శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

వైరస్ కథ

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, October 24, 2012
వైరస్ కథ
వైరస్ లు రోగాన్ని కలుగజేసి, ప్రాణాన్ని కూడా హరించగల అతి సూక్ష్మమైన జీవరాశులు.

జీవప్రపంచానికి, అజీవప్రపంచానికి మధ్య సరిహద్దు మీద ఉండే అతి సూక్ష్మమైన వస్తువులు వైరస్ లు. అసలు అంత సూక్ష్మమైన జీవరాశులు ఉంటాయని ఎవరూ ఊహించలేకపోయారు. అందుకే వైరస్ ల గురించి సరైన అవగాహన కలగడానికి ఇరవయ్యవ శతబ్దం వరకు ఆగాల్సి వచ్చింది.పూర్వచరిత్ర

పదిహేడవ శతాబ్దానికి ముందు మనిషికి తెలిసిన అత్యంత సూక్ష్మమైన జీవరాశులు పురుగులు. అంత కన్నా చిన్న ప్రాణులు అసలు ఉండలేవని అనుకునేవారు. అందుకే “భూతద్దాల” (కుంభాకార కటకాలు, convex lenses) గురించి కొన్ని వేల ఏళ్లుగా మనిషికి తెలిసినా ఆ “అద్దాలు” ఉపయోగించి పురుగుల కన్నా చిన్న వస్తువుల కోసం వెతకాలన్న ఆలోచన కూడా చాలా కాలం వరకు ఎవరికీ తట్టలేదు. అయితే భూతద్దాలతో చిన్న చిన్న అక్షరాలు కూడా చదవచ్చని, వాటితో కళ్ళ జోళ్లు తయారుచేసి దృష్టి దోషాన్ని సరిచేసుకోవచ్చని కొన్ని శతాబ్దాలుగా మనుషులకి తెలుసు.

1608 నెదర్లండ్ కి చెందిన హన్స్ లిపర్షే (Hans Lippershey) అనే కళ్ళద్దాలు చేసే వ్యక్తి రెండు కుంభాకార కటకాలని ఒక విధంగా పేర్చి ఓ గొట్టంలో అమర్చితే దూరంగా ఉన్న వస్తువులు దగ్గరగా కనిపిస్తాయని కనుక్కున్నాడు. దానికి telescope (దూరదర్శిని) అని పేరు పెట్టాడు. ఈ పరికరానికి త్వరలోనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా దూరంగా శత్రుసేనలని గుర్తుపట్టొచ్చు కనుక దీనికి యుద్ధ ప్రయోజనాలు కూడా ఉన్నాయని కనుక్కున్నారు.

ఈ దూరదర్శిని ఇటాలియన్ శాస్త్రవేత్త, ఆధునిక భౌతిక శాస్త్రానికి పితామహుడు అయిన గెలీలియో గెలీలీ కంటపడింది. ఈ పరికరాన్ని ఉపయోగించి ఆయన ఊరికే ఉబుసుపోక కోసం ఇరుగు పొరుగు దృశ్యాలు చూడకుండా, ఏకంగా దాన్ని ఆకాశం కేసి ఎక్కుపెట్టాడు. అంతవరకు అగోచరంగా ఉన్న సువిస్తారమైన విశ్వం ఆయనకి కోటికళలతో దర్శనమిచ్చింది. ఆధునిక ఖగోళశాస్త్రానికి శ్రీకారం చుట్టింది.

దూరదర్శినితో ప్రయోగాలు చేసిన గెలీలియో మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తించాడు. అందులోని కటకాలని మరో విధంగా అమర్చితే అతి సూక్ష్మమైన వస్తువులని సంవర్ధనం చేసి పెద్దగా కనిపించేలా చెయ్యొచ్చు. అలా పుట్టిందే మొట్టమొదటి సూక్ష్మదర్శిని (microscope). సూక్ష్మదర్శినితో గెలీలియో పెద్దగా ఏమీ చెయ్యకపోయినా ఆయన తరువాత తదితరులు దాంతో ఎన్నో పరిశీలనలు చేశారు.

ఇటాలియన్ ప్రకృతి శాస్త్రవేత్త ఫ్రాన్సెస్కో స్టెల్లుటీ దాంతో పురుగుల శరీర నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. ఇటాలియన్ వైద్యుడు మార్సెల్లో మాల్ఫీజీ దీంతో సూక్ష్మమైన రక్తనాళాలని పరిశిలించాడు. రాబర్ట్ హూక్ దీని సహాయంతో బిరడా (cork) లోని కణాలని పరిశీలించాడు.

(కాస్త మన రేలంగి గార్ని తలపించే ఆంటొనీ వాన్ లీవెన్హాక్!)


తరువాత నెదర్లండ్స్ కి చెందిన ఆంటొనీ వాన్ లీవెన్హాక్ (1632-1722) ఈ సూక్ష్మదర్శినికి బాగా మెరుగులు దిద్దాడు. ఇతడి సూక్ష్మదర్శిని వస్తులని 200X రెట్లు సంవర్ధనం చేసి చూపగలిగింది. లీవెన్హాక్ ఒక రోజు అలవోకగా ఓ వర్షపు నీటి చుక్కని తన సూక్ష్మదర్శిని కింద పెట్టి చూసి తనకి కనిపించిన దృశ్యానికి అదిరిపోయాడు. అందులో అతడికి సంచలనంగా జీవం ఉన్నట్టుగా కదిలే వస్తువులు కనిపించాయి. వాటిని అతడు “చిన్నారి జీవాలు” (wee animalcules) అని “గంతులేసే జంతువుల” ని (cavorting beasties) ముద్దుగా పేర్లు పెట్టుకున్నాడు. ఆ వస్తువుల చలనం గురించి తన మాటల్లోనే విందాం – “పైకి, కిందికి కదులుతూ, చక్కర్లు కొడుతూ నీట్లో వాటి చలనం ఎంత వేగంతో, ఎంత వైవిధ్యంతో కూడుకుని ఉందంటే వాటిని చూసి అబ్బురపడకుండా ఉండలేకపోయాను. వీటిలో కొన్ని నేను ఇంతవరకు చూసిన అతి చిన్న జీవాల కన్నా వేల రెట్లు చిన్నవి… ఇక మరి కొన్ని అయితే [ఎంత చిన్నవంటే] ఒక్క నీటి బొట్టులో కోటానుకోట్లు పట్టేస్తాయేమో…”
(లీవెన్హాక్ సూక్ష్మదర్శినిలో తనకి కనిపించిన "చిన్నారి జీవాల" చూసి వేసిన చిత్రాలు)


దైవచింతన గాఢంగా గల లీవెన్హాక్ ఈ అద్భుత దృశ్యాలన్నీ చూసి “ఆహా! దైవ సృష్టి!” అని సంబరపడిపోయాడు.

లీవెన్హాక్ చూసి మురిసిపోయిన “చిన్నారి జీవాలు” నిజానికి ప్రొటోజువా అనబడే ఏకకణ జీవాలు.

రోగాన్ని కలుగుజేసే ‘క్రిములు’ ఇవి కావు. అవి ఇంత కన్నా బాగా చిన్నవి. లీవెన్హాక్ చేసినట్టే సూక్ష్మదర్శినితో మరిన్ని పరిశీలనలు చేసిన ఆటో ముల్లర్ అనే ఓ డేనిష్ శాస్త్రవేత్త రెండు రకాల “చిన్నారి జీవాల”ని కనుక్కున్నాడు. వీటిలో ఒకటి “చిన్న కడ్డీ” లాగా వుంది కనుక దానికి బాసిలీ (bacili) అని పేరు పెట్టాడు. (bacilli అంటే లాటిన్ లో చిన్న కడ్డీ అని అర్థం). మరకటి సర్పిలాకారంలో చుట్టు చుట్టుకుని వుంది కనుక దానికి spirilla (స్పిరిల్లా) అని పేరు పెట్టాడు. (spirilla అంటే లాటిన్ లో సర్పిలం అని అర్థం). తదనంతరం ఆస్ట్రియాకి చెందిన థియోడోర్ బిల్రాత్ కూడా ఈ రకమైన మరి కొన్ని కణాలని కనుక్కున్నాడు. జర్మనీ కి చెందిన ఫెర్డినాండ్ కోన్ అనే వృక్ష శాస్త్రవేత్త వీటన్నిటికీ ఊకుమ్మడిగా ‘bacterium’ అని పేరు పెట్టాడు. ఈ పదానికి కూడా లాటిన్ లో ‘చిన్న కడ్డీ’ అని అర్థం. ఈ బాక్టీరియాలకే రోకకారక లక్షణాలు ఉన్నాయని క్రమంగా అర్థం కాసాగింది.బాక్టీరియాలకి రోగాలకి మధ్య సంబధాన్ని గుర్తించినవారిలో ప్రథముడు ఫ్రాన్స్ కి చెందిన మేటి వైద్యుడు లూయీ పాశ్చర్ (1822-1895).(ఇంకా వుంది)

References:

1. Isaac Asimov, Guide to Science 2: Biological Sciences, Pelican Books. (Chapter on Micro-organisms), 1972.

2. http://www.answersingenesis.org/articles/aid/v7/n1/antony-van-leeuwenhoek-creation-magnified-microscopes

2 comments

  1. the tree Says:
  2. ఓ, సూక్ష్మదర్శనిలో కూడా గెలీలియో పాత్ర వుందా...

     
  3. అవును మరి గెలీలియో సామాన్యుడా? ఒక్క జీవిత కాలంలో అన్ని చెయ్యబోయాడు కనుకనే అన్ని ఇబ్బందులు పడ్డాడు!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Total Pageviews

There was an error in this gadget
There was an error in this gadget

విజ్ఞానులు

GuestBooker 2.5

Recent Posts

Popular Posts

Follow by Email