కాని అలా అనుకోవడంలో బాయిల్ నిజంగా పొరబడ్డాడు. ఎందుకంటే లోహాలు మూలకాలని అప్పుడు తెలీదు. నిజానికి ప్రస్తుతం మూలకాలుగా గుర్తించబడే తొమ్మిది పదార్థాలు ప్రాచీన లోకంలో సుపరిచితమైన పదార్థాలు. వాటిలో ఏడు లోహాలు (బంగారం, వెండి, రాగి, ఇనుము, తగరం, సీసం పాదరసం), రెండు అలోహాలు (non-metals) (కార్బన్, సల్ఫర్) ఉన్నాయి. ఇవి కాకుండా మధ్యయుగపు రసవాదులకి మరి నాలుగు పదార్థాలతో కాస్తోకూస్తో పరిచయం ఏర్పడింది (అవి ఆర్సెనిక్, ఆంటిమొనీ, బిస్మత్, జింక్).
అసలు బాయిల్ విషయంలోనే ఓ కొత్త మూలకాన్ని కనుక్కునే సువర్ణావకాశం వెంట్రుకవాసిలో తప్పిపోయింది. 1680 లో అతడు మూత్రం నుండి ఫాస్ఫరస్ ని వెలికి తీసే పద్ధతిని కనుక్కున్నాడు. అందుకు ఐదో, పదో ఏళ్ల క్రితం అదే మహత్కార్యాన్ని (!) హెన్నిగ్ బ్రాండ్ (-1692) అనే మరో జర్మన్ రసాయనికుడు చేశాడు. ఈ బ్రాండ్ ని కొన్ని సార్లు “చిట్టచివరి రసాయనికుడు”గా చెప్పుకుంటారు. అతడా ఆవిష్కరిణని యాదృచ్ఛికంగా చేశాడు. (మరెక్కడా దొరకనట్టు) మూత్రంలోనే పరుసవేది (philosopher’s stone) దొరుకుతుందని ఎందుకో అతడికో నమ్మకం. ఏదైతేనేం, ఆధునిక వైజ్ఞానిక యుగానికి ముందు, ప్రాచీన లోకంలో తెలీని ఓ కొత్త మూలకాన్ని కనుక్కున్న వాడిగా బ్రాండ్ చరిత్రకెక్కాడు.
ఫ్లాగిస్టాన్
పంపుతో గాలిని తొలగించి శూన్యాన్ని తయారు చెయ్యొచ్చన్న విషయం, వాయుపీడనంతో గొప్ప పనులు సాధించొచ్చన్న విషయం, మొదలైన పదిహేడవ శతాబ్దానికి చెందిన మహద్విజయాలకి గొప్ప పర్యవసానాలు ఉన్నట్టు తెలుస్తోంది. అసలు పంపు అవసరం లేకుండానే శూన్యం తయారుచెయ్యొచ్చని మరి కొందరు నెమ్మదిగా తెలుసుకున్నారు.
ఉదాహరణకి నీటిని మరిగించి ఆ ఆవిరిని ఓ పాత్రలో నింపాం అనుకుందాం. తరువాత ఆ పాత్ర మీదుగా చల్ల నీరు ప్రవహింపజేసి పాత్రని చల్లబరిచాం అనుకుందాం. పాత్రలోని ఆవిరంతా కొద్దిపాటి నీటి బిందువులుగా ఘనీభవిస్తుంది. దాని స్థానే శూన్యం ఏర్పడుతుంది. ఆ పాత్ర యొక్క గోడలలో ఒక గోడ కదిలేదిగా ఏర్పాటు చేసుకుంటే, బయట ఉండే వాయు పీడనం వల్ల ఆ గోడ లోపలికి కదులుతుంది.
మళ్లీ పాత్రలో ఆవిరి ప్రవేశపెట్టి అలా లోపలికి వచ్చిన గోడని తిరిగి బయటికి తొయ్యొచ్చు. మళ్లీ ఆవిరి ఘనీభవించేలా చేసి గోడ లోపలికి వచ్చేలా చెయ్యొచ్చు. అలా లోపలికి బయటికి కదిలే గోడని ఓ పిస్టన్ లా ఊహించుకుంటే, ఆ ఏర్పాటుతో ఓ పంపుని నడిపించొచ్చు. ఆ ఏర్పాటే మొట్టమొదటి ఆవిరి యంత్రానికి దారి తీసింది.
(సశేషం...)
0 comments