http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-487
స్పెయిన్, రాజు రాణుల మద్దతుతో కొలంబస్ రెండవ యాత్ర మొదలయ్యింది. ఈ సారి యాత్ర లక్ష్యం బంగారం. ఈ సారి వచ్చేటప్పుడు “కొత్త లోకం” నుండి మణుగుల కొద్ది బంగారం తెచ్చిస్తానని కొలంబస్ వాగ్దానం చేశాడు. తనతో వచ్చిన వెయ్యిన్నర సిబ్బంది ఆ ఆశతోనే ఈ దారుణ యాత్ర మీద బయలుదేరారు.
క్రిందటి యాత్రలో తాము సందర్శించిన దీవులన్నిటినీ సందర్శిస్తూ వాటిలో పెద్దదైన హైటీ (దాన్ని కొలంబస్ హిస్పానియోలా అని పిలిచేవాడు) కి వెళ్లాడు. ఈ దీవిలోనే లోగడ ‘ల నావిడాడ్’ అనే కోటని నిర్మించి అక్కడ నలభై మంది సిబ్బందిని నియమించాడు. ఈ సారి తను వచ్చేసరికి ‘ల నావిడాడ్’ సిబ్బంది బోలెడంత బంగారాన్ని సేకరించి ఉంటారన్న గంపెడంత ఆశతో ఉన్నాడు కొలంబస్.
కాని తీరా ఆ కోటకి వెళ్లి చూస్తే అక్కడ ఒక్కడూ మిగలలేదు. అందరూ హతమయ్యారు. అక్కడే ఉన్న ఒక (రెడ్) “ఇండియన్” ని ఏం జరిగిందని అడిగాడు. అక్కడ మిగిలిన సిబ్బంది స్థానికులతో కిరాతకంగా ప్రవర్తించి కలహాలకి దిగి ప్రాణాలు కోల్పోయారు. తన పనికి ఇలాంటి అథములని ఎంచుకుని పొరపాటు చేశానని బాధపడ్డాడు కొలంబస్. కాని పంతంగా ఈ సారి కోటకి బదులు ఓ ఊరే నిర్మించడానికి నిశ్చయించాడు. దరిదాపుల్లోనే స్పెయిన్ రాణి ‘ఇసబెల్లా’ పేరుతో ఓ నగరాన్ని నిర్మించాడు. ఎన్నో భవనాలు, తోటలు, ప్రార్థనాలయం ఇలా ఎన్నో హంగులతో ఓ చక్కని ఊరు వెలసింది.
ఉండడానికి ఇంత చోటు దొరికాక మళ్లీ ‘బంగారం వేట’ మొదలయ్యింది. బంగారం కోసం వాళ్లు వెదకని చోటు లేదు. సెలయేళ్లు గాలించారు. నేలలో గోతులు తవ్వారు. బంగారం ఎక్కడ దొరుకుతుందో చెప్పమని స్థానిక “ఇండియన్ల”ని వేధించేవారు. వారి యాతన స్థానికులు భరించలేకపోవారు. తెల్లవారిన దగ్గర్నుండి ఈ తెల్లవారికి బంగారం, బంగారం అనే దేవుళ్లాట తప్ప వేరే ధ్యాసే లేదా అని అసహ్యించుకునేవారు.
1494 లో కొలంబస్ తను మొదట తెచ్చిన పదిహేడు ఓడల్లో పన్నెండు ఓడలు తిరిగి స్పెయిన్ కి పంపేశాడు. అయితే తను మొదట వాగ్దానం చేసినట్టు అందులో మణుగుల బంగారం పంపలేదు. మరిన్ని ఉత్త వాగ్దానాలు చేస్తూ ఉత్తరాలు పంపాడు. నావికులలో తనని వ్యతిరేకించి ఇబ్బంది పెట్టిన కలహాల కోరు నావికులని కట్టగట్టి వెనక్కి పంపేశాడు. వారితో పాటూ కొందరు స్థానిక “ఇండియన్ల”ని బంధించి దాసులుగా అమ్ముకునేందుకు గాను స్పెయిన్ కి పంపాడు. ఇలాంటి కిరాతక చర్యల కారణంగా కొలంబస్ పట్ల నావికులలో వ్యతిరేకత క్రమంగా పెరగసాగింది. వాగ్దానాలు పెరుగుతున్నాయి గాని బంగారం సూచనలు కనిపించకపోవడంతో స్పెయిన్ లో కూడా కొలంబస్ పట్ల అవిశ్వాసం పెరగసాగింది.
కలహాల కోరు నావికుల సంఖ్య తగ్గాక కొలంబస్ నిశ్చింతగా “కొత్త లోకపు” దీవుల పర్యటన కొనసాగించాడు. అయితే ఆ పర్యటనలలో ఒక దశలో కొలంబస్ కి బాగా సుస్తీ చేసింది. నౌకాదళం ‘ఇసబెల్లా’ నగరానికి తిరుగు ముఖం పట్టింది. ఆరోగ్యం బాగా క్షీణించి ఐదు నెలల పాటూ మంచం పట్టాడు కొలంబస్. ఇదే అదను అనుకుని నావికులలో కొందరు కొలంబస్ వ్యతిరేకులు స్పెయిన్ కి పారిపోయి అక్కడ రాజు, రాణులకి కొలంబస్ గురించి నానా రకాలుగా కథలు అల్లి చెడ్డగా చెప్పారు. కొలంబస్ మన వాడు కాడని, ఇటాలియన్ అని, పగవాడని, ద్వేషం నూరిపోశారు. బంగారం పంపేది ఉత్తుత్తి మాట అని, అక్కడ బంగారమే లేదని, అసలది ఇండీయానే కాదని చెప్పారు.
ఇలా ఉండగా అక్కడ “కొత్త లోకం” లో కొలంబస్ ఆరోగ్యం నెమ్మదిగా మెరుగు పడింది. నావికులలో కొందరు నమ్మకద్రోహులు చేసినదేంటో తెలుసుకున్నాడు. ఇక ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించాడు. రాజు, రాణుల మనసు మారిపోతే ఇక భవిష్యత్తులో తన యాత్రలకి వాళ్లు సహాయం చెయ్యరేమో నని భయపడ్డాడు. కనుక వెంటనే వెళ్లి స్వయంగా రాజు, రాణులని కలిసి జరిగిందేంటో విన్నవించుకోవాలి.
కనుక 10 మార్చి 1496 నాడు మిగిలిన నౌకలతో, నావికులతో స్పెయిన్ ముఖం పట్టాడు కొలంబస్.
మొదటి యాత్ర తరువాత స్పెయిన్ కి తిరిగి వచ్చినప్పటి పరిస్థితులకి, ఈ సారి పరిస్థితులకి ఎంతో తేడా ఉంది. మొదటి సారి విజయుడై తిరిగొచ్చిన కొలంబస్ కి స్పెయిన్ దేశం అంతా ఘన నివాళులు అర్పించింది. ఈ సారి తాను మనుషులని అమ్ముకునే కిరాతకుడు, దేశాన్ని నమ్మించి మోసం చేసిన ద్రోహి. తీరం మీద దిగగానే తనకి ఎలాంటి సత్కారం దొరుకుతుందో తెలీదు. తన మనసంతా ఆందోళనగా ఉంది.
కాని తీరా తీరం చేరాక పరిస్థితి తను అనుకున్నంత దారుణంగా ఏమీ లేదని తెలుసుకుని కొలంబస్ మనసు తేలిక పడింది. రాజు, రాణి తన కోసం కబురు పెట్టారు. కొలంబస్ వెళ్లి వారి దర్శనం చేసుకున్నాడు. రాచదంపతులు కొలంబస్ ని తగు రీతిలో ఆహ్వానించి, ఆదరించారు. ఎన్నో మంచి మాటలాడి తను సాధించిన విజయాలకి మెచ్చుకున్నారు. తను కనుక్కున్న హైటీ దీవిలో ఓ విశాల భూభాగాన్ని తననే బహుమతిగా తీసుకొమ్మని వరం ఇచ్చారు. ఇదే అదను అనుకుని కొలంబస్ మరో సారి యాత్రకి మద్దతు కావాలని అర్థించాడు. కొలంబస్ విన్నపాన్ని త్రోసిపుచ్చకపోయినా అందుకు కొంత గడువు కావాలని కోరారు రాచదంపతులు.
కొలంబస్ యాత్రని వాయిదా వెయ్యడానికి కారణం వారిలో ఈ యాత్రల పట్ల క్రమంగా పెరుగుతున్న అపనమ్మకమే. కొలంబస్ ఏవో కొత్త భూములు కనుక్కుని ఉండొచ్చు గాని, అవసలు ఇండియా చైనాలు కావని వారిలో సందేహం మొదలయ్యింది. కాని మనసులో సందేహం ఉన్నా కొలంబస్ తో తెగతెంపులు చేసుకోవడం ఇష్టం లేక మర్యాదగా మాట్లాడి పంపేశారు. కాని ఆ సందేహం వల్ల కొలంబస్ మూడవ యాత్ర సంధిగ్ధంలో పడింది.
(ఇంకా వుంది)
0 comments