రాత్రి ఎనిమిది అయ్యింది. ఎక్కడా ఒక్క బొట్టు నీరు కూడా లేదు. ఇక బాధ భరించలేకున్నాను. మామయ్య మాత్రం ఏమీ పట్టనట్టు నడుచుకుంటూ పోతున్నాడు. ఆయనకసలు ఆగే ఉద్దేశం ఉన్నట్టు లేదు. ఎక్కడైనా సెలయేటి గలగలలు వినిపిస్తాయేమోనని ఆశ. కాని భరించరాని నిశ్శబ్దం తప్ప చెవికి మరొకటి తెలియడం లేదు.
ఇక ఒంట్లో సత్తువ అంతా హరించుకుపోయింది. మామయ్యని ఇబ్బంది పెట్టకూడదని అంతవరకు ఎలాగోలా ఓర్చుకున్నాను. ఇక అయిపోయింది. ఇవే ఆఖరు ఘడియలు.
“మామయ్యా! ఇక నా వల్ల కాదు. కొంచెం ఆగు!”
గట్టిగా అరిచి కుప్పకూలిపోయాను.
ఆ కేకకి మామయ్య వెనక్కు నడిచి వచ్చాడు. చేతులు కట్టుకుని కింద పడి వున్న నాకేసి ఓ సారి నిర్లిప్తంగా చూశాడు.
“అయిపోయింది. అంతా అయిపోయింది,” అన్నాడు.
ఆయన ముఖంలో అంత కోపం ఎప్పుడూ చూళ్లేదు. నా కళ్లు మూతలు పడ్డాయి.
మళ్లీ కళ్ళు తెరిచి చూసేసరికి నాకు ఇరు పక్కలా మామయ్య, హన్స్ దుప్పట్లో చుట్టచుట్టకుని పడుకున్నారు. ఇద్దరూ నిద్రపోయారా? నా బాధకి మాత్రం అంతు లేకుండా ఉంది. ఆ బాధ తగ్గే మార్గమే లేదన్న ఆలోచన బాధని మరింత తీవ్రం చేస్తోంది. “అంతా అయిపోయింది” అని మామయ్య కోపంగా అంటున్న మాటలే చెవిలో గింగురు మంటూ బాధిస్తున్నాయి. ఇక మళ్లీ భూమి ఉపరితలాన్ని చూసే భాగ్యానికి మేం నోచుకోలేదనిపిస్తోంది.
మా నెత్తిన కోసున్నర మందాన భూమి పైపొర వుంది. దాని బరువు నా భుజాల మీద మోపుతున్నట్టు అనిపిస్తోంది. ఆ ఊహా భారానికి కాబోలు నేను పడుకున్న పాషాణ పానుపు మీద అటు ఇటు పొర్లడమే అతికష్టంగా వుంది.
కొన్ని గంటలు గడిచాయి. మా చుట్టూ వికృతమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. శ్మశాన నిశ్శబ్దమది. మా చుట్టూ ఉన్న గోడల లోంచి ఏ రకమైన శబ్దమూ దూరే అవకాశం లేదు. ఎందుకంటే ఆ గోడలలో అతి తక్కువ మందం గల గోడే ఐదు మైళ్ల మందం వుంది.
ఇలా నా ఆలోచనలు సాగుతుండగా ఇంతలో ఏదో చప్పుడు వినిపించింది. మా ఐస్లాండ్ సోదరుడు లేచి ఎటో వెళ్తున్నాడు. ఎందుకలా వెళ్లిపోతున్నాడు? ఎక్కడికి పోతున్నాడు? గట్టిగా అరుద్దాం అని అనుకున్నా గాని గొంతు పెగల లేదు. నాలుక తడారిపోయింది. పెదాలు వాచి వున్నాయి. చీకట్లో ఎటో వెళ్లిపోయాడు హన్స్.
“హన్స్ మనల్ని వదిలేసి వెళ్లిపోయాడు, హన్స్, హన్స్.” ఎలాగో ఓపిక చేసుకుని అన్నాను.
అన్నాను అనుకున్నానే గాని ఆ మాటలు నా పెదాలు దాటి బయటికి వెళ్లినట్టు లేదు. ఆ క్షణం భయపడ్డానే గాని అంత విశ్వాసపరుడు అలా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోతాడు? ఆ క్షణం అతణ్ణి సందేహించినందుకు సిగ్గుపడ్డాను. దురుద్దేశం ఉన్నవాడైతే పైకి పోవాలి, పారిపోవాలి. కాని హన్స్ కిందికి దిగుతున్నాడు. అది చూశాక నా ఆందోళన కాస్త సద్దుమణిగింది. ఎందుకు నిద్రపోతున్న వాడల్లా హఠాత్తుగా లేచి కిందికి దిగుతున్నాడు? ఏదైన వెతుక్కుంటూ వెళ్తున్నాడా? ఏదైనా చప్పుడు వినిపించిందా? చీకటి లోతుల్లో నీటి అలికిడి వినవచ్చిందా?
--ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం--
(ఇంకా వుంది)
0 comments