శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఒక్క బొట్టయినా లేదు

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, October 3, 2012
అధ్యాయం 22


ఒక్క బొట్టయినా లేదు

ఈ సారి మా అవరోహణ రెండవ సొరంగంలో మొదలయ్యింది. ఎప్పట్లాగే హన్స్ మా ముందు నడిచాడు.

ఓ నూరు గజాలు నడిచామో లేదో ప్రొఫెసర్ తన చేతులోని లాంతరుని గోడల దగ్గరగా పట్టుకుని చూసి, “అబ్బ! ఇవి ఆదిమ శిలలు. అంటే ఇదే సరైన మార్గం. పదండి ముందుకు” అని అరిచాడు.

ప్రాథమిక దశలలో భూమి నెమ్మదిగా చల్లబడసాగింది. అలా కుంచించుకుపోతున్న భూమి పైపొరలో పగుళ్ళు, బీటలు, చీలికలు, అగాధాలు ఏర్పడ్డాయి. మేం నడుస్తున్న బాట అలాంటి ఓ చీలికే. అయితే ఒక దశలో కరిగిన గ్రానైట్ శిల ఈ చీలికలో ప్రవహించింది. ఘనీభవించిన ఆ పురాతన శిలాప్రవాహం వల్ల ఆ ఆదిమ పాషాణ రాశిలో మెలికలు తిరిగిన గజిబిజి బాటలు ఏర్పడ్డాయి.

మేం వేగంగా కిందికి దిగుతూ ఉంటే భూగర్భంలోని ఆదిమ స్తరాల క్రమం స్పష్టంగా కనిపించింది. ఈ ఆదిమ పదార్థమే భూమి లోని ఖనిజాల పొరకి పునాది అని భౌగోళిక శాస్త్రవేత్తలు భావిస్తారు. అందులో మూడు రకాల శిలా విన్యాసాలు ఉన్నాయని తేల్చారు. అవి – షిస్ట్ (schist), నైస్ (gneiss), మైకా షిస్ట్ (mica schist). ఈ మూడూ వీటి అడుగున మారని పునాదిగా ఉన్న గ్రానైట్ పొర మీద కుదురుగా ఉన్నాయి.ప్రకృతిని ఇంత స్పష్టంగా, ప్రత్యక్షంగా పరిశీలించగల అద్భుత అవకాశం భౌగోళిక శాస్త్రవేత్తలకి ఎప్పుడూ కలగదు అనుకుంటాను. జడమైన బోరింగ్ యంత్రం పైకి తీసుకురాలేని సమాచారం అంతా ఇప్పుడు మా కళ్లకి కట్టినట్టు ఉంది. చేయి చాచి తాకగలిగేటంత దగ్గర్లో వుంది.షిస్ట్ శిలా స్తరాలలో ఎక్కువగా ఆకుపచ్చ రంగులో భేదాలే కనిపిస్తున్నాయి. రాగి, మాంగనీస్ ఖనిజాల దారాలు గోడలలో లతలలా పాకుతున్నాయి. అక్కడక్కడ బంగారు, ప్లాటినమ్ ల సూక్ష్మమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మానవ జాతి లోభ దృష్టికి కనిపించకుండా అందరాని ఈ భూగర్భపు చీకటి లోతుల్లో ఇంకా ఎన్ని పెన్నిధులు ఉన్నాయోనని ఆలోచించసాగాను. ఏదో ప్రాచీన యుగానికి చెందిన బృహత్తర కంపనాల వల్ల ఈ అపారమైన లోతుల్లో పూడుకుపోయిన నిధులని గునపాలు, గడ్డపారలు ఏనాటికి భేదించలేవు.

షిస్ట్ స్తరాల తరువాత నైస్ స్తరాలు వచ్చాయి. ఇవి పాక్షికంగానే స్తరీకరణం (stratification) చెందాయి. వాటి పొరలలో కచ్చితమైన సమాంతరీయత (parallelism) కనిపిస్తుంది. ఇక తరువాత వచ్చిన మైకా షిస్ట్ లలో పొరలు ఫలకాలుగా, పళ్లేలుగా ఏర్పడ్డాయి. చదునైన ఆ ఉపరితలాల మీద కాంతి పడి మెరుస్తున్నాయి.

మా ఉపకరణాల నుండి వచ్చే కాంతి క్వార్జ్ స్ఫటికల మీద పడగా ప్రతిబింబించిన కాంతి నానా కోణాలలోను ప్రసరిస్తోంది. ఆ శిలల లోంచి నడుస్తుంటే ఓ పెద్ద వజ్రం గుండా నడుస్తున్నట్టు వుంది. వాటి కోటి ముఖాల మీద పడి తుళ్లి పడి, ఉరకలు వేసే కాంతి రేఖల లాస్యం వల్ల వేల వెలుగుల వేడుకే అక్కడ వెలసింది.


సుమారు ఆరు గంటల కల్లా ఈ లోకోత్తర కాంతుల రంగేళి కాస్త వన్నె తగ్గి, క్రమంగా పూర్తిగా మాయమైపోయింది. స్ఫటికమయమైన గోడలు వెలవెలబోయినట్టు అయ్యాయి. మైకా, క్వార్జ్, ఫెల్డ్ స్పార్ లు సమ్మిళితమై భూమి యొక్క కఠిన పునాదిగా ఏర్పడ్డాయి. ఆ పైనున్న నాలుగు ధరాగత శిలా వ్యవస్థలని చెక్కుచెదరకుండా ఘనంగా మోస్తున్నాయి.

ఆ కఠిన గ్రానైట్ గోడల కారాగారంలో ముగ్గురం బందీలయ్యాము.

(ఇంకా వుంది)

4 comments

 1. the tree Says:
 2. This comment has been removed by the author.  
 3. the tree Says:
 4. భూమి ఒక అయస్కాతం అని చెప్తున్నాం కదా,మరి వికర్షణా ధర్మం ఏ సందర్భంలోను గమనించలేక పోవడానికి కారణం ఏమిటి,దీనిని ఉపయోగించుకొని ఆకాశంలో విహరించచ్చుకదా...
  మా బడి పిల్లల అనుమానం సార్, కొంచం వివరించండి....

   
 5. మీ పిల్లలు చాలా చక్కని ప్రశ్న అడిగారు.
  భూమి అయస్కాతం కనుక దాని వికర్షణని వాడుకుని సిద్ధాంత పరంగా చూస్తే గాలిలో తేలే అవకాశం వుంది అన్నది నిజమే.
  కాని వాస్తవికంగా చూస్తే కొన్ని సమస్యలు ఉన్నాయి.
  - భూమి అయస్కాంత క్షేత్రం చాలా బలహీనమైనది. మాములుగా ఇంట్లో రెఫ్రిజరేటర్ లో ఉండే అయస్కాంతం కన్నా నూరు రెట్లు బలహీనమైనది.
  - రెండవది, అయస్కాంత క్షేత్రం మీద తేలాలంటే అది నిలువు దిశలో ఉండాలి. కాని భూమి అయస్కాంత క్షేత్రం వాలుగా ఉంటుంది, అయస్కాంత ధృవాల వద్ద తప్ప.
  ఈ రెండు కారణాల వల్ల భూమి అయస్కాంత క్షేత్రం మీద చాలా చిన్న బరువులని తప్ప తేల్చడం చాల కష్టం.

   
 6. the tree Says:
 7. ధన్యవాదాలండి.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email