జాన్ హోల్ట్
(1923- 1985) ఓ పేరు మోసిన
అమెరికన్ విద్యావేత్త.
అతడు పిల్లలని
ఎంతగానో ప్రేమించాడు. పిల్లలు తమ చుట్టూ ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం, దాని
గురించి నేర్చుకోవడం కోసం చేసే ప్రయాసని బాగా అర్థం చేసుకున్నాడు. ఆ ప్రయాసే అసలు చదువు
అని తెలుసుకున్నాడు. పిల్లలు తమ పరిసరాల గురించి నేర్చుకోవడంలో కాస్తంత దోహదం చెయ్యడమే
పెద్దల కర్తవ్యం అంటాడు. అంతకు మించి పిల్లల సహజ వృద్ధి క్రమంలో పెద్దలు అతిగా జోక్యం
చేసుకుంటే పిల్లల ఎదుగుదలకి హాని చెయ్యడం తప్ప ఏమీ ఉండదు అంటాడు.
పిల్లలు నేర్చుకోవడానికి
సంబంధించి జాన్ హోల్ట్ తన అవగాహన అంతటినీ ఈ పుస్తకంలో రంగరించాడు. ‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు?’
(How children learn?), ‘పిల్లలు ఎలా వెనకబడతారు?’ (How children fail?) అనే పుస్తకాల
రచయితగా బాగా ఆదరణ పొందిన హోల్ట్, ఈ పుస్తకంలో పిల్లలు ఇంటిదగ్గర చదవడం, రాయడం, లెక్కలు
చెయ్యడం మొదలైనవి ఎలా నేర్చుకుంటారో వర్ణిస్తాడు. ఈ అద్భుతమైన ప్రక్రియను పెద్దవాళ్లు
ఎలా గౌరవించాలో, ఎలా ప్రోత్సహించాలో తెలియజేస్తాడు. మానవులకి నేర్చుకోవడం అన్నది ఊపిరి
తీసుకోవడమంత సహజమని మరోసారి గుర్తుచేస్తాడు.
పిల్లల చదువు
పట్ల, పిల్లల అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.
ఈ ఆధునిక తరం తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు చదివి ఆచరించదగ్గ ఒక మంచి పుస్తకం.