http://www.andhrabhoomi.net/more/sisindri
ఆ విధంగా యాభై ఆరేళ్ల వయసులో కొలంబస్ తన నాలుగవ యాత్ర మీద బయలుదేరాడు. ఈ సారి ఎలాగైనా ఇండియా, చైనాలని కనుక్కోవాలన్న ధృఢ సంకల్పంతో బయల్దేరాడు. హైటీ కి మాత్రం వెళ్ళరాదని రాజు, రాణి పెట్టిన షరతుకి ఒప్పుకున్నాడే గాని కొలంబస్ కి ఆ షరతుకి కట్టుబడే ఉద్దేశం లేదు.
మళ్లీ హైటీకి వెళ్లి తనని హింసించిన వారి మీద ప్రతీకారం తీసుకోవాలని తన మనసు ఉవ్విళ్లూరుతోంది. కనుక నేరుగా తన ఓడలని హైటీ దిశగా పోనిచ్చాడు. తీరానికి కొంత దూరంలో లంగరు వేసి ఆ ప్రాంతపు గవర్నరు అయిన ఓవాండో కి కబురు పెట్టాడు. తన ఓడలకి కొంచెం మరమ్మత్తు అవసరం ఉందని, కనుక రేవులోకి ప్రవేశించాలని, అలాగే ఓ సారి తనకి గవర్నరు దర్శనం చేసుకోవాలని కూడా ఉందని ఆ ఉత్తరంలో రాశాడు. కాని దురదృష్టవశాత్తు ఆ సమయంలో రేవులో పరిస్థితులు కొలంబస్ రాకకి అనుకూలంగా లేవు.
అదే సమయంలో హైటీ నుండి ఇరవై ఆరు ఓడలు స్పెయిన్ కి బయల్దేరనున్నాయి. ఆ ఓడలలో కొలంబస్ అంటే గిట్టని వాళ్లు – బోబడియా, రోల్దాన్ – మొదలైన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. కొలంబస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ నావికులు కూడా ఉన్నారు. పెద్ద మొత్తంలో బంగారం కూడా ఆ ఓడలలో స్పెయిన్ కి తరలించబడనుంది. అలాంటి పరిస్థితుల్లో కొలంబస్ రేవులోకి ప్రవేశించి వీళ్లందరికీ ఎదురుపడితే ఏం జరుగుతుందో తెలిసిన ఓవాండో కొలంబస్ రేవులో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు.
గవర్నర్ తిరస్కారానికి కొలంబస్ చిన్నబుచ్చుకున్నాడు. తను నిర్మించిన నగరంలోకి తననే పవేశించనివ్వక పోవడమా? కనుక ఈ సారి మళ్లీ గవర్నర్ కి కబురు పెట్టాడు. సముద్రం మీద పెద్ద తుఫాను ముంచుకొస్తోందని, త్వరగా రేవులోకి ప్రవేశించి లంగరు వెయ్యకపోతే తన ఓడలకి ప్రమాదమని వివరిస్తూ రాశాడు. కొలంబస్ మాటలు వట్టి బుకాయింపులా అనిపించాయి ఓవాండో కి. రేవులోకి ప్రవేశాన్ని తిరస్కరిస్తూ మళ్లీ కబురు పెట్టాడు.
ఈ సారి కొలంబస్ కి మనసులో ఆందోళన పెరిగింది. ఎందుకంటే స్పెయిన్ కి బయలుదేరుతున్న ఓడలలో ఒక ఓడ నిండా తనకి చెందవలసిన బంగారం ఉంది. ఓడలు బయలుదేరితే తన వంతు బంగారం కూడా నీటి పాలు అవుతుంది. కనుక కనీసం తుఫాను నిలిచిపోయిన తరువాతే ఓడలని బయలుదేరనివ్వమని అర్థిస్తూ మరో సారి కబురు పెట్టాడు.
గవర్నరు కొలంబస్ మాటలు పట్టించుకోలేదు. నావికులకి కూడా కొలంబస్ మాటల మీద గురి లేదు. కనుచూపు మేరలో ఆకాశం అంతా నిర్మలంగానే ఉంది. కొలంబస్ ఎప్పట్లాగే ఏవో మాయమాటలు చెప్తున్నాడు అనుకున్నారు. కాని ఎన్నో ఏళ్ల అనుభవం మీద కొలంబస్ వాతావరణంలో సూక్ష్మమైన మార్పుల బట్టి కూడా తుఫాను రాకని కనిపెట్టగలిగే కౌశలాన్ని అలవరచుకున్నాడు.
కొలంబస్ హెచ్చరికని పట్టించుకోకుండా ఇరవై ఆరు ఓడలూ సాంటా డామింగో రేవుని వదిలి స్పెయిన్ దిశగా బయల్దేరాయి. హైటీ దీవి కొస వరకు ప్రయాణించాయో లేదో ఓ పెద్ద తుఫాను విరుచుకుపడింది. మహోగ్రమైన కెరటాల తాకిడికి ఓడలు ముక్కలు చెక్కలై నీట మునిగాయి. ఒక్క ఓడ మాత్రం సురక్షితంగా బయటపడింది. అది కొలంబస్ వంతు బంగారం ఉన్న ఓడ! అ వార్త వేగంగా వ్యాపించింది. తనకి రేవులోకి రానివ్వలేదన్న కోపంతో కొలంబస్సే ఆ తుఫాను సృష్టించాడని, అడ్మిరల్ సామాన్యుడు కాడని, పెద్ద మాయావిని అని కథలు కథలుగా నావికులు చెప్పుకున్నారు!
కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారని నిట్టూర్చి కొలంబస్ మళ్లీ తన యాత్రలు కొనసాగించాడు. హైటీ దీవిని దాటి ఆ ప్రాంతాలన్నీ మళ్లీ పర్యటించడం మొదలెట్టాడు. ఈ సారి చుట్టు పక్కల దీవులని దాటి ఇంకా ముందుకి వెళ్ళగా ఓ విశాలమైన తీరం ఎదురయ్యింది. నిజానికి అది ఆధునిక హోండురాస్ దేశం. ఇది ఉత్తర, దక్షిణ అమెరికాలు కలిసే మధ్య అమెరికా ప్రాంతంలో ఉంది. అంటే ఈ సారి మొట్టమొదటి సారిగా అమెరికా ఖండం మీద అడుగుపెట్టాడు అన్నమాట.
ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత విరివిగా ముత్యాలు, బంగారం మొదలైనవి దొరుకుతాయని తెలిసి సంతోషించాడు కొలంబస్. ఇంకా ముందుకి వెళ్లి ఇండియాని కనుక్కున్నాక, అక్కడ మరింత బంగారాన్ని ఓడలకెత్తించి,వెనక్కు వచ్చే దారిలో ఈ ముత్యాలన్నీ మూటగట్టుకోవచ్చని ఊహించాడు కొలంబస్. కాని ఇండియా ఇంకా ఎంత దూరం ఉంది? అక్కడికి ఎలా వెళ్లాలి?
హోండూరాస్ తీరం వెంట కాస్త దక్షిణంగా పోతే ఓ జలసంధి వస్తుందని, దాని లోకి ప్రవేశించి అవతలికి పోతే ఓ పెద్ద సముద్రం వస్తుందని స్థానికుల నుండి విన్నాడు. నిజానికి అది పనామా జలసంధి. దానికి అవతల ఉన్నదే పసిఫిక్ మహాసముద్రం. కాని కొలంబస్ వేరేలా ఊహించాడు. ఆ జలసంధిని దాటితే వచ్చేది బంగాళా ఖాతం అనుకున్నాడు! మరి కాస్త ముందుకి పోతే వచ్చేదే ఇండియా!
కొలంబస్ జీవితంలోనే ఓ అత్యంత విచిత్రమైన వాస్తవం అతడిలో చివరికంటా తొలగిపోని ఈ భ్రమ. చివరివరకు తను కనుక్కునది ఆసియా సమీప ప్రాంతాలనే భ్రమలోనే ఉన్నాడు గాని, అది ఆసియా నుండి ఎంతో దూరంలో ఉన్న ఓ మహాఖండం అని అర్థం చేసుకోలేకపోయాడు.
అదృష్ట వశాత్తు కొలంబస్ కి ఆ జలసంధి దొరకలేదు. నిజంగానే తన బుల్లి పడవల మీద పసిఫిక్ మహాసముద్రం మీదకి ధ్వజం ఎత్తితే నీట మునగడం ఖాయం!
ఇంతలో ఎడతెగని ఈ పర్యటనలతో అతడి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఓడలో నావికులలో కూడా క్రమంగా నిరసన పెరగసాగింది. 1504 లో నవంబర్ ఏడవ తారీఖున కొలంబస్ కొన్ని ఓడలతో పాటు స్పెయిన్ ని చేరుకున్నాడు.
అప్పటికే కొలంబస్ ఆరోగ్యం బాగా క్షీణించింది. మానసికంగా గతంలో తను అనుభవించిన క్షోభ ఇప్పుడు తన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తోంది. మతి చలించినట్టుగా అయిపోయడు. రాచదంపతుల దర్శనం కోసం వెళ్ళడానికి కూడా ఓపిక లేదు. ఇంతలో రాణి మరణించిందన్న వార్త తెలిసి చాలా బాధపడ్డాడు. ఎన్నో సార్లు కష్టకాలంలో తనని ఆదుకుంది. ఇప్పుడామె లేకపోవడం తన జీవితంలో ఓ శూన్యం ఏర్పడ్డట్టు అయ్యింది.
రాచదంపతులు తనకి ఇస్తానన్న వరదానాలని గుర్తు చేస్తూ రాజు ఫెర్డినాండ్ కి జాబు రాశాడు. టక్కరి వాడైన రాజు వీల్లేదు పొమ్మన్నాడు. ఎన్ని సార్లు అర్జీ పెట్టుకున్నా ఫలితం శూన్యమే అయ్యింది. ఒకసారి ఓపిక చేసుకుని వెళ్ళి రాజు దర్శనం చేసుకున్నాడు. రాజు తీయగా మాట్లాడి పంపేశాడు గాని ముందు ఇచ్చిన మాట మీద నిలవలేదు.
అసలే ఆరోగ్యం సరిగ్గా లేని కొలంబస్ ఈ దెబ్బకి బాగా కృంగిపోయాడు. పెద్ద కొడుకు డీగో రాజసభలో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. రాజు ఇస్తానన్న వన్నీ ఇచ్చి వుంటే తన తరువాత తన పిల్లలు ఏ లోటూ లేకుండా హాయిగా బతికేవారు. కాని ఇప్పుడు వాళ్లేమవుతారు? ఈ బెంగ తనని లోలోన దొలిచేయసాగింది.
ఇక అలాంటి నిస్సహాయ స్థితిలో దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు. తన ప్రార్థనలకి దైవం స్పందించాడు. త్వరలోనే తన కష్టాల నుండి విముక్తి లభించింది. 1506 మే ఇరవై అయిదవ తేదీ నాడు కొలంబస్ తన ఇంట్లోనే చివరి శ్వాస వదిలాడు.
స్వదేశానికి ఎనలేని సేవ చేసి, రాజ్యం విపరీతంగా విస్తరించేలా చేసిన వాడు అతి సామాన్యుడిలా మరణించాడు. ఒకప్పుడు స్పెయిన్ ప్రజలంతే బ్రహ్మరథం పట్టిన వీరుడి చుట్టూ చివరి ఘడియల్లో కొందరు చిరకాల నేస్తాలు తప్ప ఎవరూ లేరు.
కొలంబస్ యాత్రల వల్ల తను భ్రమ పడినట్టుగా ఇండియా, చైనాలకి కొత్త దార్లు దొరకలేదు. భూమి గుండ్రంగా ఉందని కూడా రూఢిగా తెలియలేదు. కాని ఆ యాత్రల వల్లనే రెండు విశాలమైన కొత్త ఖండాలు కనుక్కోబడ్డాయి. వాటి వెనుక ఉన్న ఓ మహాసముద్రం గురించి కూడా చూచాయగా తెలిసింది. ఒక గొప్ప ఆవిష్కరణ వెనుక ఎంత సాహసం, ఎంత ప్రతిభ, ఎంత ప్రమాదం, ఎంత క్షోభ ఉన్నాయో కొలంబస్ కథ వల్ల మనకి తెలుస్తుంది.
(కొలంబస్ కథ సమాప్తం)
Reference:
The True Story of Christopher Columbus, Called the Great Admiral
by Elbridge Streeter Brooks (1846-1902).
Excellent. I have been following the story. Thank you for ur efforts in translating this feature.
Thank you Sujata garu.
avunanDi, chaalaa chakkagaa anuvadinchaaru! ilaanTivi marinni andinchagalaru..
Thank you Dileep garu. Vacche vaaram numdi kotta serial. Vasco da Gama gurinchi!