ఇంతవరకు ఈ బ్లాగ్ లో ఎన్నో రకాల సైన్స్ వ్యాసాలని పోస్ట్ చెయ్యడం జరిగింది. అయితే అవన్నీ సైన్స్ విషయాల మీద సామాన్యమైన ఆసక్తి పెంచే దిశలోనే ఉన్నాయి. విద్యార్థులకి కూడా అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నా కూడా, ప్రత్యక్షంగా బడి చదువులకి, బళ్లో చెప్పే సైన్స్ కి సంబంధించిన పోస్ట్ లు పెద్దగా లేవు. బళ్లో చెప్పే సైన్స్ పాఠాలతో సూటిగా సంబంధం ఉన్న సమాచారాన్ని అందిస్తే ఈ బ్లాగ్ స్కూలు పిల్లలకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
ఆ ఉద్దేశంతో పదోక్లాస్ భౌతికశాస్త్రం నుండి ఒక అంశాన్ని తీసుకుని ధారావాహికంగా కొన్ని పోస్టులలో ‘హై స్కూల్ సైన్స్’ అన్న టాగ్ తో చెప్పుకొచ్చే ప్రయత్నం చేద్దాం.
ముందు ‘కాంతి’ తో మొదలుపెడదాం. ప్రత్యేకించి పదోక్లాసు పాఠ్యపుస్తకంలో ‘దృగ్గోచర కాంతి మితి’ అన్న పాఠాన్ని తీసుకుందాం. కాస్త అర్థాంతరంగా మొదలుపెట్టినట్టు అనిపించినా, తగినంత ఉపోద్ఘాతం ఇచ్చి, పాఠం సులభంగా అర్థమయ్యేట్టు జాగ్రత్తపడదాం. ఎక్కడో అక్కడ మొదలుపెట్టాలి కనుక ‘కాంతి’తో ఆరంభించినా, క్రమంగా ఇతర పాఠాలు కూడా చెప్పుకురావాలని ఆలోచన.
ఏ పాఠం తీసుకున్నాం అన్నది అంత ముఖ్యం కాదు. పాఠం చెప్పే తీరులో కొన్ని నియమాలని పాటించాలన్నది ముఖ్యోద్దేశం. ఆ నియమాలు -
1. పాఠం అర్థం చేసుకోడానికి చాలా సులభంగా ఉండాలి. సామన్య తెలివితేటలు కలిగి, కాస్త తెలుగు అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి, హైస్కూల్ లో చదువుకునే ఒక పల్లెటూరి విద్యార్థి(ని), పెద్దగా పెద్దవాళ్ల సహాయం లేకుండానే తనంతకు తాను చదువుకుని అర్థం చేసుకోగలిగేటంత సులభంగా, స్వయం విదితంగా ఉండాలి.
2. ఊరికే పరిభాషతో బెదరగొట్టకుండా, నిర్వచనాలతో ఉక్కిరిబిక్కిరి చెయ్యకుండా, సులభమైన, సముచితమైన వివరణలతో భావాలని నిర్ద్వంద్వంగా వివరించాలి.
3. సముచిత స్థాయిలో భావాల చరిత్ర చెప్పాలి. చరిత్ర అంటే ఎవరు, ఎప్పుడు కనిపెట్టారు అన్నది కాదు. తప్పుడు భావాలు సరైన భావాలుగా ఎలా వికాసం చెందాయో చెప్పే భావ చరిత్ర క్లుప్తంగా చెప్పాలి.
4. ప్రతీ భావనని పరిచయం చేసే ముందు, అసలు అలాంటి భావనని ప్రతిపాదించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలి.
5. వాస్తవ ప్రపంచంలో ఆ భావన ఎక్కడ పనికొస్తుందో బోధపరచాలి. వీలైనన్ని ఉదాహరణలతో భావన మనసులో బాగా నాటుకునేలా చెయ్యాలి.
6. భావం పట్టుబడే విధంగా విద్యార్థులు ఇంట్లో చేసుకోదగ్గ ప్రయోగాలు కూడా వివరించాలి.
7. భావనల పరిచయంలో ఒక క్రమం ఉండాలి. ప్రాథమిక భావనలని పరిచయం చేశాకనే మరింత ఉన్నత భావనల జోలికి వెళ్లాలి. పాఠం సాంతం చిట్టి చిట్టి మెట్లున్న మెట్ల దారిలా ఉండాలి. పెద్ద పెద్ద అంగలు వెయ్యాల్సిన అవసరం రాకూడదు.
8. భావనలు పరిచయం చేసే క్రమంలో ఓ గొలుసుకట్టు ఉండాలి. ఒక కొత్త భావాన్ని పరిచయం చేసేటప్పుడు అంతవరకు పరిచయమైన భావన(ల)కి, ఈ కొత్త భావానికి మధ్య సంబంధం ఏంటో స్పష్టం చెయ్యాలి.
9. పాఠంలో భాష సరళమైన వ్యావహారిక భాష కావాలి. గ్రాంథికానికి ఆమడ దూరంలో ఉంటే మేలు. పాఠం ఓ కథలాగా, తైలధార లాగా సాఫీగా ప్రవహించాలి.
10. సందర్భోచితంగా కాస్తంత హాస్యం చల్లితే ఫరవాలేదు. మన చదువులు పిల్లలకి అందించవలసినవి చిరునవ్వులు, కన్నీళ్ళు కావు.
పై సూత్రాలు విద్యారంగంలో అందరికీ తెలిసినవే అయినా, ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే, పాఠ్యపుస్తకాలలో ఈ సూత్రాలని పూర్తిస్థాయిలో పాటించడం లేదు. పరిభాష విపరీతంగా ఉంటుంది. వివరణ కొరవడుతుంది. భాష పూర్తిగా వ్యావహారికం కాదు. వ్యావహారిక, గ్రాంథిక భాషల విచిత్ర మిశ్రమం. ఉదాహరణకి ఆ ‘దృగ్గోచర కాంతిమితి’ అన్న పాఠంలో ఈ కింది నిర్వచనాన్ని చూడండి.
“ఒక గోళాకార ఉపరితలంపైన ఉన్న కొంత భాగంలోని హద్దుల వెంబడి గోళ కేంద్రమునకు అభిలంబ రేఖలను గీసిన అవి శంకువును ఏర్పరచును. ఈ శంకువు పీఠం గోళ కేంద్రం వద్ద చేసే కోణమే ఘనకోణం. ఇది శంకువు పీఠం వైశాల్యానికి మరియు గోళ వ్యాసార్థము యొక్క వర్గానికి గల నిష్పత్తికి సమానము.”
ఈ నిర్వచనం మహాపండితులకి తప్ప సామాన్య మానవులకి అర్థం కాదని నా అభిప్రాయం!
మరో సమస్య ఏంటంటే ఇది చాలా చిన్న, ఐదు పేజీల, పాఠం. అందులోనే హడావుడిగా ‘కాంతి అభివాహం,’ ‘ఘనకోణం,’ కాంతి తీవ్రత’, ‘దీపన సామర్థ్యం’ వంటి భావనలు, ‘ల్యూమెన్,’ ‘కాండెలా,’ ‘స్టెరేడియన్’ వంటి కొత్త యూనిట్లు పరిచయం చెయ్యబడ్డాయి.
కాంతిని కొలవడానికి ఇన్ని భావనలు అసలు అవసరమా? ఇంత పరిభాష కావాలా? ఇలా తప్ప మరో విధంగా ప్రకాశాన్ని కొలవడానికి సాధ్యం కాదా? పిల్లలకి ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నీ పిల్లలకి తీరుతాయని నాకు నమ్మకం లేదు.
సైన్స్ లో ఒక పాఠం అర్థం అయ్యింది అని ఎప్పుడు అంటామంటే, ఆ అంశాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తకి అర్థమయినంత లోతుగా, ఆ పాఠం చదివిన వాడికి అర్థమయినప్పుడు! అలా అర్థం కావాలంటే ఆ పాఠం విషయంలో సందేహాలన్నీ కావాలి . ఆ అంశానికి సంబంధించిన చీకట్లన్నీ తొలగి మూల మూలలా ‘కాంతి’ ప్రసరించాలి! అలా అర్థమైన సైన్స్ పాఠం పుట్టెడు మార్కులనే కాదు, చెప్పలేని ఆనందాన్ని కూడా ఇస్తుంది.
వచ్చే పోస్ట్ నుండి పాఠం మొదలెడదామా?
మంచి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ముందుగా అభినందనలు. ఆ పైన మీరిచ్చిన నిర్వచనము చదివాక "అసలు నేను తెలుగు మీడయం చదివానా?? " అన్న అనుమానం కలుగింది. అతిశయోక్తి కాదు. నిజంగా నిజం.
శ్రీనివాస చక్రవర్తి గారికి...మీరు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందనీయం...ఉస్మానియ యూనివర్శిటిలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులుగా మేము మీ బ్లాగ్ ను రెగ్యూలర్ గా ఫాలో అవుతున్నా ము. మేము కొంతమందిని కలిసి గ్రామీనా విద్యార్థులకు ఉపయోగార్థం ఒక మాస పత్రికను కూడా ప్రచురిస్తున్నాము. దాంట్లో ఒక కాలం "శాత్రసాంకేతికం" కూడా ఉంచాము. మీకుఇ విలైతే మా పత్రికకు కూడా నెలకు ఒక వ్యసం చొప్పునా వ్రాస్తే బాగుంటుందని అశిస్తున్నాము. మీకు వీలు ఐతే మాకు ఆ సహయం చేయగలరు...గ్రామీణా విద్యార్థులను చేతన్య వంతులను చేసినట్టు ఉంటుంది... మా బ్లాగ్ .www.oucampusvoice.blogspot.com
భాస్కరరామి రెడ్డి గారు-
నిజమే. ఇంగ్లీష్ తో పోల్చితే అంత తక్కువ వనరులు, వసతులు ఉన్న తెలుగు మీడియం లో చదువుకున్న వాళ్ళు తదనంతరం వృత్తిజీవితంలో ఎంతో పైకి రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అది వాళ్ల వ్యక్తిగత ప్రతిభకి, స్వయంకృషికి నిదర్శనం అనే చెప్పుకోవాలి. అందుకే తెలుగు మీడియం చదువులని (భారతీయ భాషల్లో చదువులని) మరింత బలోపేతం చేస్తే, వనరులని పెంచితే ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా ఉంటుంది.
మరొక అహితమైన విషయం ఏంటంటే తెలుగు మీడియం చదువు, ఇంగ్లీష్ మీడియం చదువు కన్నా తక్కువ అన్న భావం ఒకటి మన సమాజంలో ఉంది. నాకు తెలిసిన ఒకాయనని (తన వృత్తిలో ఎన్నో విజయాలని సాధించిన వ్యక్తి) ఈ మధ్యన, ‘మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారా?’ అని అడిగితే ‘అవునని’ సమాధానం చెప్పడానికి ఆయన ఎంతో తటపటాయించడం చూసి ఆశ్యర్యం వేసింది. ఇలాంటి దృక్పథం మారాలంటే తెలుగులో పరిజ్ఞానాన్ని పెంచాలి.
ఇంగ్లీషైనా, తెలుగైనా రెండూ భాషలే, ఖాళీ పాత్రలే. పాత్రలో ఏం వుంది అన్న దాన్ని బట్టి వాటికి విలువ వస్తుంది.
కాంపస్ వాయిస్@
మీ పత్రిక చాలా బవుంది. అయితే అందులో అన్నీ రాజకీయ వ్యాసాలు ఉన్నాయి. అందులో సైన్స్ వ్యాసం ప్రచురిస్తే బావుంటుందా?
telugu lo science chaalaa baagundi .nenu english lo science py oka blog naduputhunnanu.
www.cvramanscience.blogspot.com
ravisekhar oddula
Ravishekar garu
mee blog chala bagundi. inkaa boledu vyaasaaly raastaarani aasistoo...