బెచర్ బోధించిన అయోమయపు భావనలని జార్జ్ ఎర్నెస్ట్ స్టాల్ (1660-1734) అనే మరో జర్మన్ వైద్యుడు అనుసరించాడు. ఉన్నవి సరిపోనట్టు జ్వలన లక్షణాన్ని వర్ణించడానికి ఇతడు మరో కొత్త పదాన్ని సూత్రీకరించాడు. అదే “ఫ్లాగిస్టాన్”. “నిప్పు పెట్టడం” అనే అర్థం గల గ్రీకు పదం నుండి ఈ పదం వచ్చింది. ఈ ఫ్లాగిస్టాన్ ని ఉపయోగించి జ్వలన క్రియని వర్ణించడానికి ఇతడు ఓ పద్ధతి ఆలోచించాడు.
స్టాల్ భావన ప్రకారం జ్వలనీయమైన వస్తువుల్లో ఈ ఫ్లాగిస్టాన్ పుష్కలంగా ఉంటుంది. వస్తువు మండాక మిగిలిన పదార్థంలో ఇక ఫ్లాగిస్టాన్ ఉండదు. అందుకే అది ఇక మండదు. అందుకే కట్టెలో ఫ్లాగిస్టాన్ ఉంటుంది గాని, బూడిదలో ఉండదు.
అలాగే లోహాలు తుప్పు పట్టే ప్రక్రియకి, కట్టె మండే ప్రక్రియకి మధ్య పోలిక ఉందని ఊహించాడు స్టాల్. లోహంలో ఫ్లాగిస్టాన్ ఉన్నా దాని తుప్పులో ఫ్లాగిస్టాన్ లేదంటాడు. ఈ భావనని ఆధారంగా చేసుకుని, నాగరిక మానవుడు సాధించిన మొట్టమొదటి మహత్తర రసాయనిక ఆవిష్కరణ అయిన, ముడి లోహం నుండి శుద్ధ లోహాన్ని వెలికి తిసే ప్రక్రియకి ఓ వివరణని ఇవ్వడానికి సాధ్యం అయ్యింది. ఆ వివరణ తీరు ఇలా ఉంటుంది. ఫ్లాగిస్టాన్ పాలు చాలా తక్కువగా ఉన్న ముడి లోహాన్ని, ఫ్లాగిస్టాన్ నిండుగా ఉన్న బొగ్గుతో కాల్చుతారు. అప్పుడు ఫ్లాగిస్టాన్ బొగ్గు నుండి ముడి లోహం లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల ఫ్లాగిస్టాన్ నిండుగా ఉన్న బొగ్గు బూడిదగా మరుతుంది. ఫ్లాగిస్టాన్ లేని ముడి లోహం, ఫ్లాగిస్టాన్ సమృద్ధిగా ఉండే శుద్ధ లోహంగా మారుతుంది.
గాలికి కూడా జ్వలన క్రియలో ఓ పాత్ర ఉందని భావించాడు స్టాల్. కట్టె నుండి లోహానికి, అక్కడి నుండి మరో చోటికి, ఇలా ఫ్లాగిస్టాన్ ని ఒక చోటి నుండి మరో చోటకి చేర్చే వాహకమే గాలి అంటాడు.
స్టాల్ బోధించిన ఈ ఫ్లాగిస్టాన్ సిద్ధాంతానికి త్వరలోనే వ్యతిరేకత మొదలయ్యింది. అలా వ్యతిరేకించిన వారిలో ప్రథముడు హెర్మాన్ బోర్హావే (1668-1738) అనే డచ్ వైద్యుడు. సామాన్య జ్వలనం, తుప్పు పట్టడం – ఈ రెండు ప్రక్రియలు ఒకే దృగ్విషయం యొక్క రెండు ముఖాలు అయ్యే అవకాశం లేదని ఇతడి వాదన.
(సశేషం...)
0 comments