శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
1860 లలో ఫ్రాన్స్ కి చెందిన పట్టుపరిశ్రమ కొన్ని ఇబ్బందులకి గురయ్యింది. ఏదో తెలీని రోగం వల్ల పెద్ద సంఖ్యలో పట్టుపురుగులు చచ్చిపోయేవి. అంతకు ముందే సూక్ష్మదర్శిని వినియోగం గురించి, దాని లాభాల గురించి తెలిసిన పాశ్చర్, ఆ పరికరాన్ని ఉపయోగించి రోగానికి కారకమైన సూక్ష్మక్రిములని కనుక్కున్నాడు. రోగం సోకిన పురుగులని, అవి తినే మల్బరీ ఆకులని ఏరివేయించి, వాటిని నాశనం చేయించాడు. రోగం సోకిన పురుగుల సంపర్కం లేకపోవడం వల్ల మిగతా పురుగులు ఆరోగ్యంగా మిగిలాయి. ఆ విధంగా ఫ్రెంచ్ పట్టుపరిశ్రమని నిలబెట్టాడు పాశ్చర్.




ఉత్కృష్టమైన వైన్ కి ప్రసిద్ధమైన ఫ్రాన్స్ లో ఆ దశలో వైన్ పరిశ్రమకి కూడా అలాంటి సమస్య ఒకటి వచ్చి పడింది. ఏవో తెలీని కారణాల వల్ల వైన్ కొన్ని సార్లు పులిసిపోయి పాడైపోయేది. పాడైన వైన్ ని సూక్ష్మదర్శినిలో పరిశీలించిన పాశ్చర్ ఈ సమస్యకి కారణమైన క్రిములని కనుక్కున్నాడు. ఈ క్రిములని నాశనం చేసేందుకు గాని వైన్ తయారీకి వాడే విధానాన్ని కొద్దిగా సవరించాడు. వైన్ ని తగినంతగా మరగబెడితే లోపల ఉన్న క్రిములు చచ్చిపోతాయి. ఆ తరువాత వైన్ ని శీతలపరుస్తారు (refrigerate చేస్తారు) కనుక మిగిలిన క్రిములు స్తబ్దుగా ఉండిపోతాయి.



ఇలాంటి అనుభవాలని ఆధారంగా చేసుకుని పాశ్చర్ క్రిములకి, రోగాలకి మధ్య సంబంధాన్ని గుర్తించాడు. ఆ విధంగా germ theory of disease (క్రిముల వల్ల రోగాలు కలుగుతాయి అన్న సిద్ధాంతం) ఆవిర్భవించింది. ఈ క్రిములలో చాలా మటుకు బాక్టీరియా కావడంతో బాక్టీరియా ప్రాధాన్యత పెరిగింది. వాటి మీద ‘bacteriology’ అనే శాస్త్రం కూడా పుట్టింది.

కేవలం మరిగించడం మొదలైన ప్రాథమిక ప్రక్రియల వల్ల బాక్టీరియాలని నాశనం చెయ్యడం అన్ని సందర్భాలలోను వీలుపడదు. శరీరంలో ఉంటూ రోగానికి కారణమైన బాక్టీరియాని మరిగించేదెలా!? కనుక రసాయనాల ద్వారా బాక్టీరియాల మీద దండయాత్ర మొదలయ్యింది.

అలా ధ్వజం ఎత్తిన వారిలో ప్రథముడు బహుశ ఇంగ్లండ్ కి చెందిన జోసెఫ్ లిస్టర్ (Joseph Lister). దెబ్బ తగినప్పుడు ఏర్పడే పుండులో బాక్టీరియా ప్రవేశించి పుండు infect కావడం జరుగుతుంది. ఇది తెలుసుకున్న లిస్టర్, ఫీనాల్ (కార్బాలిక్ ఆసిడ్) ని ఉపయోగించి ముందు పుండుని శుభ్రం చేసే పద్ధతి మొదలెట్టాడు. ఇలా శుభ్రం చెయ్యడం వల్ల గాయం మరింత త్వరగా నయం అయ్యింది.

ఆ విధంగా గాయం కుళ్ళకుండా (sepsis) నివారించే రసాయనాల కోసం వేట మొదలయ్యింది. సెప్సిస్ ని నిరోధించే రసాయనాలకి ఉమ్మడిగా ఆంటీ-సెప్టిక్ (anti-septic) లు అని పేరు పెట్టారు.

అలాంటి ప్రయత్నంలో బయటపడ్డ మరో రసాయనం ఐయొడిన్ (iodine). ఫ్రెంచ్ వైద్యుడు కాసిమిర్ డవేన్ 1873 లో ‘టించర్ ఆఫ్ అయొడిన్’ యొక్క క్రిమిసంహారక లక్షణాల గురించి అధ్యయనాలు చేశాడు.

పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఎక్కడ క్రిములు ఉన్నాయని తెలిసినా కొన్ని సామాన్య రసాయనాలు వాడి వాటిని నిర్మూలించే మోటు పద్ధతే కొంత కాలం కొనసాగింది. అంతే కాని ఏ రోగానికి ఏ క్రిమి కారణం, ఏ క్రిమికి ఏ రసాయనం విషం? – ఇలాంటి ప్రశ్నలకి జవాబులు లేవు. ఆ ధోరణిలో ఆలోచించినవాడు రాబర్ట్ కాక్ (Robert Koch) అనే జర్మను వైద్యుడు.

వివిధ రోగాలకి కలుగజేసే బాక్టీరియాలని వేరు చేసి, వాటిని వర్గీకరించే ప్రయత్నానికి పూనుకున్నాడు కాక్. బాక్టిరియాలని వేరు చేసి నిలువ ఉంచే ప్రయత్నంలో మొదట్లో ఓ సమస్య ఎదురయ్యింది. అంతవరకు అలాంటి అధ్యయనాలు చేసిన పాశ్చర్ బాక్టీరియా లని ద్రవాలలో నిలువ ఉంచేవాడు. కాని ద్రవంలో అయితే క్రిములు ద్రవంతో పాటు అటు ఇటు మసలుతూ ఉంటాయి. వాటిని స్థిరంగా ఒక చోట నిలిపేందుకు గాని ద్రవాలని కాకుండా, ఘన పదార్థంలో వాటిని నిలిపే పద్ధతి కనిపెట్టాడు కాక్.

జెలటిన్ (gelatin) అనే జిగురు లాంటీ, జెల్లీ లాంటి పదార్థంలో బాక్టీరియాలని స్థిరపరిచడం మొదలెట్టాడు కాక్. అలాంటి మాధ్యమంలో ఒక చోట ఒక ఏకాంత బాక్టీరియాని ప్రవేశపెడితే అది అక్కడే కదలకుండా ఉండడమే కాక, దాని సంతతి కూడా అదే ప్రదేశంలో ఓ రాశిగా వృద్ధి చెందుతుంది. ఈ విధంగా సంకరం లేని ‘శుద్ధ సంతతి’ (pure strains) ని సాధించడానికి వీలయ్యింది. రాబర్ట్ కాక్ కి జూలియస్ పెట్రీ (Julius Petri) అనే ఓ సహచరుడు ఉండేవాడు. ఇతగాడు కాస్త లొత్తగా, ప్రమిదలలా, ఉండే గాజు గిన్నెలలో బక్టీరియాలని ఉంచి వాటి మీద మూతలు పెట్టే పద్ధతి అనుసరించేవాడు. మూత లేకపోతే గాలిలో కొట్టుకొచ్చే బాక్టీరియా, గిన్నెలో ఉన్న బాక్టీరియాతో కలిసి వాటిని కలుషితం చేసే ప్రమాదం వుంది. పెట్రీ వాడిన ఈ రకమైన గాజు పళ్లేలనే ఇప్పుడు ‘పెట్రీ డిష్’ (Petri dish) అంటున్నాం.



ఇలాంటి మెరుగైన పద్ధతులతో కాక్ కొన్ని ముఖ్యమైన రోగకారక క్రిములని గుర్తించగలిగాడు. ఉదాహరణకి ట్యూబర్ క్యులోసిస్ (టీ.బీ.) కి కారణం బాసిలస్ అనే ఒక రకమైన బాక్టీరియా అని కనుకున్నాడు. అలాగే కలరాకి కారణమైన బాక్టీరియా ని కూడా కనుక్కున్నాడు. ఈ విజయాలకి గుర్తింపుగా రాబర్ట్ కాక్ కి 1905 లో వైద్యం, జీవక్రియాశాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

ఇప్పుడు వివిధ రకాల బాక్టిరియాల గురించి తెలిసింది గాని, వాటికి తగ్గ మందులు ఇంకా కనుగొనబడలేదు. అంతవరకు వాడే ఆంటీసెప్టిక్ ల లాంటి మందులు సర్వసామాన్యంగా అన్ని రకాల కణాల మీద పని చేసే మందులు. అవి బాక్టీరియా తో పాటు ఆరోగ్యవంతమైన దేహ కణాలని కూడా నాశనం చేస్తాయి. అలా కాకుండా ప్రతీ క్రిమికి దాన్ని మాత్రమే ప్రత్యేకంగా చంపగల మందులని రూపొందించాలని పాల్ ఎహర్లిక్ (Paul Ehrlich) అనే జర్మన్ వైద్యుడు వాదించాడు. అలా సూటిగా, అనితరంగా లక్ష్యాన్ని భేదించే మందుకి ‘magic bullet’ అని పేరు పెట్టాడు ఎహర్లిక్.

(ఇంకా వుంది)



లూయీ పాశ్చర్ గురించి ఓ చక్కని ఆనిమేషన్ వీడియో ఇక్కడ వుంది. పిల్లలకి నచ్చుతుంది.

http://www.youtube.com/watch?v=XrKiNp2uI_0

రాబర్ట్ కాక్ నోబెల్ ఉపన్యాసం - http://www.nobelprize.org/nobel_prizes/medicine/laureates/1905/koch-bio.html



పెట్రీ డిష్ ల గురించి ఓ సరదా పజిల్

ఓ పెట్రీ డిష్ లో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండుకి ఒకే బాక్టిరియం వుంది. ఈ రకం బాక్టీరియా నిముషానికి ఒక సారి విభజన చెంది రెండుగా విడిపోతాయి. 47 నిముషాల తరువాత డిష్ సగానికి నిండింది. మొత్తం డిష్ నిండడానికి ఎంత సేపు పడుతుంది?

http://richardwiseman.wordpress.com/2009/09/11/its-the-friday-puzzle-24/

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts