http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-516
స్థానికులని బలవంతంగా ఓడల లోకి ఎక్కించుకుని దరిదాపుల్లో ఉన్న దీవులన్నీ పర్యటించడం మొదలెట్టాడు కొలంబస్. ఆ పర్యటనలలో ఓ విశాలమైన ప్రాంతం కనిపించింది. (అది నిజానికి ప్రస్తుతానికి మనం క్యూబా అని పిలిచే పెద్ద దీవి. కాని కొలంబస్ అదే ఆసియా ఖండం అనుకున్నాడు.) ఇలా ఉండగా పింటా ఓడకి కెప్టెన్ అయిన ఆలోన్సో పింజాన్ కి ఈ వ్యవహారంతో విసుగు పుట్టి తను వేరేగా మిగతా రెండు ఓడలని విడిచి పెట్టి మరో దిశలో ప్రయాణిస్తూ ముందుకు సాగిపోయాడు. ఈ పరిణామం కొలంబస్ కి ససేమిరా నచ్చలేదు కాని అలోన్సీని అతడు నివారించలేకపోయాడు. ఇక విసుగు పుట్టి క్రిస్మస్ సందర్భంలో ప్రయాణం నిలుపు చేసి ఏదో ఒక రేవులో విశ్రాంతి తీసుకోవాలని నిశ్చయించాడు. అయితే వారి దురదృష్టం వల్ల సరిగ్గా క్రిస్మస్ ముందు రోజు ఓ దుర్ఘటన జరిగింది.
కొలంబస్ ఉన్న సాంటా మారియా అనే ఓడని నడుపుతున్న ఓ కుర్రవాడు అనుభవం లేకపోవడం వల్ల ఓడని ఓ పెద్ద బండకి ఢీ కొట్టించాడు. ఓడకి పెద్ద చిల్లు పడి నీట మునగడం ఆరంభించింది. ఈ పరిణామంతో కొలంబస్ బాగా కదిలిపోయాడు. చేతిలో ఉన్న రెండు ఓడల్లో పెద్దదైన సాంటా మారియా నాశనమై పోయింది. ఇక మిగిలిన ‘నీనా’ కాస్త చిన్నది. ఉన్న నావికులంతా ఆ ఓడలో సరిగ్గా పట్టరు. పట్టినా అందులో చిన్న చిన్న ప్రయాణాలు వీలవుతాయేమో గాని అందరూ తిరిగి స్పెయిన్ కి వెళ్లడం అసంభవం. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు కొలంబస్.
ముంపునకు గురైన ఓడని పూర్తిగా విరిచేసి అలా వచ్చిన చెక్క ముక్కలతో తీరం మీద ఓ శిబిరాన్ని నిర్మించాలని నావికులకి ఆదేశించాడు. నావికులు పన్లోకి దిగారు. వారి శ్రమ ఫలితంగా ఓ చిన్న కోట లాంటిది తయారయ్యింది. ఆ కోటకి ‘ల నావిడాడ్’ అని పేరు పెట్టారు.
కోట నిర్మాణం ముగిశాక తన నావికులలో నలభై మందిని ఎంచుకుని ఆ కోటలో తను వచ్చే వరకు ఉండమని ఆదేశించాడు. మిగితా సిబ్బందితో తను స్పెయిన్ కి తిరిగి వెళ్లి వస్తానని, తను వచ్చేవరకు ఆ కోటని కనిపెట్టుకుని ఉండమని చెప్పాడు. స్థానిక “ఇండియన్ల”తో సత్సంబంధాలు పెంచుకొమ్మని, స్పెయిన్ రాజు, రాణుల మర్యాద నిలిచేలా మసలుకొమ్మని ఆదేశించాడు. కొలంబస్ తో తిరిగి ఆ దారుణ యాత్రలో పాల్గొనే కన్నా ఇక్కడే ఉండడం మేలని తలచారు ఆ నావికులు. పైగా కొలంబస్ వచ్చేలోగా ఆ ప్రాంతం అంతా గాలించి టన్నులు కొద్దీ బంగారాన్ని తెచ్చి ఆ కోటని నింపొచ్చని వారి ఆలోచన, ఆశ.
కొలంబస్ ‘నీనా’ ఓడలో తిరిగి స్పెయిన్ కి బయలుదేరాడు. కొంత దూరం పోయాక అంతకు ముందు తమని విడిచి వెళ్లిన ‘పింటా’ ఓడ కనిపించింది. ‘పింటా’ కెప్టెన్ అలోన్సో తను చెసిన పొరబాటుకి క్షమించమని కొలంబస్ ని అర్థించాడు. అతడు బంగారం మీద దురాశతో తమని విడిచి వెళ్లాడని, బంగారం దొరక్క తిరిగి వస్తున్నాడని కొలంబస్ కి బాగా తెలుసు. కాని బయటికి అలోన్సోని ఏమీ అనకుండా ఊరుకున్నాడు. రెండు ఓడలు స్పెయిన్ దిశగా సాగిపోయాయి.
స్పెయిన్ నుండి వచ్చినప్పటి కన్నా తిరుగు ప్రయాణం మరింత భయంకరంగా దాపురించింది. భీకర తుఫానులతో సముద్రం అతలాకుతలంగా ఉంది. ఒక దశలో నీనా ఓడ నాశనం అవుతుందనే అనుకున్నాడు కొలంబస్. కాని అదృష్టవశాత్తు సురక్షితంగా తుఫానులోంచి బయట పడ్డారు.
అయితే మార్గమధ్యంలో అలోన్సా పింజాన్ మళ్లీ తన బుద్ధి చూపించుకుని కొలంబస్ ని వదిలి పింటా ఓడలో వెళ్లిపోయాడు. తనే ముందు స్పెయిన్ చేరుకుని, ఘనత అంతా దక్కించుకోవాలని అతడి దురాశ.
15 మార్చి, 1493, నాడు నీనా ఓడ (పింటా కంటే ముందు) స్పెయిన్ లోని పాలోస్ రేవుని చేరుకుంది. కొలంబస్ కి తన బృందానికి పాలోస్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కొలంబస్ గౌరవార్థం పాలోస్ లో శతఘ్నులు పేలాయి. కొలంబస్ సాహసాలు ఊరంతా పొక్కాయి. తదనంతరం కొలంబస్ బార్సెలోనా కి వెళ్లి అక్కడ మహారాజు ఫెర్డినాండ్ ని, రాణి ఇసబెల్లాని సందర్శించాడు. రాజు, రాణులు ఇద్దరూ కొలంబస్ ని సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. కొలంబస్ తనతో పాటు తెచ్చుకున్న కాసిన్ని మణి మాణిక్యాలని, రంగురంగుల పక్షులని, బంధించి తెచ్చిన దాస దాసీ జనాన్ని వారికి సమర్పించుకున్నారు. గతంలో మార్కో పోలో వర్ణించిన ఇండియా, చైనా ల నుండి వచ్చినవే ఈ బహుమతులని రాజు, రాణులు ఎట్టకేలకి నమ్మారు. కొలంబస్ తను కొత్తగా కనుక్కున్న భూములకి మరొక్కసారి ప్రయాణించడానికి వాళ్లు ఆనతి ఇచ్చారు.
25 సెప్టెంబర్ 1493, నాడు కొలంబస్ పదిహేడు నౌకలు గల నౌకా దళంతో, పదిహేను వందల మంది సిబ్బందితో మరొక్కసారి అట్లాంటిక్ సముద్రం మీద “కొత్త లోకం” దిశగా బయల్దేరాడు.
(ఇంకా వుంది)
శ్రీనివాస చక్రవర్తి గారికి, నమస్కారం.
'లోకం చుట్టిన వీరుడు' రసవత్తరం గా ఉంది.
కానీ '11 వ భాగం - దారుణ సముద్ర భ్రాంతి' తరువాత '13 వ భాగం - దిగి వచ్చిన దేవతలు' ప్రచురించారు. తరువాత '14 వ భాగం - స్పెయిన్ కి తిరుగు ప్రయాణం' వచ్చింది. మరి పన్నెండో భాగం ఏమైనట్టు..?? అది నెంబర్ చూపించడం లో పొరపాటా.. లేక నిజం గానే ఆ భాగం మిస్సయ్యిందా..? దయచేసి గమనించగలరు.
సారీ. లోకం చుట్టిన వీరుడులో పన్నెండవ భాగం ఇంతకు ముందు ఎలాగో మిస్సయ్యింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. గుర్తించినందుకు ధన్యవాదాలు.