసర్.
శేషు ఓసారి ఇబ్బందిగా కదిలి, కొంచెం ధైర్యం తెచ్చుకుని అన్నాడు,
“నాకు ఖగోళశాస్త్రం పెద్దగా తెలీదుగాని. అదుగో ఆ నాలుగు పెద్ద ఉపగ్రహాలు ఉన్నాయిగా. నేనైతే వాటితో మొదలుపెడతాను.”
“కాని మరి నీకు తెలుసోలేదో. నువు చెప్పే ఆ నాలుగు ఉపగ్రహాలు – అయో, యూరోపా, గానిమీడ్, కల్లిస్టో లు. ఒక్కొక్కదాని విస్తీర్ణత ఆఫ్రికా ఖండం అంత ఉంటుంది. ఏ వరుసలో వాటిని గాలిస్తే బావుంటుందంటావ్?”
నాకీ ఈ జ్ఞాన హింస బొత్తిగా నచ్చలేదు.
“బృహస్పతికి అతి దగ్గరి ఉపగ్రహంతో మొదలెట్టి క్రమంగా దూరంగా జరుగుతూ పోతే...?”
“ప్చ్” బాధగా అన్నాడు ప్రొఫెసర్. కాని జాగ్రత్తగా వింటే ఆ బాధ వెనుక వ్యంగ్యం ధ్వనిస్తుంది. “నువ్వు పట్టేస్తావు అనుకున్నా శేషూ. నువ్వు చెప్పింది తప్పు. నీ ఆలోచనా విధానం తప్పు. మనం అసలు పెద్ద ఉపగ్రహాల వద్దకే పోవడం లేదు. భూమి నుండి ఇప్పటికే వాటిని క్షుణ్ణంగా సర్వే చేశారు. ఎన్నో మిషన్లు కూడా ఇప్పటికే వాటిని పరిశీలించాయి. మనం వెళ్లేది ఇంతవరకు ఇవరూ వెళ్ళని చోటికి.”
“కొంపదీసి జూపిటర్ కి కాదు కద.” భయంగా అన్నాన్నేను. అక్కడి నిరవధిక ప్రళయభీకర వాయుదుమారాలలో ఊపిరాడక చచ్చిపోతున్న దృశ్యాన్ని ఊహించుకుంటూ.
“లేదు. కాని ఇంచుమించు అంతవరకు వెళ్తున్నాం. గురుడికి అంత దగ్గరిగా ఇంత వరకు ఎవరూ పోలేదు.”
ఈ సారి సాలోచనగా అన్నాడు.
“మీకు తెలుసోలేదో గాని... విచిత్రం ఏంటంటే జూపిటర్ ఉపగ్రహాల మధ్య ప్రయాణించడం ఎంత కష్టమో, గ్రహాల మధ్య ప్రయాణించడం కూడా అంతే కష్టం. దానికి కారణాలు రెండు. జూపిటర్ కి ఉండే బ్రహ్మాండమైన గురుత్వం. అతి వేగంగా కదిలే దాని ఉపగ్రహాలు. జూపిటర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఉపగ్రహం ఇంచుమించు భూమి అంత వేగంగా కదులుతోంది. కనుక గానిమీడ్ నుండి అక్కడికి ప్రయాణించడానికి ఎంత ఇంధనం అవుతుందో, భూమి నుండి వీనస్ కి ప్రయాణించడానికి కూడా అంతే ఇంధనం అవుతుంది. ఇదే మనం చేయబోతున్న యాత్ర. ఇంతవరకు ఈ యాత్ర చెయ్యాలని ఎవరికీ అనిపించలేదు. ఈ బృహస్పతి పంచమం చాలా చిన్న ఉపగ్రహం. దీని వ్యాసం కేవలం ముప్పై కి.మీ.లే. జూపిటర్ కి కొంచెం దూరంలో ఉండే చిన్న ఉపగ్రహాలని కూడా ఇంతవరకు ఎవరూ సందర్శించలేదు. సందర్శించడం డబ్బు దండుగ అనుకున్నారు.”
“మరి మనం ఇప్పుడు ఇంత ఇదిగా ఎందుకు బయలుదేరినట్టు?” కొంచెం అసహనంగా అడిగాను, ’ఇది’ అన్న మాటను కాస్త నొక్కి పలుకుతూ. ఏదో ప్రొఫెసరు ఉత్సాహపడుతున్నాడని గాని నాకైతే ఇదంతా వట్టి పనికిమాలిన వ్యవహారంలా తోచుతోంది.
ఇక్కడ మా ప్రొఫెసర్ విశ్వనాథం గారి గురించి ఆయన సిద్ధాంతాల గురించి కొంచెం చెప్పాలి. నాకైతే ఆయన సిద్ధాంతాల మీద బొత్తిగా నమ్మకం లేదు గానీ ఆయనకి ఆయన రంగంలో మంచి పేరు ఉంది. కాని ఆయన భావాలు చాలా నవ్యంగా, విప్లవాత్మకంగా ఉంటాయి. అసలు నమ్మశక్యంగా అనిపించవు.
ఆ మధ్యన అలాగే ఒక మార్స్ మిషన్లో ఆ గ్రహం మీద రెండు ప్రాచీన నాగరికతల శిధిలాలు బయటపడ్డాయి. రెండూ బాగా అధునాతనమైనవే. కాని ఐదు మిలియన్ సంవత్సరాల క్రితమే రెండూ అంతరించిపోయాయి. అందుకు కారణం ఏంటో ఇప్పటికీ తెలీదు. యుద్ధం వల్ల జరిగినట్టు కనిపించలేదు. ఎందుకంటే రెండు నాగరికతలు సామరస్యంగా జీవించినట్టే కనిపించింది. వాటిలో ఒక జాతి జీవులు కొంచెం పురుగుల్లా ఉంటారు. వీళ్లే ఆదిమ మార్షియన్లు. ఆ గ్రహం మీదే ఆవిర్భవించి, పరిణామం చెందినవారు. రెండవ జాతి పాముల్లాగా, సరీసృపాల్లాగా ఉంటారు. వీళ్లు బయటి నుండి వచ్చినట్టు కనిపిస్తుంది. వీళ్లు ఎవరో, ఎక్కణ్ణుంచి వచ్చారో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. అందుకే ఈ నాగరికతని “X-నాగరికత” అని పిలిస్తారు.
ఈ X-నాగరికత గురించి మా ప్రొఫెసర్ కి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.
(సశేషం...)
ఆసక్తికరంగా ఉంది. మీ తదుపరి భాగాలకోసం ఎదురుచూస్తుంటాను