శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఆర్కిటిక్ వృత్తం వద్ద మజిలీ (పాతాళానికి ప్రయాణం - 36)

Posted by శ్రీనివాస చక్రవర్తి Sunday, November 27, 2011


అధ్యాయం - 13
ఆర్కిటిక్ వృత్తం వద్ద మజిలీ (పాతాళానికి ప్రయాణం - 36)
అది రాత్రి కావలసిన సమయం. కాని 65 అక్షాంశ రేఖ వద్ద నడిరేయి ధృవకాంతిలో లోకం అంతా తేటతెల్లంగా కనిపిస్తోంది. జూన్, జులై నెలలలో ఐస్లాండ్ లో సూర్యాస్తమయం అనేది జరగని పని.

కాని ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంది. నాకైతే చలి తీవ్రత కన్నా ఆకలి తీవ్రత మరింత యాతన పెడుతోంది. మాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకున్న రైతు ఉండే ఇల్లు అల్లంత దూరంలో కనిపించగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది.పేరుకి అది రైతు ఇల్లేగాని మాకు అక్కడ జరిగింది రాచ మర్యాదే. మేము ఆ గడప తొక్క గానే ఇంటి యాజమాని వచ్చి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. ఇక ఎక్కువ ఆర్భాటం లేకుండా తనని అనుసరించమని మాకు సంజ్ఞ చేసి వడిగా నడుచుకుంటూ పోయాడు.

ఆ సన్నని, చీకటి బాటలో తన పక్కనే నడిచి వెళ్ళడం అసాధ్యం. కనుక అతడు చెప్పినట్టే తన వెనుకే అనుసరిస్తూ పోయాం. ఆ భవనం ఇంచుమించు చదరపు ఆకరంలో ఉండే చెక్క పలకలతో తయారు చెయ్యబడి ఉంది. దారికి ఇరుపక్కలా నాలుగు గదులు ఉన్నాయి. ఒక వంట గది, ఓ బట్టలు నేసే గది, ఓ పడగ్గది, ఓ అతిథుల అది. అన్నిటికన్నా అతిథుల గదే కాస్త బావుంది. ఈ ఇల్లు కచ్చితంగా మా మామయ్యని దృష్టిలో పెట్టుకుని కట్టినది కాదని నాకు త్వరలోనే అర్థమయ్యింది. ద్వారబంధాలు బాగా కిందికి ఉండడం వల్ల మామయ్య తల అప్పటికే నాలుగు సార్లు గుమ్మానికి కొట్టుకుంది.

మాకు ఉండడానికి ఇచ్చిన గది విశాలంగానే ఉంది. నేల గచ్చునేల కాదు. గట్టిగా నొక్కిన మట్టి నేల. కిటికీ లోంచి పడే వెలుగులో గదిలో వస్తువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎర్రని చెక్క చట్రాల మధ్య కాస్తంత ఎండు గడ్డి పరచబడింది. ఇదే మా హంసతూలిక తల్పం! ఆ చెక్క ‘పక్క’ మీద ఏవో ఐస్లాండి అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. అయితే ఈ మాత్రం భాగ్యానికి కూడా నోచుకుంటాం అనుకోలేదు ముందు. కాని అవతల వంట గదిలోంచి వస్తున్న ఎండుచేపల కంపు, వేలడదీసిన మాంసపు వాసన నాకు దక్కిన కొద్దిపాటి అదృష్టాన్ని కుడా వమ్ము చేశాయి.

మేం సామాన్లు విప్పుతుంటే వంటగది లోంచి మాకు ఆతిథ్యం ఇస్తున్న రైతన్న పిలుపు వినిపించింది. భోజనానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఒక్క వంటగదిలోనే మంట వుంది. చలి ఎంత విపరీతంగా ఉన్నా ఆ ఒక్క గదిలోనే నిప్పు రాజేస్తారట.మామయ్య వెంటనే లేచి వంటగది వైపు వెళ్లాడు. నేను కూడా ఆయన వెంటే వెళ్లాను.

వంటగదిలో పాతకాలపు పొగగొట్టం ఉంది. గది మధ్యలో పొయ్యి వుంది. దానికి సరిగ్గా పైన చూరులో ఓ రంధ్రం వుంది. భోజనాలు కూడా వంటగదిలోనే చెయ్యాలి.

మేం వంటగదిలోకి అడుగుపెట్టగానే మమ్మల్ని మొట్టమొదటి సారిగా చూస్తున్నట్టు “సేల్వెర్టూ” అన్న పదంతో ఎంతో మర్యాదగా సంబోధించాడు. ఆ మాటకి “సుఖీభవ” అని అర్థం చెప్పుకోవచ్చు. అలా సంబోధించి మా మీదకి వంగి బుగ్గల మీద చుంబించాడు!

ఆయన వెనుకే ఆయన భార్య కూడా వచ్చి అదే కర్మకాండని తను కూడా శాస్త్రోక్తంగా అమలు చేసింది! తరువాత ఇద్దరూ చేతులు జోడించి మాకు వినమ్రంగా నమస్కరించారు.

చెప్తే నమ్మరుగాని ఆ రైతు భార్య పందొమ్మిదిమంది పిల్లలని కన్న తల్లి! ఇంతలేసి వారు, అంతలేసి వాళ్లూ అంతా బిలబిల మంటూ వంటగదిలో తల్లి చుట్టూ మూగారు. పొయ్యి లోంచి వచ్చే దట్టమైన పొగ మాటున ఆగాగి కనిపిస్తున్న ఆ పిల్లల ముఖాలు మాతొ దోబూచులు ఆడుతున్నట్టుగా ఉన్నాయి.నేను, మామయ్య ఆ పిల్లలని అభిమానంగా చేరదీశాం. కాసేపట్లోనే ఆ బుడుతలు మా భుజాల మీద, ఒళ్లోను, మోకాళ్ల మీద ఇలా ఎవరి వీలుని బట్టి వాళ్లు సముచితాసనాలు ఆక్రమించుకున్నారు. వారిలో కాస్త పెద్ద పిల్లలు “సెల్వెర్టూ” అని చిలకల్లా వల్లెవేయసాగారు. అలా వల్లెవేయలేని వారు వట్టి కేకలతో, కేరింతలతో సరిపెట్టుకున్నారు.

భోజనాకి వేళ్లయ్యింది అన్న ప్రకటనతో ఆ బృందగానం ఆగింది. అప్పుడే మా హన్స్ కూడా లోపలికి ప్రవేశించాడు. గుర్రాలకి మేత వేసి వస్తున్నాడు. మేత వెయ్యడం అంటే మరేం లేదు. కట్లు విప్పి బయట బయళ్లలో వొదిలేయడమే. బయళ్ళు అంటే పచ్చని చేలు ఊచించుకుంటున్నారేమో. కాదు. అతి చల్లని ఎడారి భూమి మీద అక్కడక్కడ మొలిచిన పలచని గడ్డి. ఆ గడ్డి కోసం గాలించి, నేల లోంచి పెరికి, మేసి ఆ గుర్రాలు తమ కడుపు నింపుకోవాలి.“సెల్వెర్టూ” అన్నాడు హన్స్ ఆ బృందాన్ని చూసి.అక్కడితో ఆగక ఎంతో శ్రధ్ధతో, క్రమశిక్షణతో ఆ ఇంటి యజమాని మీద, ఇంటి ఇల్లాలి మీద, ముద్దులొకికే వారి నవదశ సంతానం మీద లెక్క పద్దు లేకుండా ముద్దులు కురిపించాడు!బృందం, అంటే మొత్తం ఇరవై నాలుగు మందిమి, ఓ బల్ల చుట్టూ భోజనానికి కూర్చున్నాం. అంత మందీ పక్కపక్కగా కూర్చోవడం భౌతికంగా అసాధ్యం కనుక ఒకరి మీద ఒకరం కూర్చున్నాం. మోకాళ్ళ మీద కేవలం ఇద్దరు బడుధ్ధాయిల మోతతో బతికిపోయినవాడు ధన్యుడు!

సూప్ రంగప్రవేశం చెయ్యగానే గదిలో ఓ కమ్మని నిశ్శబ్దం నెలకొంది. అసలే ఈ దేశంలో జనం పెద్దగా మాట్లాడే రకాలు కారు. లిచెన్ అనబడే ఒక రకమైన నాచుతో చేసిన సూప్ ఘుమఘుమలు గది మొత్తం నిండిపోయాయి. సూప్ కాస్త కొత్తగా ఉంది. పూర్తిగా బాలేదనడానికి కూడా లేదు. దాని తరువాత పులియబెట్టిన (rancid) వెన్నలో తేలాడుతున్న ఎండుచేపలు ఉన్న గిన్న ఒకటి మా ముందుకి వచ్చింది. ఆ వెన్న తీసింది, నిన్న, నేడు కాదట! ఇరవయ్యేళ్ల కిందటి వెన్నట! ఐస్లాండ్ పాక సాంప్రదాయంలో ఇలాంటి వెన్న చాలా అపురూపమట. ఆ తరువాత ఓ జున్ను లాంటి పదార్థం, కొన్ని బిస్కట్లు, ఆరగించాం. బెర్రీ పళ్ల నుండీ తీసిన ఏదో రసం సేవించాం. తరువాత పాలు, నీళ్లు కలిసిన ఏదో పలచని పదార్థం సాక్షాత్కరించింది. దీనికి ‘బ్లాండా’ అని ఓ పేరు కూడాను. మొత్తం మీద భోజనం బావుందా లేదా అనడిగితే ఉన్నపళంగా చెప్పమంటే కష్టం. బాగా ఆకలి మీద ఉన్నానో ఏమో, ఆఖర్లో గోధుమ పాలతో చేసిన ఏదో తీయని పానీయం వస్తే దాని రంగు, రుచి, వాసన కూడా చూడకుండా గటగటా తాగేశాను.

ఎట్టకేలకు భోజనం పూర్తయ్యింది. పిల్లలు మెల్లగా అక్కణ్ణుంచి వాళ్ల గదిలోకి వెళ్లిపోయారు. పెద్దలంతా చలిమంట చుట్టూ మూగారు. పిడకలు, చేప ఎముకలు మొదలుకొని నానా రకాల గడ్డిగాదరా పోగేసి,నిప్పు రాజేశారు. పార్థివ దేహం కాస్త వెచ్చబడ్డాక నెమ్మదిగా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయారు. ఐస్లాండ్ సాంప్రదాయం ప్రకారం అతిథులకి బట్టలు మార్చే బాధ్యత కూడా ఇంటి ఇల్లాలిదేనట! మాకు గుండె గుభేలు మంది. “అయ్యో మీకెందుకండీ శ్రమ!” అంటూ ఆవిణ్ణి మర్యాదగా సాగనంపాం. ఆవిడ మరు మాట్లాడకుండా వెళ్లిపోయింది.ఒక్కసారిగా బడలిక క్రమ్ముకుంది. ఆ విచిత్ర పరిసరాల మధ్య, గుచ్చుకునే పచ్చిక పక్క మీద వాలి క్షణంలో గాఢ నిద్రలోకి జారుకున్నాను.


(ఇంకా వుంది)


0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email