అంతకు ముందు వాస్కో నౌకాదళానికి దారి చూపిస్తానని వచ్చిన ఓ అరబిక్ నావికుడు ఈ బృందాన్ని ఆఫ్రికా తూర్పు తీరం వెంట పైకి కిందకి తిప్పించాడు. పెను తుఫానులలో ఇరికించాడు. కాని అహ్మద్ మజిద్ మార్గదర్శకత్వంలో అలాంటి అవాంతరాలేమీ జరగలేదు. మే 20, 1498 నాడు వాస్కో బృందం సురక్షితంగా ఇండియా పశ్చిమ తీరాన్ని చేరుకుంది. పోర్చుగల్ నుండి బయల్దేరిన పదకొండు నెలల తరువాత మూడు పోర్చుగీస్ ఓడలూ కాలికట్ రేవులోకి ప్రవేశించాయి. ఆ కాలంలో ఇండియాలో దక్షిణ-పశ్చిమ కోస్తా ప్రాంతంలో కాలికట్ ఓ ముఖ్యమైన రేవుగా, గొప్ప నాగరికత గల నగరంగా, గొప్ప వ్యాపార కేంద్రంగా వెలిగేది. ఆ ప్రాంతాన్ని ఏలే రాజు పేరు ‘జామొరిన్’. మళయాళంలో ఆ పదానికి ‘సముద్రానికి రాజు’ అని అర్థం. హిందువైన ఈ రాజు, అధికశాతం ముస్లిమ్లు ఉండే ఆ ప్రాంతాన్ని సమర్ధవంతంగా పరిపాలించేవాడు.
మాలింది లో బయల్దేరిన ఇరవై ఆరు రోజుల తరువాత మళ్లీ తీరాన్ని చూస్తున్నారు నావికులు. కనుక ఎప్పుడెప్పుడు తీరం మీద అడుగు పెడదామా అని తహతహలాడుతున్నారు. ఓడలు రేవులోకి ప్రవేశించగానే నాలుగు చిన్న పడవలు ఓడని సమీపించాయి. ఆ పడవల్లో కొందరు స్థానిక అధికారులు వాస్కో ద గామా ఓడల లోకి ప్రవేశించి వాళ్ల గురించి వివరాలు సేకరించారు. కాని తీరం మీద అడుగుపెట్టడానికి అనుమతి ఇవ్వలేదు. మర్నాడు మళ్లీ అలాగే ఆ పడవలు వచ్చాయి. మళ్లీ విచారణలు జరిగాయి కాని ఊళ్ళోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఈ జాప్యం వాస్కో కి నచ్చలేదు. అరబిక్ భాష మాట్లాడగల ఓ దూతని ఆ వచ్చిన అధికారులతో పంపాడు. తీరం మీద కొందరు అరబ్బులు దూతతో కొంచెం దురుసుగా మాట్లాడారు. ఆ సమయంలో రాజు కాలికట్ లో లేడని, కాస్త దూరంలో ఉన్న పాననే అనే ఊరికి వెళ్లాడని చెప్పారు. దూత ఆ విషయం వచ్చి వాస్కో తో చెప్పాడు.
వాస్కో ద గామా ఆలస్యం చెయ్యకుండా ఈ సారి ఇద్దరు దూతలని పోర్చుగల్ రాచ ప్రతినిధులుగా నేరుగా జామొరిన్ వద్దకే పంపాడు. దూతల ద్వారా వాస్కో ద గామా గురించి తెలుసుకున్న జామొరిన్ సాదరంగా ప్రత్యుత్తరం పంపాడు. తను త్వరలోనే కాలికట్ కి తిరిగి వస్తున్నట్టు, వాస్కో ద గామాని కలుసుకోవడానికి కుతూహల పడుతున్నట్టు ఆహ్వానపూర్వకంగా జవాబు రాశాడు.
చివరికి మే 28 నాడు రాజు గారి దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. పదమూడు మంది అనుచరులతో, వాస్కో ద గామా తీరం మీద అడుగుపెట్టాడు. తమ్ముడు పాలోని ఉన్న ఓడల బాధ్యత అప్పజెప్పుతూ, ఏ కారణం చేతనైనా తను తిరిగి రాకపోతే, వెంటనే ఓడలని తీసుకుని పోర్చుగల్ కి తిరిగి వెళ్ళిపొమ్మని ఆదేశించాడు. వాస్కో ద గామాని ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున వేడుక ఏర్పాటు చేశాడు రాజు. జామొరిన్ మనుషులు వాస్కో ద గామా బృందాన్ని కాలికట్ వీధుల వెంట బళ్లలో తీసుకెళ్లారు. పాశ్చాత్య నావికులని చూడడానికి పురవీధులకి ఇరుపక్కల జనం బారులు తీరారు. పెద్ద పెద్ద నగారాలు మ్రోగాయి. డప్పుల శబ్దం మిన్నంటింది. వాళ్లకి జరిగిన సత్కారాన్ని తలచుకుంటూ వాస్కో బృందంలో ఒకడు తదనంతరం “అసలు ఇంత గౌరవం స్పెయిన్ లో స్పెయిన్ రాజుకి కూడా ఆ దేశ ప్రజలు అందించరేమో” అంటూ రాసుకున్నాడు. దారిలో ఓ హైందవ ఆలయంలో ఆగింది బృందం. వాస్కో ద గామాకి హైందవ మతం గురించి పెద్దగా తెలీదు. ఆ గుళ్లన్నీ చర్చిలే అనుకుని అపోహ పడ్డాడు. ఒక చోట కనిపించిన దేవి విగ్రహం చూసి అది వర్జిన్ మేరీ విగ్రహం అనుకుని పొరబడ్డాడు.
చివరికి బృందం రాజుగారి కోటని చేరుకుంది. వాస్కో ద గామా రాజ సభలో అడుగుపెట్టాడు. భారతీయ పద్దతిలో రెండు చేతులు జోడించి రాజుగారికి నమస్కరించాడు. స్థానికులు ఆ విధంగా ఒకర్నొకరు పలకరించుకోవడం అంతకు ముందే గమనించాడు. రాజు గారు సముచితాసం ఇచ్చి, అతిథులకి ఫలహారం ఏర్పాటు చేసి ఆదరించారు. ముందు కుశల ప్రశ్నలు వేసి వారు వచ్చిన కార్యం గురించి వాకబు చేశారు. పోర్చుగీస్ రాజు మాన్యుయెల్ ఇండియా గురించి, ప్రత్యేకించి కాలికట్ గురించి ఎంతో విన్నాడని, కాలికట్ తో వాణిజ్యం రెండు దేశాలకి ఎంతో లాభదాయకమని వాస్కో ద గామా విన్నవించాడు.
వాస్కో కి, తన అనుచరులకి రాజమందిరంలోనే ఆ రాత్రికి ఆతిథ్యం దొరికింది. మర్నాటి ఉదయం వాస్కో జామొరిన్ అనుచరులని తన గదికి పిలిపించాడు. జామొరిన్ కి ఇవ్వడానికి తెచ్చిన వస్తువులు చూపించి, రాజుగారికి ఇవి నచ్చుతాయా అని అడిగాడు. ఆ వస్తువులు చూసి వాళ్లు నిర్ఘంతపోయారు. అలాంటి బహుమతులు ఓ చిన్న గూడెం దొరకి ఇవ్వడానికి సరిపోతాయేమో గాని, అంత పెద్ద రాజుకి ఇవ్వడం సరికాదు అన్నారు వాళ్లు.
ఈ బహుమతుల భాగోతం రాజుగారి చెవిన పడింది. ఆయనకి ఆ సంగతి ససేమిరా నచ్చలేదు. తరువాత వాస్కో రాజుగార్ని కలుసుడానికి వెళ్ళినప్పుడు బహుమతులు నచ్చని విషయం మొహం మీదే చెప్పాడు. ఆ ముందు రోజే అంత ఆదరంగా మాట్లాడిన మనిషి ఒక్క రోజులోనే, అదీ అంత చిన్న విషయం గురించి, అంతగా మారిపోవడం వాస్కో దగామాకి కాస్త సందేహం కలిగించింది. తన సందేహం నిజమేనని తరువాత జరిగిన సంఘటనలు నిరూపించాయి.
(ఇంకా వుంది)
0 comments