శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

జీవశాస్త్రంలో ఫెయిన్మన్ నేర్చుకున్న “పాఠాలు”

Posted by శ్రీనివాస చక్రవర్తి Friday, September 2, 2011

http://www.andhrabhoomi.net/intelligent/srinivasa-207ఎప్పుడూ ఒకే సమస్యని పట్టుకుని వేలాడకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ, తనకి పరిచయం లేని వైజ్ఞానిక రంగాల్లో చొచ్చుకుపోతూ, పరిశోధనలు చెయ్యడం అంటే మేటి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, రిచర్డ్ ఫెయిన్మన్ కి సరదా. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పని చేసే రోజుల్లో ఒక సారి, తను ఎప్పుడూ పని చేసే సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని వదిలిపెట్టి సరదాగా జీవశాస్త్రంలో వేలు పెట్టి చూడాలని నిశ్చయించుకున్నాడు.

భౌతిక శాస్త్రంలో అయితే తను గొప్ప పండితుడు, గురువు కావచ్చు, కాని జీవశాస్త్రంలో తను శిష్యుడే కనుక ఒక విద్యార్థి లాగా ఇతర విద్యార్థులతో పాటు క్లాసులకి వెళ్లి పాఠాలు విని నేర్చుకోవాలని అనుకున్నాడు. కణ జీవశాస్త్రం (సెల్ బయాలజీ) లో ఓ కోర్సులో కూర్చోవాలనుకున్నాడు. ఆ కోర్సుకి ఆచార్యుడి పేరు న్యూటన్ హార్వే. ఇతగాడు కాంతిని వెలువరించే బాక్టీరియాల గురించి చాలా పరిశోధనలు చేసి పేరు తెచ్చుకున్నాడు. ఫెయిన్మన్ తన క్లాసులో కూర్చోడానికి హార్వే ఒప్పుకున్నాడు.

పాపం కొత్తవాడు కదా అని తోటి విద్యార్థులు ఎంతో ఆదరంగా ఉండేవారు. ఒక సారి ఓ విద్యార్థి మైక్రోస్కోప్ లో కణాలు ఎలా కనిపిస్తాయో ఫెయిన్మన్ కి చూపించాడు. అవి వృక్షకణాలు. ఫెయిన్మన్ కి అందులో చిన్న చిన్న ఆకుపచ్చ ‘చుక్కలు’ కనిపించాయి. వాటిని ‘క్లోరోప్లాస్ట్’ లు అంటారని తెలుసుకున్నాడు. అయితే ఆ ‘చుక్కలు’ అటు ఇటు సంచలనంగా కదలడం అతడికి విశేషంగా కనిపించింది. అది చూడగానే అతడిలోని భౌతిక శాస్త్రవేత్త మనసులో ఓ ప్రశ్న మెదిలింది. క్లోరోప్లాస్ట్ లు ఎందుకు కదులుతున్నాయి? వాటిని కదిలించే బలాలు ఏంటి? అదే అడిగాడు తన తోటి విద్యార్థులని. అంతా తెల్లమొహం వేశారు. వాటి పేర్లు తెలుసేగాని అవి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయో ఎవరికీ తెలీదు. అసలు అలా ప్రశ్నించొచ్చని కూడా వారికి ఎప్పుడూ తట్టలేదు. ఈ అనుభవం బట్టి ఫెయిన్మన్ కి భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రానికి మధ్య ఉండే ఓ ముఖ్యమైన తేడా అర్థమయ్యింది. భౌతిక శాస్త్రంలో కాస్త ఆసక్తి కరమైన ప్రశ్న వెయ్యాలంటే కొంత లోతుకి వెళ్లాలి. జీవశాస్త్రంలో ఎవరికీ సమాధానం తెలీని ప్రశ్నలు వెయ్యడం పెద్ద కష్టం కాదు.

ఆ తరువాత ఫెయిన్మన్ కి ఓ పేపరు చదివి క్లాసు ముందు ప్రెజెంట్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లిలోని కొన్ని ప్రత్యేక కండరాలని దాని నాడీమండలం ఎలా నియంత్రిస్తుంది అన్నది ఆ పేపరులోని విషయం. గాస్ట్రోక్నిమియస్ కండరం మొదలైన కండరాల పేర్లు ఉచ్ఛరించడానికే ఫెయిన్మన్ కి నోరు తిరగలేదు. పైగా పిల్లిలో అవసలు ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు. మరిన్ని వివరాలు సేకరించడానికి లైబ్రరీకి వెళ్లాడు. అలాంటి సమాచారం ఎలాంటి పుస్తకాలలో ఉంటుందో కూడా తనకి తెలీదు. నేరుగా జీవశాస్త్ర విభాగానికి చెందిన లైబ్రేరియన్ ని కలుసుకుని “పిల్లికి సంబంధించిన మ్యాపులు ఉన్నాయా?” అని అడిగాడు. ఆవిడకి నవ్వు ఆగలేదు. పిల్లికి “మ్యాపులు” ఉండవని వివరించి, పిల్లి జీవనిర్మాణానికి (అనాటమీకి) సంబంధించిన సమాచారం అందించింది లైబ్రేరియన్.

మర్నాడు క్లాసుకి వెళ్లి తన సెమినార్ ఇవ్వడం మొదలెట్టాడు ఫెయిన్మన్. ముందుగా బోర్డు మీద పిల్లి బొమ్మ గీసి, అందులో వివిధ కండరాలని సూచించడం మొదలెట్టాడు. “ఇవన్నీ మాకు తెలిసినవే” అంటూ క్లాసంతా గగ్గోలు పెట్టింది. “అవును మరి. అందుకే మీరు నాలుగేళ్లు కష్టపడి చదువుకున్న విషయాలని ఇంత తక్కువ సమయంలో నేను నేర్చుకున్నాను,” అంటూ చురక వేశాడు ఫెయిన్మన్.

జీవశాస్త్రంలో కనిపించిన విషయాలకి పేర్లు పెట్టుకుని, ఆ పేర్లన్నీ శ్రమపడి బట్టీ పట్టుకునే పద్ధతి ఫెయిన్మన్ కి కాలయాపనలా అనిపించింది. అంత కన్నా జీవ వ్యవస్థల తత్వం గురించి ప్రశ్నించి, దాన్ని శోధించడం మరింత ఆసక్తికరమైన వ్యాపకంగా తోచింది.


మరో సందర్భంలో ఫెయిన్మన్ రైబోజోమ్ లకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన సమస్య మీద హిల్డెగార్డ్ లామ్ఫార్మ్ అనే శాస్త్రవేత్తతో పని చేశాడు. ఈ రైబోజోమ్ లు అనే వేదిక మీద, ఎమ్. ఆర్. ఎన్. ఏ. అనే అణువుల లోని ‘కోడ్’ ఆధారంగా, కణంలో ప్రోటీన్ అణువుల నిర్మాణం జరుగుతుంది. అయితే సామాన్యంగా ఒకే జీవకణంలో ఉండే రైబోజోమ్ లు, ఆర్. ఎన్. ఏ. ల నుండి ఆ జీవకణానికి సంబంధించిన ప్రోటీన్ లు తయారవుతాయి. అలా కాకుండా రెండు విభిన్న జీవజాతుల నుండి ఈ రెండిటినీ తీసుకుంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి బాక్టీరియాల నుండి రైబోజోమ్ లని, బఠాణీల నుండి ఎమ్. ఆర్. ఎన్. ఏ. ని తీసుకుని కలిపితే ఆ వచ్చే ప్రోటీన్లు బఠాణీ ప్రోటీన్లా, బాక్టీరియా ప్రోటీన్లా?


ఈ ప్రయోగానికి ఎక్కువ మోతాదులో రైబోజోమ్ పదార్థం కావలసి వచ్చింది. అంతకు ముందే మరేదో ప్రయోగం కోసం ఫెయిన్మన్ ఈ.కోలై బాక్టీరియా నుండి పెద్ద మొత్తంలో రైబోజోమ్ లని వెలికి తీసి వున్నాడు. ఊరికే ఉన్నాయి కదా అని ఆ రైబోజోమ్లని ఈ కొత్త ప్రయోగంలో వాడి ప్రయోగం చేసి చూశాడు. కాని చిన్న పొరపాటు వల్ల ప్రయోగం బెడిసికొట్టింది. తను వాడిన రైబోజోమ్ లు నెల రోజులుగా ఫ్రిడ్జిలో ఉన్నాయి. కనుక అవి మరేదో జీవపదార్థంతో కలుషితం అయ్యాయి. ప్రయోగం సరిగ్గా జరిగి వుంటే ఎంతో గొప్ప జీవ వైజ్ఞానిక సత్యం బయట పడి వుండేది. జీవలోకంలో ప్రోటీన్ల నిర్మాణానికి పనికొచ్చే ఈ రైబోజోమ్లనే యంత్రాంగం ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది అని తెలిసేది. కాని ఫెయిన్మన్ చేసిన పొరపాటు వల్ల ప్రయోగం సత్ఫలితాలు ఇవ్వలేదు.

ఈ అనుభవం వల్ల ఫెయిన్మన్ జీవశాస్త్రాన్ని ఓ కొత్త కోణం నుండి చూడగలిగాడు. జీవశాస్త్రంలో ప్రగతి సాధించాలంటే కేవలం సిద్ధాంతాన్ని లోతుగా అర్థం చేసుకుంటే సరిపోదు. జీవశాస్త్రానికి ఊపిరి ప్రయోగం. ఆ ప్రయోగాలు చెయ్యడానికి అపారమైన సహనం, శ్రద్ధ అవసరం. చిన్న పొరబాటు జరిగినా ప్రయోగం మొత్తం అపభ్రంశం అవుతుంది.


ఆ విధంగా జీవశాస్త్రంలో ఎన్నో విషయాలు నేర్చుకుని, ఎన్నో అనుభవాలు సేకరిస్తాడు ఫెయిన్మన్. ఒక రంగంలో నోబెల్ బహుమతి గ్రహించేటంత స్థాయికి వెళ్లిన ఆ శాస్త్రవేత్త తనకి పరిచయం లేని రంగంలోకి ప్రవేశించి, ఒక విద్యార్థి స్థాయికి దిగి, వినమ్రంగా తప్పులు సరిదిద్దుకుంటూ, ఆ రంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసి, శాస్త్రవేత్తకి ఉండాల్సిన నిగర్వానికి, అంతులేని వైజ్ఞానిక కుతూహలానికి ప్రతీకగా నిలిచాడు.

(రిచర్డ్ ఫెయిన్మన్ రాసిన ‘ష్యూర్లీ యూ మస్ట్ బి జోకింగ్ మిస్టర్ ఫెయిన్మన్’ అన్న పుస్తకం నుండి)


1 Responses to జీవశాస్త్రంలో ఫెయిన్మన్ నేర్చుకున్న “పాఠాలు”

  1. bondalapati Says:
  2. శ్రీనివాస చక్రవర్తి గారు,
    ఫెయిన్మన్ కి సంబంధించిన ఒక ఆసక్తికర్మైన కొత్త కోణాన్ని తెలియచెప్పినందుకు ధన్యవాదాలు.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email