http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-656
“కొత్త లోకం”లో చెలరేగుతున్న నిరసనలని కొలంబస్ అదుపు చెయ్యలేకున్నాడు అన్న కారణం చేత స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ పరిస్థితిని చక్కబెట్టుకు రమ్మని బోబడియా అనే అధికారిని పంపాడు.
బోబడియా వెంటనే పయనమయ్యాడు. అయితే బోబడియా హైటీని చేరుకునే సరికే కొలంబస్ అక్కడ పరిస్థితులని చక్కబెట్టాడు. సమస్యకి కారణమైన రోల్డాన్ తో రాజీ కుదుర్చుకుని ఆ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొనేలా చేశాడు. బోబడియా హైటీ తీరం మీద అడుగుపెట్టేసరికి ఆ పరిసరాలన్నీ ప్రశాంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. తను ఓడ దిగీ దిగగానే చేతుల నిండా పని ఉంటుందనుకున్న బోబడీయా కాస్త నిరుత్సాహ పడ్డాడు. ఉన్నపళంగా స్పెయిన్ కి తిరిగి వెళ్లిపోతే అక్కడ జనం నవ్వుతారు. వచ్చినందుకు ఏదో ఒకటి చెయ్యాల్సిందే.
అవసరం లేకపోయినా తన ప్రతాపం చూపించదలచుకున్నాడు బోబడియా. తనే కొత్త గవర్నరుగా ప్రకటించుకున్నాడు. కొలంబస్ ని ఆ పదవి నుండి తొలగించాడు. ‘ఇసబెల్లా’ నగర వాసులని కలుసునుకుని సమస్య గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టాడు. బంగారం అని ఆశ పెట్టి వట్టి చేతులు చూపించిన కొలంబస్ మీద అక్కసు తీరా చాడీలు చెప్పారు జనం. వెంటనే కొలంబస్ ని, అతడి తమ్ముళ్లని తన మందిరానికి పిలిపించుకుని అక్కడికి వాళ్ళు రాగానే చేతులకి, కాళ్లకి గొలుసులు కట్టి బంధించాడు.
అన్నదమ్ములు ముగ్గురూ కారాగారంలో బందీలు అయ్యారు. మహాసముద్రాలని జయించిన అడ్మిరల్ డాన్ క్రిస్టఫర్ కొలంబస్, ఇండీస్ కి వైస్రాయ్, స్పెయిన్ ప్రజల గౌరవ మర్యాదలని చూరగొన్న మహావ్యక్తి, ఓ మామూలు దొంగలా జైలు పాలయ్యడు. కొలంబస్ కొన్ని పొరబాట్లు చేసి ఉండొచ్చు కాక. కాని ప్రాణాలొడ్డి కొత్త భూములు కనుక్కుని, స్పెయిన్ కి ఎంతో మేలు కూడా చేశాడు. కనుక అతణ్ణి ఇలా జైలు పాలు చెయ్యడం కిరాతకం.
కొలంబస్ ని సోదరులని విల్లిజో అనే అధికారికి అప్పజెప్పి, ఓడలో స్పెయిన్ కి పంపాడు బోబడియా. ఈ విల్లిజోకి కొలంబస్ అంటే ఎంతో అభిమానం. అందుకే ఓడలు కొంత దూరం ప్రయాణించగానే కొలంబస్ సోదరుల సంకెళ్లు తొలగించి వాళ్లని మర్యాదగా ఆదరించాడు. పై అధికారి ఆజ్ఞకి తలవంచక తప్పలేదని, కనుక సంకెళ్ళు వెయ్యాల్సి వచ్చింద్దని, కొలంబస్ ని క్షమాపణ కోరాడు. కాని కొలంబస్ “లేదు విల్లిజో! అది బోబడియా సంకల్పం కాదు. అది రాజు, రాణుల ఆజ్ఞ. కనుక ఈ సంకెళ్ళు ఇలాగే ఉండనీ,” అంటూ బాధపడుతున్న విల్లిజోని ఓదార్చాడు.
1500 అక్టోబర్ నెలలో కొలంబస్ సోదరులని మోసుకొచ్చిన ఓడ స్పెయిన్ లో కాడిజ్ నగరపు రేవులో ప్రవేశించింది. కొలంబస్ ని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. కాని చేతులకి, కాళ్లకి గొలుసులతో ఓడ దిగి వస్తున్న తమ అడ్మిరల్ ని చూసి జనం నిర్ఘాంతపోయారు. కేవలం ఎనిమిదేళ్ల క్రితం విజయుడై తిరిగొచ్చి మహరాజ సత్కారాన్ని పొందిన కొలంబస్ ని ఇలాంటి స్థితిలో చూస్తారని వాళ్లు అనుకోలేదు. ఏం జరిగింది? కొలంబస్ ఏం అపరాధం చేశాడు? సమాధానం ఎవరికీ కచ్చితంగా తెలీదు.
ఓడ దిగీదిగగానే కొలంబస్ రాచకొలువులో ఉన్న ఓ మిత్రుడికి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఇటీవలి కాలంలో తను పడ్డ యాతనలన్నీ వివరించాడు. తను భరించిన అవమానాలన్నీ ఏకరువు పెట్టాడు. ఏవో కొన్ని పొరబాట్లు చేసినా రాజు, రాణుల పట్ల తన గౌరవాభిమానాలు మారనివని, దేశం కోసం తాను ఎన్నో గొప్ప విజయాలు సాధించానని గుర్తుచేస్తూ తనకీ ఆత్మగౌరవం ఉంటుందని కూడా చాటుకున్నాడు. ఉత్తరం చదివిన రాణి ఇసబెల్లా జరిగినదేంటో తెలిసింది. బోబడియా చేసిన ఘాతుకాలకి మండిపడింది.
వెంటనే కొలంబస్ ని, అతడి సోదరులని చెర విడిపిస్తూ ఉత్తరువులు పంపింది. కొలంబస్ కి పెద్ద మొత్తం ధనం బహుమతిగా పంపుతూ రాజసభకి ఆహ్వనించి తగు రీతిలో సత్కరించింది. రాణి ఆదరణకి కొలంబస్ మనసు తేలిక పడింది. ఇదే అదను అనుకుని మరో సారి యాత్ర చేసే అవకాశం ఇవ్వమని కోరాడు. రాజదంపతులు తప్పకుండా అవకాశం ఇస్తాం అంటూ బోలెడు వాగ్దానలు చేసి పంపేశారు.
కాని ఫెర్డినండ్ రాజుకి ఈ సారి కొలంబస్ ని పంపడం ససేమిరా ఇష్టం లేదు. దాని వెనుక ఓ పన్నాగం ఉంది. ఇంతవరకు కొత్త లోకం నుండి వచ్చిన బంగారం పెద్దగా ఏమీ లేదు. అయితే ఈ యాత్రలు ఇలాగే కొనసాగుతే భవిష్యత్తులో అధిక మొత్తంలో బంగారం దొరికే అవకాశం ఉంది. కాని ప్రతీ సారి కొలంబస్ నే పంపితే ఈ వ్యవహారంలో తనదే ఏకఛత్రాధిపత్యం అవుతుంది. లాభాలలో పెద్ద మొత్తం తనదవుతుంది. కొత్త వాళ్లయితే తక్కువతో సరిపెట్టుకుంటారు. అప్పుడు రాజ్యానికి వచ్చే వాటా పెద్దది అవుతుంది.
కనుకనే వాగ్దానాలు చేశారేగాని ఎంతో కాలం యాత్రకి కావలసిన వసతులు అనుగ్రహించలేదు. కొలంబస్ ఓపిగ్గా ఓ రెండేళ్లు స్పెయిన్ లోనే ఉండి యాత్ర కోసం ఎదురుచూశాడు. చివరికి ఒక షరతుతో రాజు, రాణి యాత్రకి ఒప్పుకున్నారు.
కొలంబస్ కొత్త లోకానికి ప్రయాణించొచ్చు గాని హైటీ దీవి వద్దకి మాత్రం పోకూడదు. అక్కడి వ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదు. కొలంబస్ కి ఆ షరతులకి ఒప్పుకోక తప్పింది కాదు.
ఆ విధంగా 1502 లో మే తొమ్మిదవ తేదీ నాడు కొలంబస్ నాలుగు చిన్న పడవలతో, నూట యాభై మంది సిబ్బందితో ఇండీస్ కి ప్రయాణమయ్యాడు.
ఇది అతడి నాలుగవ యాత్ర. ఇదే అతడి ఆఖరు యాత్ర కూడా అయ్యింది.
(ఇంకా వుంది)
0 comments