అధ్యాయం 15
ఎట్టకేలకు స్నెఫెల్ పర్వతం
ఐదువేల అడుగుల ఎత్తున్న పర్వతం స్నెఫెల్. దీనికి రెండు శిఖరాగ్రాలు ఉన్నాయి. ఈ ద్వీపం మీద స్ఫుటంగా కనిపించే ట్రాకైటిక్ పర్వతశ్రేణికి ఒక కొసలో ఉందీ పర్వతం. మేం ఉన్న చోటి నుండీ చూస్తే ధూసరవర్ణపు ఆకాశపు నేపథ్యంలో ఈ పర్వతపు రెండు తలలు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ శిరస్సులకి ఎవరో హిమాభిషేకం చేసినట్టు పక్కల నుండి తెల్లని మంచు జాలువారుతోంది.
ఐదువేల అడుగుల ఎత్తున్న పర్వతం స్నెఫెల్. దీనికి రెండు శిఖరాగ్రాలు ఉన్నాయి. ఈ ద్వీపం మీద స్ఫుటంగా కనిపించే ట్రాకైటిక్ పర్వతశ్రేణికి ఒక కొసలో ఉందీ పర్వతం. మేం ఉన్న చోటి నుండీ చూస్తే ధూసరవర్ణపు ఆకాశపు నేపథ్యంలో ఈ పర్వతపు రెండు తలలు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ శిరస్సులకి ఎవరో హిమాభిషేకం చేసినట్టు పక్కల నుండి తెల్లని మంచు జాలువారుతోంది.
ఇక ఇక్కడి నుండి దారి ఇరుకుదారి. అందరం ఓ వరుసలో ముందుకి సాగాం. మా బృందానికి హన్స్ ముందుండి దారి చూపిస్తున్నాడు. పక్క పక్కగా నడిచే వీలు లేకపోవడం వల్ల మాట్లాడుకునే అవకాశం లేకపోయింది. స్టాపీ ఫోర్డ్ కి పక్కగా వుండే బేసాల్టిక్ ప్రాకారాన్ని దాటాక ఓ కర్దమ నేల (*) పక్క నుండి వెళ్లాం. ఆ ద్వీపకల్పానికి చెందిన ప్రాచీన వృక్షజాతులతో ఏర్పడ్డ బొగ్గు సరస్సు అది. ఈ బొగ్గు సరస్సుని ఇంధనంగా వాడుకుంటే మొత్తం ఐర్లాండ్ అంతటికీ ఓ శతాబ్దకాలం పాటు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇలాంటి సరస్సులు ఈ ప్రాంతంలో ఎన్నో చోట్ల ఉన్నాయి. కొన్ని చోట్ల వాటి లోతు డెబ్బై అడుగుల దాకా ఉంటుంది. ఆ లోతుల్లో కర్బనీకృత జీవ్యావశేషాల పొరలు, గాజులా గట్టిపడ్డ లావా పొరలు మారిమారి వస్తుంటాయి.
(* నీరు నిలువ ఉన్న చోట వృక్షసంపద కుళ్ళినప్పుడు కర్దమ నేల (bog) ఓ దట్టమైన పొరలా ఏర్పడుతుంది. అవశేషాలు క్రమంగా పేరుకుంటున్న సరస్సులలో గాని, ఆ సరస్సుల అంచుల వద్ద గాని ఇలాంటి నేల ఏర్పడుతుంది. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండడం వల్ల, కాలక్రమేణా అలా చిక్కుకున్న మొక్కలు కుళ్లి ‘పీట్’ అనే దట్టమైన నల్లని, చిక్కని పొరగా ఏర్పడుతాయి. ఆ ప్రాంతంలో పుట్టిన కొత్త మొక్కలు కూడా అదే పొరలో చివరికి సమసి ఆ పొరని ఇంకా పోషిస్తాయి. ఈ పీట్ పొర చిక్కని ద్రవరూపంలో ఉన్న బొగ్గు లాంటిది. ఐర్లాండ్, స్కాట్ లాండ్ మొదలైన ప్రాంతాల్లో ఈ ముద్దని కోసుకుని ఇంధనంగా వాడుతారు. మరిన్ని వివరాల కోసం –
http://www.ehow.com/how-does_4969793_bogs-form.html - అనువాదకుడు)
ఒక పక్క భవిష్యత్తు గురించి గుండెలో గుబులుగానే ఉన్నా నా చుట్టూ ఓ పురావస్తు నిలయంలో లాగా అందంగా అమరి వున్న సువిస్తార ఖనిజసంపదని చూసి అబ్బురపడకుండా ఉండలేకపోయాను. (ఎంతైనా మామకి తగ్గ అల్లుణ్ణి అనిపించుకోవాలిగా మరి!) వాటిని చూస్తుంటే ఐస్లాండ్ యొక్క భౌగోళిక స్వరూపం క్రమంగా స్పష్టం కాసాగింది.
ఈ విచిత్రమైన దీవి సముద్రపు లోతుల్లో నుండి పైకి పొడుచుకొచ్చి ఎంతో కాలం కాలేదు. ఇప్పటికీ అది ఇంకా పైకి లేస్తూ ఉండొచ్చు. ఇదంతా భూగర్భంలోంచి దీవిని పైకి తోస్తున అగ్నుల ప్రభావమే ననిపిస్తుంది. అదే నిజమైనతే సర్ హంప్రీ డేవీ ఆలోచనలు, సాక్నుస్సెం రహస్య సందేశాలు, మా మావయ్య విడ్డూరపు సిద్ధాంతాలు అన్నీ ఇట్టే మట్టిగలుస్తాయి. ఈ ఆలోచనతో అక్కడి భూమి ఉపరితలాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలించడం మొదలెట్టాను. ఈ దీవి పుట్టుకకి కారణమైన శక్తుల తీరుతెన్నుల గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాను.
(ఇంకా వుంది)
0 comments