ఇందులో బాయిల్ తానొక “సందేహాత్ముడి” నని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ రంగంలో ప్రాచీనుల భావాలనిక గుడ్డగా నమ్మనని చాటుకున్నాడు. మూల సూత్రాల నుండి కేవలం తర్కాన్ని ఉపయోగించి నిర్మించిన సిద్ధాంతాలని ఇక ఒప్పుకోనన్నాడు. అలా కాకుండా, వాస్తవికతా దృష్టితో చూస్తూ, ఆచరణ యుక్తంగా మూలకాలని నిర్వచించాలని బయలుదేరాడు. ఏ ఆదిమ పదార్థాల నుండి అయితే విశ్వం ఆవిర్భవించిందో అవే మూలకాలు అన్న భావన థేల్స్ నాటి నుండి ఉంది. ఒక పదార్థం మూలకం అని అనుకున్నప్పుడు, అది నిజంగా ప్రాథమిక, మౌలిక పదార్థమో కాదో పరీక్షించి తేల్చుకోవాలి. ఆ పదార్థాన్ని మరింత సరళమైన, మౌలికమైన అంశాలుగా విడగొట్టడం సాధ్యమైతే అదిక మూలకం కాజాలదు. ఏ సరళ అంశాలుగా అయితే ఆ పదార్థం విడగొట్టబడుతుందో వాటినే మూలకాలు అనుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా భవిష్యత్తులో వాటిని కూడా విడగొట్టడానికి సాధ్యం అయితే వాటిని కూడా మూలకాలు అన్న స్థాయి నుండి తొలగించాల్సి ఉంటుంది. ఆ విధంగా మూలకం అన్న పదాన్ని కేవలం తార్కికంగా కాక, ఆచరణయుక్తంగా నిర్వచించాడు బాయిల్.
అంతే కాకుండా రెండు మూలకాలు గాఢంగా కలిసిపోయినప్పుడు ఓ కొత్త పదార్థం పుట్టొచ్చు. దాన్నే సంయోగం (compound) అంటారు. ఈ సంయోగాన్ని భేదిస్తే అందులో అంశాలుగా ఉన్న మూలకాలు బయట పడతాయి.
కనుక ఈ విధమైన నిర్వచనంలో మూలకం అన్న పదానికి కేవలం ఆచరణాత్మకమైన అర్థం మాత్రమే ఉంది. ఉదాహరణకి ఇలాంటి నిర్వచనం ప్రకారం క్వార్జ్ (quartz) లాంటి పదార్థాన్నే తీసుకుంటే, ప్రయోగాత్మక రసాయనికులు దాన్ని భేదించగలిగినంత వరకు దాన్నొక మూలకం గానే పరిగణించాలి. మూలకాన్ని గురించి ఇలాంటి ఆచరణాత్మక, తాత్కాలీన (provisional) నిర్వచనంతో వచ్చిన చిక్కేంటంటే, ఈ పద్ధతిలో ఏ పదార్థాన్నయినా కేవలం తార్కికంగా మాత్రమే మూలకం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నేడు అబేధ్యం అనుకున్న పదార్థాన్ని కూడా సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక మరింత సరళమైన అంశాలుగా భేదించడానికి వీలవుతుందేమో. అప్పుడిక అంతవరకు మూలకం అనుకున్నది కాస్తా మూలకం కాకుండా పోతుంది.
ఇరవయ్యవ శతాబ్దపు ఆరంభం వరకు, అంటే మూలకాలని మరింత నిర్దుష్టంగా నిర్వచించడానికి వీలైనంత వరకు, ఇలాంటి తాత్కాలీన నిర్వచనమే చలామణి అయ్యింది.
ప్రయోగాత్మక పద్ధతిలో మూలకాలని నిర్వచించాలని, కనుక్కోవాలని అన్నాడే గాని బాయిల్ కి కూడా అసలు మూలకాలు ఏమిటో, ఎలా ఉంటాయో ససేమిరా తెలీదు. తీరా ప్రయోగాత్మక పద్ధతితో పరీక్షించినా వెనుకటికి ప్రాచీన గ్రీకులు చెప్పిన పదార్థాలే (మట్టి, నీరు, గాలి, నిప్పు) మూలకాలని మళ్లీ తేలవచ్చు. ఈ విషయంలో బాయిల్ కి కచ్చితమైన అవగాహన ఏమీ ఉన్నట్టు లేదు.
ఎందుకంటే లోహాల విషయంలో ఇతడు కూడా ప్రాచీన రసవాదులు చెప్పిందే నమ్మాడు. లోహాలు మూలకాలు కాదని, అందుకే ఒక లోహాన్ని మరో లోహంగా మార్చడానికి వీలవుతుందని ఇతడు కూడా నమ్మాడు. అందుకే రసవాద పద్ధతితో బంగారాన్ని తయారు చేసే పద్ధతిని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం జారీ చేసిన చట్టాన్ని రద్దు చెయ్యమంటూ బాయిల్ ప్రభుత్వానికి 1689 లో అర్జీ పెట్టుకున్నాడు. అలాంటి నిషేధం లేకపోతే నిమ్న జాతి లోహాలని బంగారంగా మార్చవచ్చని, ఆ విధంగా రసాయనికులు అణువాదాన్ని నిరూపించగలరని అతడి నమ్మకం.
(సశేషం...)
0 comments