http://www.andhrabhoomi.net/intelligent/munchu-991
ఇటీవలి కాలంలో 2012 సంవత్సరం ఓ ప్రత్యేకతని సంతరించుకుంది. ప్రాచీన మాయన్ కాలెండరు ప్రకారం వచ్చే ఏడాది లోకం అంతమైపోతుంది అన్న వదంతి కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఆ యుగాంతానికి రకరకాల కారణాలు ప్రతిపాదించబడ్డాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, ఉల్కాపాతాలు, ధృవాలు తారుమారు కావడాలు – ఒకటా రెండా, బోలెడు భీభత్సమైన కారణాలు. ఇవి కాకుండా మంచు వల్ల మానవ జాతి నాశనం కానుంది అన్న విచిత్రమైన భావన ఇంచుమించు ఓ శతాబ్దం క్రితం ప్రతిపాదించబడింది.
దాన్ని ఊహించినవాడు హ్యూ ఔచిన్ క్లాస్ బ్రౌన్ (1879 – 1975). అతడో ఎలక్ట్రికల్ ఇంజినీరు. 1900 లో అమెరికాలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టం పుచ్చుకున్నాడు. 1911 ప్రాంతాల్లో అతడికి ఓ వింతైన వార్త కంటపడింది. ఘనీభవించిన ఆర్కిటిక్ సముద్రంలో జరిగిన తవ్వకాల్లో మామొత్ అనే రకం భారీ (ఏనుగుని పోలిన) జంతువు కళేబరం బయటపడింది. తవ్వకాల్లో జంతువు అస్తికలు, శిలాజాలు బయటపడడం కొత్త కాదు. కాని మాంసంతో పాటు చెక్కుచెదరకుండా దొరకడం కొంచెం ఆశ్చర్యం. అయితే మంచులో చిక్కుకుని ఉంది కనుక మాసం కుళ్ళకుండా ఉండిపోయిందని సర్దిపెట్టుకోవచ్చు. కాని మరింత విచిత్రమైన విషయం మరొకటి ఉంది. ఆ రకం జంతువు సామాన్యంగా ధృవప్రాంతాల వద్ద కనిపించదు. అది ఉష్ణమండల ప్రాంతాల్లో సంచరించే జంతువు. మరి ఆర్కిటిక్ వద్దకి ఎలా వచ్చింది? మరో విశేషం ఏంటంటే అది సహజ పరిస్థితుల్లో మరణించినట్టు లేదు. ఏదో హఠాత్పరిణామంలో ప్రాణాలు కోల్పోయినట్టు కనిపించింది. “అది మేస్తున్న బటర్కప్ పువ్వులు ఇంకా దాని దవడల్లో చిక్కుకుని ఉన్నాయి,” అని రాస్తాడు హ్యూ బ్రౌన్ దాన్ని వర్ణిస్తూ. తదనంతరం జరిగిన తవ్వకాల్లో అలాంటి ఆనవాళ్లు మరిన్ని కనిపించాయి. ఉష్ణమండలానికి చెందిన జంతువులు ధృవప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడడం ఎన్నో సందర్భాల్లో జరిగింది. ఇలాంటి వార్తలు చూసిన హ్యూ బ్రౌన్ దానికి కారణాల గురించి లోతుగా ఆలోచించసాగాడు.
ఆ రోజుల్లో అతడికి అందుబాటులో ఉన్న శాస్త్రసమాచారాన్ని బట్టి, శాస్త్రసాధనాల బట్టి కొన్ని అధ్యయనాలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చాడు. భూమి ధృవాలు ఎప్పుడూ ఒకే స్థానంలో ఉండవు. కాలానుగతంగా వాటిలో మార్పులు వస్తుంటాయి. అయితే భూమి ధృవాలలో మార్పు ఉంటుందన్నది అనాదిగా తెలిసినదే. భూమి అక్షంలో చిన్న చలనం ఉంటుందని, అది 26,000 ఏళ్లకి ఒక సారి ఒక పూర్తి చుట్టు చుడుతుందని, ప్రాచీన భారతీయులకి కూడా తెలుసును అనడానికి దాఖలాలు ఉన్నాయి. అయితే హ్యూ బ్రౌన్ చెప్పే చలనం వేరు. ఇతడు చెప్పే చలనం కాస్తో కూస్తో కాదు. భూమి మొత్తం ఒక పక్కకి ఒరిగిపోయేలా జరిగే గణనీయమైన చలనం. ఇంచుమించు తొంభై డిగ్రీలకి పక్కకి ఒరిగే ఉపద్రవాత్మకమైన ‘ధృవభ్రంశం (pole shift)’. ఈ ధృవ భ్రంశం జరగడానికి కారణాలని ఈ విధంగా సిద్ధాంతీకరించాడు హ్యూ బ్రౌన్.
భూమి ధృవాలు విశాలమైన మంచు ప్రాంతాలు. ప్రస్తుత స్థితిలో మన అంటార్కిటికానే తీసుకుంటే అది దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. దాని తీరానికి సమీపంలో మంచు కేవలం కొన్ని వేల అడుగుల మందమే ఉన్నా, దక్షిణ ధృవం దగ్గర్లో మంచు మందం రెండు మైళ్ల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఆ మందం మూడు మైళ్ల వరకు కూడా ఉండొచ్చు. ఈ మొత్తం మంచు యొక్క భారం 19 క్వాడ్రిలియన్ (ఒకటి పక్కన 15 సున్నాలు) టన్నులు ఉంటుందని అంచనా. అంత పెద్ద బరువు భూమి ధృవాల వద్ద ఉండడం కొంత వరకు భూమి యొక్క ఆత్మభ్రమణానికి స్థిరత్వాన్ని, ధృతిని ఇస్తుందన్నది భౌతికశాస్త్రవేత్తలకి తెలిసినదే. కాని ఆ బరువు మరీ ఎక్కువైతే స్థిరత్వం దెబ్బతిని ఒక దశలో భూమి పక్కకి ఒరిగే ప్రమాదం ఉందంటాడు హ్యూ బ్రౌన్. గతంలో అలాంటి పరిణామం వల్ల భూమి అక్షంలో మళ్లీ మళ్లీ గణనీయమైన మార్పులు వచ్చాయని, అందుకే ఉష్ణమండలానికి చెందిన ప్రాంతాలు తదనంతరం ధృవప్రాంతాలు కావడం జరిగిందని, ఈ పరిణామాలు 8,000 ఏళ్లకి ఒకసారి జరుగుతాయని ఊహించాడు హ్యూ బ్రౌన్. ఇక రాబోయే ధృవ భ్రంశం అతి దగ్గరలోనే జరుగనుందని సంచలనం సృష్టించాడు. ఎలాగైనా అంటార్కిటికా లో మంచు భారం విపరీతంగా పెరగకుండా, అణుబాంబులని ప్రయోగించి అక్కడి మంచుని చెదరగొట్టాలని అందరినీ బెదరగొట్టాడు. అతడి రచనల వల్ల ఈ ధృవభ్రంశం అన్న భావనకి కొంత ప్రచారం లభించినా, అతడి సూచనలని అమలు జరిపే ప్రయత్నాలేవీ జరగలేదు.
హ్యూ బ్రౌన్ తరువాత మరి కొందరు శాస్త్రవేత్తలు ఆ దిశలో ఆలోచించడం మొదలెట్టారు. గతంలో ధృవ భ్రంశం జరిగింది అన్న విషయంలో చాలా మంది ఏకీభవిస్తున్నా, దాన్ని కలుగజేసిన భౌతిక కారణాల విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా హ్యూ బ్రౌన్ అంచనాలలో ఎన్నో దోషాలు ఉన్నాయని, ధృవాలు తారుమారు అయ్యేటంత మేరకు అంటార్కిటికాలో మంచు పేరుకోవడం అసంభవం అని కొందరు వాదించారు. పైగా అది ధరాతాపనం (global warming) గురించి పెద్దగా అవగాహన లేని రోజులు. ధరాతాపనం వల్ల ధృవాల వద్ద హిమం కరుగుతోందే గాని పెరగడం లేదు. కనుక ధృవాలు బరువెక్కి హ్యూ బ్రౌన్ చెప్పిన తీరులో ప్రమాదం కలగకపోయినా, ధృవాలు కరిగి సముద్ర మట్టం పెరిగి, తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలు మాత్రం లేకపోలేదు.
అయితే హ్యూ బ్రౌన్ చెప్పే భౌతిక విధానాలు కాకుండా ధృవ భ్రంశం జరగడానికి మరో అవకాశం కూడా ఉందన్న వారు ఉన్నారు. ఈ మరో రకం ధృవ చలనాన్ని ‘నిజమైన ధృవ సంచారం’ (true pole wander) అంటారు. ఇందులో భూమి అక్షం మారదు. భూమిలో ఘన రూపంలో ఉన్న పైపొరలు (క్రస్ట్ మరియు మాంటిల్), ద్రవ రూపంలో అడుగున ఉన్న ఇనుప ‘కోర్’ మీదుగా జారుతాయి. అలాంటి పరిణామం వల్ల భూమి రూపురేఖలే మారిపోతాయి.
విషయాన్ని ఎటూ తేల్చకుండా శాస్త్రవేత్తల శశభిషలు ఈ విధంగా ఒక పక్క కొనసాగుతుంటే, మరో పక్క సామాన్యుల మనసులో కొంత కలవరం బయల్దేరిందనే చెప్పాలి. మరో పక్క ‘2012’ లాంటి సినిమాలు ఈ ఆందోళనకి ఆజ్యం పోస్తున్నాయి. అసలు ఈ ధృవ భ్రంశం అంటూ జరిగితే ఎంత కాలంలో జరుగుతుంది అన్న ప్రశ్న ఈ విషయం గురించి ఆలోచించే వారందరినీ ఇబ్బంది పెడుతోంది. అతి వేగంగా కొద్ది రోజుల్లో జరిగిపోతుందా, లేక వేల లక్షల ఏళ్లు పడుతుందా? అమెరికన్ “సైకిక్” ఎడ్గర్ సెయిస్ లా కేవలం “ధ్యాన పద్ధతి” లో భవిష్యత్తుని చూసిన వాళ్లుగాని, లేక సాంప్రదాయబద్ధమైన శాస్త్రవేత్తలు కాని వాళ్లు గాని, ఈ పరిణామం చాలా వేగంగా, ఉపద్రవాత్మకంగా జరగొచ్చు అంటూ జనాన్ని కొంచెం బెదరగొట్టినా, ఆధునికులైన శాస్త్రవేత్తలు ఎవరూ అలాంటి ఉపద్రవాత్మక పరిణామాలని ఊహించడం లేదు. ఉదాహరణకి ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆడమ్ మలూఫ్ అనే భౌగోళిక శాస్త్రవేత్త “గతంలో ధృవాల స్థానాలు మారినా ఈ పరిణామాలు ఓ మనిషి జీవిత కాలంలో జరిగేవి కావు. కొన్ని లక్షల సంవత్సరాల పాటు క్రమంగా జరిగే మార్పులివి” అంటాడు. హమ్మయ్య, బతికించాడు!
0 comments