ద్రవాల నుండి పుట్టిన ఆవిరులని అధ్యయం చేసినవారిలో మొదటివాడు ఫాన్ హెల్మాంట్. భౌతిక, దృశ్య లక్షణాలలో అవి గాలిలాగానే ఉన్నా, కొన్ని లక్షణాలు వేరేగా ఉన్నాయని అతడు గమనించాడు. ఉదాహరణకి మండే కట్టె నుండి పుట్టే ఆవిరులు గాలిలాగే కనిపించినా వాటి ప్రవర్తన గాలి కన్నా భిన్నంగా ఉందని గుర్తించాడు.
కచ్చితమైన ఘనపరిమాణం, ఆకారం లేని ఈ గాలి లాంటి పదార్థాలు గ్రీకులు “chaos” అని పిలిచే ఓ ప్రత్యేక పదార్థాన్ని పోలి ఉన్నాయని ఊహించాడు. గ్రీకుల చింతనలో ఈ chaos అంటే విశ్వార్భావానికి మూలమైన ఓ రూపంలేని, రచనలేని ఆదిమ పదార్థం. ఫాన్ హెల్మాంట్ ఈ వాయువులని chaos అని పిలిచాడు. అయితే ఫ్లెమిష్ ఉచ్ఛారణలో అది కాస్తా gas గా మారిపోయింది. ఈ gas అన్న పదంతోనే ఇప్పటికీ మనం గాలి లాంటి పదార్థాలని వ్యవహరిస్తున్నాం.
ఫాన్ హెల్మాంట్ కాలే కట్టె నుండి ఓ వాయువుని వెలికి తీసి దాన్ని అత్యంత శ్రద్ధతో అధ్యయనం చేశాడు. ఆ వాయువుకి “gas sylvestre” (కట్టె నుండి తీసిన వాయువు) అని పేరు పెట్టాడు. ఆ వాయువునే మనం ప్రస్తుతం కార్బన్ డయాక్సయిడ్ అంటున్నాం.
ఈ వాయువుల అధ్యయనం లోనే మొట్టమొదటిసారిగా రసాయన శాస్త్రంలో కచ్చితమైన సంఖ్యాత్మక పద్ధతుల వినియోగం మొదలయ్యింది. ఆ అధ్యయనమే ఆధునిక రసాయన శాస్త్రానికి రాచబాట అయ్యాయి.
0 comments