http://www.andhrabhoomi.net/sisindri/sisi-369
తీరం మీద పాదం మోపగానే ఆ భూమిని స్పెయిన్ రాజ ప్రతినిధిగా తన రాజు కోసం, రాణి కోసం ఆక్రమిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆ భూమికి సాన్ సాల్వడార్ అని పేరుపెట్టాడు. (సాన్ సాల్వడార్ అంటే ‘ముక్తి ప్రదాత’ అని అర్థం. కొలంబస్ బృందం తాము సందర్శించిన ప్రాంతాలకి ఎక్కువగా క్రైస్తవ సాంప్రదాయానికి చెందిన పేర్లు పెడుతూ వచ్చారు.) అంతవరకు కొలంబస్ ని నానా రకాలుగా ఆడిపోసుకున్న ఇతర ఓడల కెప్టెన్లు కూడా ఇప్పుడు ఈ అనుకోని విజయానికి మురిసిపోయి దాసోహం అన్నారు. పడవ దిగిన కొలంబస్ చుట్టూ తనతో పాటు తీరం మీదకి వచ్చిన కెప్టెన్లు, కొద్దిమంది నావికులు అతడి ఎదుట వినమ్రంగా మోకరిల్లారు.
కాని అల్లంత దూరంలో చెట్ల మాటు నుండి బయటికి వస్తున్న స్థానికులని చూసి కొలంబస్ ముందు అవాక్కయ్యాడు. ఇండియా, కాథే లాంటి సంపన్న ప్రాంతాలకి చెందిన జనం ఖరీదైన వస్త్రాలంకరణతో హుందాగా ఉంటారని ఆశించాడు. కాని ఈ మనుషులకి ఒంటి మీద పెద్దగా బట్ట ఉన్నట్టు లేదు. ముఖం మీద, ఒంటి మీద వింతగా రంగులు పులుముకున్నారు. చెవులకి మాత్రం చెవిపోగులు వేలాడుతున్నాయి. చూడబోతే అవి బంగారపు పోగుల లాగానే ఉన్నాయి. నేపథ్యంలో ఎక్కడా పెద్ద పెద్ద భవనాలు, గోపురాలు కనిపించలేదు. అదో విశాలమైన, పచ్చని దీవి. మధ్యలో ఓ పెద్ద సరస్సు కనిపిస్తోంది.
ఆ వచ్చిన స్థానికులు కొలంబస్ బృందాన్ని చూసి అబ్బురపడ్డారు. ధగధగలాడే వస్త్రాలతో రాజసంగా నిలుచున్న కొలంబస్ ని చూసి ఎవరో మహానుబావుడు అనుకున్నారు. అతడి చుట్టూ మోకరిల్లి భక్తిగా కొలుస్తున్న తన పరివారాన్ని చూస్తే వారి నమ్మకం ఇంకా బలపడింది. తమ లాగా కాక తెల్లని మైఛాయతో వెలిగిపోతున్న ఈ పరదేశీలని చూసి వీళ్లెవరో దేవతలు అనుకున్నారు. “రెక్కల పడవలలో” (తెరచాపలు గల ఓడలు) దివి నుండి దిగి వచ్చిన వేలుపులు అనుకున్నారు. కొలంబస్ బృందం తమతో తెచ్చిన రంగురంగుల బట్టలు, రకరకాల పూసలు, మొదలుకొని తాము ఎన్నడూ చూడని ఎన్నో సుందరమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు. ఆ విధంగా తమ మీద అడగకనే వరాలు గుమ్మరిస్తున్న దేవతలు అంటే వారికి చెప్పలేనంత గౌరవం కలిగింది. వారిని ఆదరంగా తమ దీవిలోకి ఆహ్వానించారు. నానా రకాల పళ్లు, పుష్పాలు, పలురంగుల పక్షులు సమర్పించుకుని తగిన విధంగా ఆతిథ్యం చూపించారు. ఆ విధంగా ఆ “దేవతలు”, ఈ “మానవులు” సామరస్యంగా కలిసిపోయారు.
కొలంబస్ కి మొదట్లో తాము వచ్చిన ప్రాంతం ఇంతకీ ఏంటి అన్న విషయం మీద కొంత సందేహం కలగకపోలేదు. కాని స్థానికుల బంగారపు చెవిపోగులు చూసి వీళ్లు “ఇండియన్లు” అనే అనుకున్నాడు. తాము పాదం మోపిన దీవి ఇండియా, కాథేలు కాకపోయినా ఆయా ప్రాంతాల తీరాలకి బాగా సమీపంలో ఉన్న ఏదో దీవి అయ్యుండొచ్చు అనుకున్నాడు. అక్కణ్ణుంచి మరి కాస్త దక్షిణ-పశ్చిమ దిశగా ప్రయాణిస్తే తప్పకుండా ఇండియా తీరం వస్తుందని అనుకున్నాడు.
కొలంబస్ తను చూసిన ఈ కొత్త భూమి గురించి, స్థానికుల గురించి ఈ విధంగా రాసుకున్నాడు – “పగటి ముందు రాత్రి ఎలా వెలవెలబోతుందో, ఈ నవ్య భూమి యొక్క వైభవం ముందు తక్కిన భూములన్నీ అలా వెలవెలబోతాయి. ఇక్కడి జనం కూడా పరాయి వారిని తమ వారిగా తలచి ఆదరించే ఉదారస్వభావులు. వారి భాష తీయగా, మృదువుగా ఉంటుంది. వారి ముఖాన ఎప్పుడూ చిరునవ్వులు తాండవిస్తుంటాయి. ఇక అతిథి సత్కారాల విషయంలో వారిని మించిన వారు ఉండరు. అసలు ఈ మొత్తం ప్రపంచంలో వీళ్ల కన్నా ఉత్తములు ఉండరు.”
అలా స్థానికులని అంతగా పొగిడిన కొలంబస్ త్వరలోనే కొంతమంది స్థానికులని బలవంతంగా తమ ఓడలకి ఎక్కించుకుని వారి సహాయంతో ఆ చుట్టుపక్కల ఉన్న దీవులన్నిటినీ అన్వేషించడం మొదలెట్టాడు. తనని అంతగా ఆదరించిన వారి పట్ల అతి కిరాతకంగా ప్రవర్తించి తనలోని దుష్టత్వాన్ని బయటపెట్టాడు.
అలా స్థానికుల మార్గదర్శకత్వంలో ఒక్కొక్క దీవినీ సందర్శిస్తూ పోయాడు. కాని ఎక్కడా తను ఊహించిన పాలరాతి మేడలు, బంగారు బురుజులు కనిపించలేదు.
అలా ప్రయాణిస్తుండగా మనం ప్రస్తుతం “వెస్ట్ ఇండీస్” అని చెప్పుకునే ద్వీపకల్పంలో ఓ పెద్ద ద్వీపం అయిన క్యూబాని చేరుకున్నాడు. ఇక్కడ కూడా తను ఎదురుచూసిన గొప్ప నాకరిక లక్షణాలు కనిపించలేదు. వెదురు పాకలు, జొన్న చేలు తప్ప.
ఈ వ్యవహారం ఎటూ సాగడం లేదని గమనించాడు, ‘పింటా’ ఓడకి కెప్టెన్ అయిన అలోన్సో పింజాన్. అతడి మనసులో ఓ ఆలోచన మెదిలింది.
(ఇంకా వుంది)
శ్రీనివాస చక్రవర్తి గారికి, నమస్కారం.
'లోకం చుట్టిన వీరుడు' రసవత్తరం గా ఉంది.
కానీ '11 వ భాగం - దారుణ సముద్ర భ్రాంతి' తరువాత '13 వ భాగం - దిగి వచ్చిన దేవతలు' ప్రచురించారు. తరువాత '14 వ భాగం - స్పెయిన్ కి తిరుగు ప్రయాణం' వచ్చింది. మరి పన్నెండో భాగం ఏమైనట్టు..?? అది నెంబర్ చూపించడం లో పొరపాటా.. లేక నిజంగానే ఆ భాగం మిస్సయ్యిందా..? దయచేసి గమనించగలరు.