http://www.andhrabhoomi.net/intelligent/nidraa-lokam-735
నిద్రాలోకంలో కొన్ని సాహసోపేత ప్రయోగాలు
“అసలు మనిషన్నవాడు రోజుకి మూడు సార్లు పడుకోవాలోయ్!” ఆఫీస్ లో కునుకు తీస్తున్న సుబ్బారావు తటాలున లేచి ఎదురుగా అప్పారావు కనిపించగానే లెక్చర్ అందుకున్నాడు. “పొద్దున్న టిఫిన్ తరువాత గంట, మధ్యాహ్నం భోజనం తర్వాత రెండు గంటలు, రాత్రి ప్రశాంతంగా పది గంటలు.” సుబ్బారావు లా విచ్చలవిడిగా నిద్రపోయేవాళ్లు లేకపోలేదు. అలాగే సహజంగా అతితక్కువగా నిద్రపోయేవాళ్ళూ ఉన్నారు. ముఖ్యంగా బాగా వయసు పై బడ్డ వాళ్లలో ఎంతో మందికి రోజుకి ఐదు గంటలు పడుకోవడమే కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో టీనేజి పిల్లల్లో ఆలస్యంగా పడుకుని పొద్దున్నే లేచి బడికి వెళ్ళడానికి ఇబ్బంది పడే వాళ్లు ఎందరో. ఇక “షిఫ్ట్ డ్యూటీ” చేసే ఉద్యోగస్థుల విషయంలో నిద్రా సమయాలు చిందరవందరగా ఉంటాయి. ఆ విధంగా నిద్రపోయే అలవాట్లలో మనుషులలో ఎంతో వైవిధ్యం కనిపిస్తున్నా ఆ వైవిధ్యంలో ఒక సామాన్య లక్షణం కనిపిస్తుంది. నిద్ర అనేది ఒక దైనిక లయ. సామాన్యంగా పగలు, రాత్రి అనే లయని అనుసరిస్తూ సాగుతుంది నిద్ర లయ. సమాజం నడవాలంటే మనుషులు పని చెయ్యాలి కనుక, పనులలో మనుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు కనుక, అందరూ ఒకే సారి నిద్రించి, ఒకే సారి మెలకువగా ఉంటే సౌకర్యంగా ఉంటుంది. కాని ఇలాంటి సామాజిక, భౌతిక కట్టుబాటు లేకుండా సహజంగా సాగనిస్తే నిద్ర లయ ఎలా ఉంటుంది?
నిద్ర లయ అనేది బాహ్య పరిస్థితుల మీద ఆధారపడుతుందా, లేక ఓ స్వతస్సిద్ధమైన శరీర ధర్మం మీద ఆధారపడుతుందా అన్న విషయాన్ని తెలుసుకోడానికి ఫ్రాన్స్ లో 1972 లో మిచెల్ సిఫ్ర్ అనే ఓ వ్యక్తి ఓ విచిత్రమైన, సాహసోపేతమైన, (కొంచెం ప్రమాదకరమైన) ప్రయోగం చేశాడు. అయితే ప్రత్యేకించి ప్రయోగం చెయ్యాలని ఈ ప్రయోగం చెయ్యలేదు. అది అనుకోకుండా జరిగింది.
వృత్తి రీత్యా మిచెల్ ఓ భౌగోళిక శాస్త్రవేత్త. ప్రత్యేకించి భూగర్భంలోని గుహలని పర్యటించి, అధ్యయనం చెయ్యడం మెచెల్ కి ఓ హాబీ. హాబీలా మొదలైనా అదే తన జీవనవృత్తిగా పరిణమించింది. 1961 లో మిచెల్ కొందరు మిత్రులతో పాటు ఆల్ప్స్ పర్వతాల అడుగున, భూగర్భంలో ఓ హిమానీనదం (glacier) ప్రవహిస్తోందని తెలుసుకుని, దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యాలని బయలుదేరాడు. ఆ బృందం భూగర్భ గుహలలో పదిహేను రోజులు గడిపి ఎన్నో అధ్యయనాలు చేశారు. కాని అధ్యయనం పూర్తిచెయ్యడానికి పదిహేను రోజులు చాలా తక్కువ సమయం అనిపించింది. కనుక మరో సారి ప్రయత్నించి రెండు నెలలు గడిపారు. ఈ సారి గుహల కన్నా అలాంటి దారుణ, ఏకాంత పరిస్థితుల్లో మనిషి ఎలా మనగలుగుతాడు అన్న విషయం గురించి ఎన్నో విషయాలు తెలిశాయి. అది చూసిన మిచెల్ కి ఓ గొప్ప ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. ఆ ఆలోచనే ఓ వైజ్ఞానిక శాఖకి పునాది అయ్యింది.
సాధారణ బాహ్య పరిసరాలకి దూరంగా, కఠోరమైన ఏకాంతంలో మనిషిని ఉంచితే ఎలా స్పందిస్తాడు? అతడిలో ఎలాంటి మానసిక మార్పులు వస్తాయి? అతడి నిద్ర లయ ఎలా మారుతుంది? అతడిలో కాలాన్ని గురించిన అనుభూతి ఎలా మారుతుంది? మొదలైన ప్రశ్నల సమాధానాల కోసం గాలిస్తూ మిచెల్ ఓ సాహసోపేతమైన ప్రయోగానికి పూనుకున్నాడు. 1972 లో జరిగిన ఈ ప్రయోగంలో మానవ ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు లేకుండా భూగర్భ గుహలో ఒక్కడే జీవిస్తూ అలాంటి పరిస్థితుల్లో తనలోని మార్పులని పరిశోధిస్తూ పోయాడు. గుహకి ముఖద్వారం వద్ద ఒక బృందం వేచి వుంటుంది. మూడు సందర్భాల్లో మాత్రమే మిచెల్ వైర్లెస్ ద్వారా వాళ్లకి కబురు పెడతాడు - నిద్ర నుండి మేలుకున్న వెంటనే, భోజనం చేసిన తరువాత, నిద్రపోయే ముందు. అతడు పిలవకుండా ఎవరూ గుహలోకి రాకూడదు. బి.పి, ఉష్ణోగ్రత మొదలైన శరీర లక్షణాలని ఎప్పటికప్పుడు చేరవేసేందుకు గాను తన ఒంటి నిండా వైర్లు అమర్చబడి ఉంటాయి. చదువుకుంటూ, రాసుకుంటూ, తన మీద తను పరిశోధనలు చేసుకుంటే కాలక్షేపం చేసేవాడు. అలా జీవిస్తున్న పరిస్థితుల్లో కాలం గురించి తన అనుభూతిలో సమూలమైన మార్పులు రావడం గమనించాడు.
ఉదాహరణకి తనని కలుసుకోడానికి పై నుండి ఎవరైనా వచ్చినప్పుడు తనకి తను రెండు చిన్న పరీక్షలు పెట్టుకునేవాడు. మొదటిది, తన నాడి చూసుకుని నాడి వేగం కొలవడం. రెండవది, సెకనుకి ఒక అంకె చొప్పున 1 నుండి 120 వరకు లెక్కపెట్టడం. అంటే మామూలుగా రెండు నిముషాలు పడుతుంది. కాని మిచెల్ కి 5 నిముషాలు పట్టింది. అది నీరసం వల్లనో, చిత్త చాంచల్యం వల్లనో జరిగిన మార్పు కాదు. తను ఆరోగ్యవంతంగానే ఉన్నాడన్న విషయం తన చుట్టూ ఉన్న పరికరాలు చెప్తున్నాయి. నాడి వేగంలో పెద్ద మార్పు లేదు. కాని కాలం యొక్క తన అనుభూతిలో మార్పు వచ్చింది.
ఆ మార్పు మరింత సంచలనాత్మకంగా కూడా వ్యక్తం అయ్యింది. ఉదాహరణకి అతడు జూలై 16 నాడు గుహలోకి ప్రవేశించాడు. సెప్టంబర్ 14 కల్లా ప్రయోగం పూర్తి చేసుకుని బయటికి రావాలని ఉద్దేశం. కాని “అనుకున్న దాని కన్నా ముందుగానే” అతడి బృందం ప్రయోగం అయిపోయిందని కబురు పెట్టింది. తన ప్రకారం అది ఆగస్టు 20. ఆంటే వాస్తవ కాలగతి కన్నా తన మానసిక కాలగతి నెమ్మదించింది అన్నమాట.
కాలానుభూతిలో ఈ మార్పులు నిద్ర లయలో కూడా కనిపించాయి. రేయింబవళ్లతో సంబంధం లేకుండా జీవించడం వల్ల, నిద్ర లయ మారిపోయింది. 24 గంటల ఆవృత్తికి బదులు మొదట్లో 24 గంటల, 30 నిముషాల ఆవృత్తి కనిపించింది. అది పెరిగి పెరిగి కొంత మంది విషయంలో 48 గంటల ఆవృత్తి వరకు కూడా వెళ్లింది.
ఇలాంటి ప్రయోగాల వల్ల సహజ నిద్ర లయల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాడు మిచెల్. ఈ ప్రయోగాలు ‘జీవకాలమాన శాస్త్రం’ (chronobiology) అనే కొత్త వైజ్ఞానిక శాఖకి జీవం పోశాయి. ఫ్రాన్స్ లోనే కాక తదనంతరం అమెరికాలో కూడా గుహలలో అలాంటి ప్రయోగాలు చేశాడు. ఇటీవలి కాలంలో కూడా మరెందరో అలాంటి ప్రయోగాలు చేశారు. మన దేశంలో తమిళనాడు లోని మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. అయితే గుహలలోనో, గనులలోనో కాకుండా మరింత సౌకర్యమైన పరిస్థితుల్లో, రేబవళ్లు తెలీకుండా జాగ్రత్తపడుతూ, ప్రయోగాలు చేశారు. మిచెల్ చేసిన ప్రమాదకరమైన ప్రయోగాలు చెయ్యడానికి ఆధునిక వైజ్ఞానిక నైతికతా సదస్సులు ఒప్పుకోవు. అయితే ఏ రంగంలోనైనా పురోగాముల విషయంలో అలా సాహసం చెయ్యక తప్పదేమో. ఓ వైజ్ఞానిక సత్యాన్ని తెలుసుకోవడం కోసం ప్రాణాలకి తెగించి సాహసించిన వైజ్ఞానిక వీరుల జాబితాలోకి చేరిపోయాడు మిచెల్ సిఫ్ర్.
0 comments