శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



ఇంకా ముందుకు పోతే ఎలాంటి భయంకర అగ్నిపర్వత శిలా ప్రాకారాలని చూడాల్సి వస్తుందోనని కొంచెం ఆదుర్దా పడసాగాను. కాని అప్పుడు ఓల్సెన్ మ్యాపుని పరిశీలించగా ఒక విషయం అర్థమయ్యింది. తీరం వెంట ముందుకి పోతే ఈ అగ్నిపర్వత శిలలు ఉన్న ప్రాంతాన్ని తప్పించుకోవచ్చు. అసలు అగ్నిపర్వత విలయతాండవం అంతా ద్వీపం యొక్క కేంద్రభాగానికే పరిమితం అని తరువాత తెలిసింది. ఆ ప్రాంతంలో లావాప్రవాహం ఘనీభవించగా ఏర్పడ్డ ట్రాకైట్, బేసల్ట్ మొదలైన శిలా జాతులన్నీ కలగలిసి అతిభీషణ పాషాణ విన్యాసాలుగా ఏర్పడ్డాయి. ఇక స్నేఫెల్ ద్వీపకల్పంలో మా కోసం ఎలాంటి దారుణ భౌగోళిక దృశ్యాలు వేచి ఉన్నాయో ఆ క్షణం ఊహించుకోలేకపోయాను.

రెయిక్యావిక్ నగరాన్ని వొదిలిన రెండు గంటలకి గఫ్యూన్స్ అనే చిన్న ఊరు చేరాము. అక్కడ ఓ చర్చి ఉంది. కొన్ని చిన్న ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ పెద్దగా విశేషాలేమీ కనిపించలేదు. అసలు దీన్ని ఊరు అనే కన్నా, జర్మనీ ప్రమాణాలతో చుస్తే కాస్త పెద్ద పల్లె అనొచ్చునేమో.

హన్స్ అక్కడ ఓ అరగంట సేపు ఆగుదాం అన్నాడు. అందరం కలిసి తెచ్చుకున్న సరంజామా లోంచి కడుపారా తిన్నాం. మామయ్య వేసే అంతులేని ప్రశ్నలకి హన్స్ ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు. ఇక ముందు దారి ఎలా ఉంటుందో, రాత్రి ఎక్కడ బస చెయ్యాలో అన్నీ ముక్తసరిగా ‘అవును’, ‘కాదు’ అన్న పదాలు తప్ప నిఘంటువులో మిగతా పదాలు ఆట్టే వాడకుండా చెప్పాడు. ఒక్క పదం మాత్రం నా దృష్టిని ఆకట్టుకుంది – ‘గర్దార్’.

ఈ గర్దార్ ఎక్కడుందో నని మ్యాపులో చూశాను. వాల్ ఫోర్డ్ కాలువ గట్టున అదో చిన్న ఊరు. అది రెయిక్యావిక్ నుండి నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అదే మామయ్యకి చూపించాను.

“నాలుగు మైళ్లేనా?” అదిరిపోయాడు మామయ్య. “మొత్తం ఇరవై ఎనిమిది మైళ్లలో ఇంతవరకు వచ్చింది నాలుగు మైళ్లేనా?”
ఆ విషయం గురించే గైడు ని పిలిచి ఏదో అనబోయాడు మామయ్య. కాని ఆ పెద్దమనిషి వినిపించుకోకుండా బయల్దేరిపోయాడు.

అప్పట్నుంచి ఓ మూడు గంటల పాటు పాలిపోయిన పచ్చిన మీదుగా నడుస్తూ ‘కోలా ఫోర్డ్’ కాలువని చేరుకున్నాం. ఆ కాలువ వెంట కాస్త దూరం పోగానే యూల్బర్గ్ అనే ఊరు చేరాం. అది చర్చి ప్రధానంగా గల ఓ పారిష్ నగరం. అక్కడ చర్చికి పెద్ద గోడ గడియారం లేదు గాని ఉంటే ఆ సమయంలో మధ్యాహ్నం పన్నెండు కొట్టి ఉండేది. అక్కడ మా గుర్రాలకి మేత వెయ్యడం జరిగింది.

మా ప్రయాణం మళ్లీ మొదలయ్యింది. ఒక పక్క దుర్గమ దుర్గాలు. మరో పక్క దుస్తర సముద్రం. మధ్యలో ఇరుకు దారిన నెమ్మదిగా పురోగమించాం. సాయంకాలం నాలుగు గంటలకి వాల్ ఫోర్డ్ కి దక్షిణ తీరం చేరుకున్నాం. అప్పటికి నాలుగు మైళ్ల దూరం వచ్చాం. అంటే అవి ఐస్లాండ్ మైళ్లు. బ్రిటిష్ ప్రమాణాల బట్టి అవి ఇరవై నాలుగు మైళ్లతో సమానం*.

(* ఒక ఐస్లాండ్ మైలు = ఆరు బ్రిటిష్ మైళ్లు)

ఆ ప్రాంతంలో ఆ కాలువ వెడల్పు కనీసం మూడు ఇంగ్లీష్ మైళ్ల వెడల్పు ఉంటుంది. కెరటాలు ఉవ్వెత్తున లేచి తీరం మీద ఉన్న కరకు శిలల మీద పడి అల్లకల్లోలం అవుతున్నాయి. ఆ కాలువ ద్వీపం యొక్క కేంద్ర ప్రాంతం లోకి చొచ్చుకు పోతోంది. కాలువకి ఇరుపక్కలా రెండు వేల అడుగుల ఎత్తుగల శిలా స్తంభాలు, నేల లోంచి పొడుచుకొచ్చి ఆకాశం కేసి దూసుకుపోతున్న బరిశెల్లా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఎరుపు రంగు గల ‘టఫ్’ రాతి పొరల మధ్య గోధుమ రంగు స్తరాలు ఆ ప్రదేశానికి ఓ విచిత్రమైన అందాన్ని ఇస్తున్నాయి.

అయితే ఆ పరిసరాల అందం ఇప్పుడు మా సమస్య కాదు. ఆ కాలువని దాటి అవతలి పక్కకి చేరాలి ఇప్పుడు. ఈ కార్యభారాన్ని పాపం మా నాలుగుకాళ్ల నేస్తాల భుజస్కంధాల మీద మోపడం ఎందుకో శ్రేయస్కరం అనిపించలేదు. అయుతే అవి కూడా దూకుడు మీద సముద్రంలోకి ఉరికే రకాల్లాగా కూడా ఏమీ కనిపించలేదు. అనవసరంగా వాటిని రెచ్చగొట్టడం ఎందుకులే అని ఊరుకున్నాను.

కాని మామయ్య ఊరుకుంటేగా? నీటి అంచు వరకు తన గుర్రాన్ని అదిలించాడు. యజమాని అజమాయిషీ చేస్తున్నాడు కదా పోనీ అని తను ఎక్కిన ‘పోనీ’ కొంచెం ముందుకి వంగి, ఓ సారి కెరటాలని పరీక్షించి ఆగిపోయింది. మామయ్య అక్కడితో ఆగక దాని డొక్కలో గట్టిగా నొక్కాడు. అది ససేమిరా కదలనని మొరాయించింది. మనుషులకి అర్థమయ్యే రీతిలో తల అడ్డుగా అటు ఇటు ఊపింది. మామయ్య అహం దెబ్బ తింది. గుర్రపు తిట్ల దండకం అందుకున్నాడు. కొరడా ఝుళిపించాడు. ఇక లాభం లేదని పాపం ఆ గుర్రం మోకాళ్లు మడిచి, కాస్త వంగి, మామయ్య కింద నుండి చల్లగా జారుకుని తప్పించుకుంది.
ఒక్క క్షణంలో అశ్వపతి హోదా నుండి మామూలు సిపాయి హోదాకి దిగిపోయినందుకు మామయ్య అహం మళ్లీ దెబ్బతింది. “పాపిష్టి దానా!” అంటూ రంకె వేశాడు.

“ఫార్యా…” అన్నాడు ఇంతలో మా గైడు, మామయ్య భుజాన్ని తాకుతూ.
“ఏంటీ? పడవా? ఎక్కడా?” మామయ్య ఆదుర్దాగా అడిగాడు.
హన్స్ అల్లంత దూరంలో ఉన్న పడవని వేల్తో చూపించాడు.
“అవునవును. పడవే!” ఉత్సాహంగా అరిచాను.
“అదేదో ముందే చెప్పొచ్చు కదయ్యా బాబు!” మామయ్య కాస్త విసుగ్గా అన్నాడు.

“టిడ్వాటెన్…” అన్నాడు గైడు ఈసారి.
ఈ పెద్దమనిషి ఇలా డేనిష్ భాషలో చంపడం చిరాగ్గా ఉంది. ఇక మామయ్య ప్రపంచంలో భాషలన్నీ తనకే తెలిసినట్టు అనువదించేయడం చెడ్డ మంటగా కూడా వుంది.

“ఏవంటున్నాడు?” నీరసంగా అడిగాను.
“ ‘కెరటాలు’ అంటున్నాడు.”
“అవునవును. కెరటాల కోసం ఆగొద్దూ మరి?”
“ఫొర్బిడా…” అడిగాడు మామయ్య. ప్రతాపం చూపించేస్తున్నాడు మామయ్య. ‘అంతేనంటావా?’ అని బేరం ఆడుతున్నాడు కాబోలు.
“యా!” ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు హన్స్.

ఈ ముక్క అర్థమయ్యింది.

నీటి మట్టం సరైన ఎత్తుకి వచ్చిన దాక ఎదురుచూడాలి. కెరటం మరీ ఎత్తుకి లేస్తే, పడవ అవతలి గట్టుకి చేరే బదులు సముద్రంలో కొట్టుకుపోతుంది. మట్టం మరీ అడుగంటితే పడవ నేలలో దిగబడిపోయే ప్రమాదం ఉంది.


ఆ సుముహూర్తం సాయంత్రం ఆరు గంటలకి వచ్చింది. మామయ్య, నేను, మా గైడు, మరి ఇద్దరు ప్రయాణీకులు, నాలుగు గుర్రాలు – అందరం ఓ పెళుసైన తెప్ప మీదకి ఎక్కాం. ఎల్బే నది మీద స్టీమర్లలో తిరిగినవాణ్ణి. ఈ తెప్ప మీద ప్రయాణం ఓ సహన పరీక్షే అయ్యింది. కాలువ దాటడానికి మొత్తం గంట పట్టింది. అయితే ఏ అవాంతరమూ జరక్కుండా ఆవలి గట్టుని చేరుకున్నాం.

మరో అరగంటలో గర్దార్ నగరాన్ని చేరుకున్నాం.
(పన్నెండవ అధ్యాయం సమాప్తం)


Image credits:


0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

  • Total Posts: 1105
  • Total Comments: 1564
Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts