http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-905
అది 11, అక్టోబర్ 1492.
సాంటా మారియా ఓడలో ఓ ఎత్తయిన వేదిక మీద నించుని అడ్మిరల్ కొలంబస్ చుట్టూ కలయజూస్తున్నాడు. బయటికి నిబ్బరంగానే ఉన్నా లోలోపల చాలా ఆందోళన పడుతున్నాడు. ఏ క్షణాన అయినా నేల కనిపించాలి. అలా ఆత్రంగా చుట్టూసముద్రాన్ని పరిశీలిస్తుండగా దూరంగా ఏదో చిన్న కాంతి లాంటిది కనిపించింది. ఎవరో ఓ దివిటీ పట్టుకుని ఏదో తీరం మీద పరుగెత్తుతున్నట్టుగా ఉందా దృశ్యం. అదేంటో కాస్త శ్రద్ధగా పరిశీలిద్దాం అనుకునే లోపల ఆ దృశ్యం మాయమయ్యింది.
మళ్లీ ఆ దృశ్యం కనిపిస్తుందేమో నని రాత్రంతా అలాగే ఆ వేదిక మీద జాగారం చేశాడు. తనలాగే ఓడల మీద కొందరు నావికులు కూడా అలాగే పహరా కాస్తున్నారు. అలా అంతమంది వేయి కళ్లతో కనిపెట్టుకుని ఉన్న పరిస్థితిలో, అర్థ రాత్రి రెండు గంటలకి ఒక నావికుడికి అల్లంత దూరంలో తీరం లాంటిది కనిపించింది. అంతకు ముందే పొగమంచుని చూసి తీరం అనుకుని పొరబడ్డ కారణంగా వెంటనే అతడు అందరినీ అప్రమత్తం చెయ్యలేదు. కళ్లు నులుముకుని జాగ్రత్తగా చూశాడు. నిజంగా తీరమే. తారాకాంతిలో దాని రూపురేఖలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. “నేల కనిపించింది! నేల కనిపించింది!” అంటూ ఒక్క సారిగా కేకలు అందుకున్నాడు. ఆ నావికుడి పేరు రాడ్రిగో.
రాడ్రిగో సూచించిన దిశలో కొలంబస్ కూడా చూశాడు. నిజమే, అది తీరమే. చీకట్లో ఎక్కువ వివరాలు తెలియడం లేదు. కనుక తీరాన్ని సమీపించడం ఆ సమయంలో శ్రేయస్కరం కాదు. దూరానే లంగరు వేసి అక్టోబర్ పన్నెండు నాటి పొద్దు వెలుగు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నారు. కొలంబస్ మనసులో తీరం కనిపించిందన్న సంతోషం త్వరలోనే ఎగిరిపోయింది. దాని స్థానంలో ఓ సందేహం మనసులో దొలిచేస్తోంది.
తాము చేరుకున్నది ఇంతకీ ఏ దేశం? ఇది ఇండియా, కాథే ప్రాంతాలకి చెందిన తీరం అయితే అల్లంత దూరంలో శతకోటి దీపాలతో వెలిగే ఎత్తయిన భవనాలు కనిపించాలి. గొప్ప నాగరిక ప్రాంతాలకి ఉండే లక్షణాలు నిండుగా ఉండాలి. కాని ఈ తీరం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడా ఓ చిన్న విస్ఫులింగం అయినా లేదు. తీరం వెనుక నేపథ్యంలో నల్లని, మూగ చెట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. ఈ చిక్కు ముడి విడిపోవాలంటే తెల్లవారిన దాకా ఎదురుచూడాల్సిందే. ఆ రాత్రి కొలంబస్ కి నిద్ర పట్టలేదు.
మర్నాడు శుక్రవారం. నెమ్మదిగా తెల్లవార సాగింది. వికసిస్తున్న అరవిందంలా పలచని సూర్య కాంతిలో తీరం మీద విశేషాలన్నీ కళ్ళ ముందు నెమ్మదిగా విచ్చుకుంటున్నాయి. తమ కళ్ల ఎదుట కనిపిస్తున్న ఈ కొత్త భూమి అంతా పచ్చగా కళకళలాడుతోంది. అయితే నాగరిక చిహ్నాలే కనిపించడంలేదు. కొలంబస్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అది జపాన్ పొలిమేరల్లో ఉండే దీవి కావచ్చని అనుకున్నాడు.
తీరానికి తగినంత దగ్గరగా వచ్చి, లంగరు వేసి, మూడు చిన్న పడవల్లో పాటు కొలంబస్ బృందం తీరం చేరుకుంది.
అంతవరకు ఓ కొత్త భూమిని కనుక్కోవడం మీదే తన ధ్యాసంతా ఉండేది. కాని ఇప్పుడు తన అసలు కర్తవ్యం గుర్తొచ్చింది. తను వచ్చింది ఈ కొత్త భూములని సరదాగా చూసిపోవడానికి కాదు. తను చేస్తున్నది విహార యాత్ర కాదు. ఇదో జైత్ర యాత్ర. తను కనుక్కున్న భూమలని జయించి స్పెయిన్ రాజు, రాణులకి బహుమతిగా సమర్పించుకోవాలి. ఇప్పుడు తను కేవలం ఒక పర్యాటకుడో, నావికుడో కాడు. ఇప్పుడు తనొక యోధుడు. శత్రువుని జయించి తన రాజ్యానికి విజయాన్ని సాధించడమే జీవన లక్ష్యంగా గల సేనాపతి.
కొలంబస్ చేతిలో స్పెయిన్ రాజ్యపు విజయ పతాక ఉంది. కవచం, శిరస్త్రాణం మొదలైన హంగులన్నీ తగిలించుకున్నాడు. వీపుకి కట్టుకున్న ఎర్రని క్లోక్ చల్లని సముద్రపు గాలికి రెపరెపలాడుతోంది.
అంతలో తీరం మీద చెట్ల మాటు నుండి కొంతమంది జనం బయటికి రావడం కనిపించింది. యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు కొలంబస్.
తీరం మీద కాలు మోపిన వెంటనే మట్టిలో స్పెయిన్ జెండా పాతి “నా స్వామి మహారాజు ఫెర్డినాండ్ కోసం, స్వామిని మహారాణి ఇసబెల్లా కోసం ఈ భూమిని ఆక్రమిస్తున్నాను,” అని గంభీరంగా ప్రకటించాలనుకున్నాడు.
కాని ఎదురుగా కనిపించిన వ్యక్తుల వాలకం చూసి నోరు వెళ్లబెట్టాడు.
(ఇంకా వుంది)
0 comments