శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



డార్విన్ కి తన యాత్రల నుండి తిరిగి తెచ్చుకున్న సరంజామాని, సమాచారాన్ని విశ్లేషించగా ఒక్క విషయం మాత్రం తేటతెల్లంగా కనిపించింది. జీవపరిణామం అనేది వాస్తవం. జీవజాతులు క్రమంగా మార్పుకి లోనవుతున్నాయి. అయితే ఆ మార్పుని కలుగజేస్తున్న శక్తి ఏంటో తనకి మొదట అర్థం కాలేదు. అందుకు కారణాల కోసం ఆలోచించగా తనకి తట్టిన మొట్టమొదటి కారణం ఇది.




ఎన్నో రకాల భూభౌతిక శక్తుల ప్రభావం వల్ల భూమి యొక్క ఉపరితలం, పర్యావరణం క్రమంగా మార్పుకి లోనవుతున్నాయి. మారుతున్న పృథ్వీ పరిస్థితులకి తట్టుకుని మనగలగడానికి, జీవ జాతులు కూడా తగు రీతుల్లో మారుతూ పోవాలి. ఆ మార్పుకి తగ్గట్టుగా తమ జీవన సరళిని, చేష్టలని, ప్రవర్తనని, అలవాట్లని మార్చుకోవాలి. అలవాటుగా కొన్ని చేష్టలు చేస్తున్నప్పుడు అందుకు అనుగుణంగా శరీరంలో కూడా కొన్ని దీర్ఘకాలిక మార్పులు వస్తాయని భావించాడు డార్విన్. ఆ మార్పులే తదనంతరం తరువాతి తరానికి సంక్రమిస్తాయని అనుకున్నాడు. ఈ రకమైన జీవపరిణామాన్ని మొట్టమొదట ఊహించినవాడు ఫ్రెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త లామార్క్ (చిత్రం). జీవజాతులలో వచ్చే మార్పుల విషయంలో లమార్క్ రెండు సూత్రాలు ప్రతిపాదించాడు. శరీరంలో ఏదైనా అంగాన్ని అతిగా వాడినప్పుడు ఆ అంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది అని మొదటి సూత్రం చెప్తుంది. అలా ఒక ప్రాణిలో వచ్చిన మార్పు తదనంతరం దాని సంతతికి సంక్రమించే అవకాశం ఉంది అంటుంది రెండవ సూత్రం. అయితే ఈ తీరులో అనువంశికంగా లక్షణాలు సంక్రమించవని ఆధునిక జన్యు శాస్త్రం (జెనెటిక్స్) చెప్తుంది. కాని లామార్క్ చెప్పిన తప్పుడు భావననే డార్విన్ స్వీకరించాడు.

భూమి మీద పరిస్థితులు నిరంతరం మారుతుంటాయి గనుక, ఆ మార్పుకు అలవాటు పడ్డ జంతు శరీరాలలో తదనుగుణమైన మర్పులు వస్తుంటాయి గనుక, ఒక తరం జంతువులలో వచ్చిన మార్పులు తదుపరి తరానికి సంక్రమిస్తుంటాయి కనుక భూమి మీద మారే పరిస్థితులే పరిణామాన్ని ప్రేరించే ప్రముఖ శక్తులుగా డార్విన్ కి కనిపించాయి.



జీవ జాతుల లక్షణాలలో మార్పు కలుగుజేసే మరో శక్తిని కూడా డార్విన్ గుర్తించాడు. పిల్లలకి వారి తల్లిదండ్రుల పోలికలు వస్తాయన్నది అందరికీ తెలిసిన విషయం. అలాగని పిల్లలు అచ్చం వారి తల్లిదండ్రుల మాదిరిగానే (కూతుళ్ళందరూ వారి తల్లి లాగానో, కొడుకులు అందరూ వారి తండ్రి లాగానో) ఉండరు. తల్లిదండ్రులలో లేని కొన్ని లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తాయి. ఒక మొక్క యొక్క కొమ్మని నరికి, దాన్ని నాటగా పుట్టిన మొక్క అచ్చం దాని తల్లి మొక్కకి మల్లె ఉంటుంది. అలా కాకుండా రెండు మొక్కల మధ్య పరాగ సంపర్కం చేత పూవులు పుష్పించి, ఫలించి, విత్తనాలు పుట్టి, ఆ విత్తనాలు మళ్లీ మొక్కలైనప్పుడు, అలా పుట్టిన మొక్కలకి, వాటి ‘తల్లి, దండ్రులకి’ మధ్య ఎన్నో తేడాలు కనిపించాయి. కనుక జీవప్రపంచంలో లైంగిక పునరుత్పత్తి వల్ల జీవజాతులలో అనుకోని వైవిధ్యం ప్రవేశిస్తోందని గుర్తించాడు డార్విన్.



ఆ విధంగా జీవజాతులలో ఒక తరం నుండి మరో తరానికి మార్పు రావడం వెనుక ఉన్న కారణాలు గుర్తించాడు డార్విన్. కాని మరో ప్రశ్న మిగిలిపోయింది. ఈ మార్పులన్నీ ఎటు పోతున్నాయి? జీవ పరిణామానికి ఏదైనా చరమ లక్ష్యం ఉందా? ఈ ప్రశ్నకి కారణాలు డార్విన్ కి మరో సందర్భంలో కనిపించాయి. రైతులు, తోటమాలులు, పశువుల కాపర్లు – వీళ్ల వృత్తులకి సంబంధించిన వ్యవహారాలతో డార్విన్ కి చాలా పరిచయం ఉండేది. పశువులని పెంచుకునే వాడు బాగా పాలిచ్చి, దీర్ఘ కాలం బతికి, సులభంగా వ్యధులకి లోను కాని ఆవులు ఉంటే బాగుణ్ణు అనుకుంటాడు. ప్రకృతి సాధించినట్టుగా జీవజాతులలో గొప్ప వైవిధ్యాన్ని అతడు సాధించలేడు. అందుకు ఒక ముఖ్యమైన కారణం సమయం లేకపోవడం. ప్రకృతి జీవజాతులలో మార్పులని నెమ్మదిగా లక్షల సంవత్సరాలుగా సాధిస్తుంది. కాని పశువుల కాపరి తన జీవితకాలంలో ఆ మార్పులు చూడగోరుతాడు. కనుక తను చెయ్యగిలింది ఒక్కటే. మేలు జాతి పశువులని తెచ్చి, అవి కలిసేట్టు చేస్తే, వాటి సంతతి కూడా మేలు జాతికి చెందినది అయ్యే అవకాశం ఉంటుంది. అలా పుట్టిన పశువుల జాతులు నాలుగు కాలాల పాటు మన్నుతాయి.



కనుక పశువుల కాపర్లు చేసే కృత్రిమ ఎంపిక చేత పశువుల జాతులలో కొన్ని ఉపజాతులు అధికంగా వృద్ధి చెందుతాయి, మరి కొన్ని అంతరించిపోయాయి. పశువుల కాపర్లు చేసే కృత్రిమ ఎంపికను పోలిన ఏంపికే ప్రకృతి జీవజాతుల విషయంలో చేస్తోంది. అంటే ప్రకృతి పనిగట్టుకుని తనకి నచ్చిన జీవాలని బతికించి, నచ్చని వాటిని ఏరివేస్తోందని కాదు. జీవజాతులు ప్రకృతి లోని వనరుల కోసం పోటీ పడతాయి. వనరులు పరిమితమైనవి కనుక పోటీలో నెగ్గిన జీవజాతులు మరింత సమర్ధవంతంగా భూమి మీద మనగలిగే అవకాశం ఉంది. కనుక పరిమితమైన సహజ వనరుల కోసం జీవజాతులు పడే పోటీయే ఒక విధమైన సహజ, ప్రకృతిసిద్ధమైన ఎంపికగా జీవ జాతుల మీద పని చేస్తోందని అర్థం చేసుకున్నాడు డార్విన్.



ఈ అవగాహనతో డార్విన్ తన సిద్ధాంతంలో బాగా పురోగమించాడు. అయితే ఈ ‘సహజ ఎంపిక’ అన్న భావన యొక్క ప్రాముఖ్యత డార్విన్ మరింత లోతుగా తెలుసుకునేలా చేసిన పుస్తకం ఒకటి ఉంది. జనాభా వృద్ధిలో క్రమం గురించి మాల్థస్ రాసిన పుస్తకం ఒకటి 1838 లో డార్విన్ కంటపడింది. ఏ విధమైన అవరోధమూ లేకపోతే ప్రపంచ జనాభా ఇరవై ఐదేళ్ల కి ఒకసారి రెండింతలు అవ్వాలి. కాని వ్యాధి, మరణం, యుద్ధం, ప్రకృతిలో ఉత్పాతాలు మొదలైన పరిణామాల వల్ల జనాభ వృధ్ధి చెందే వేగం అంతకన్నా తక్కువగానే ఉంటుంది. జనాభా అతిగా పెరిగినప్పుడు యుద్ధం, వ్యాధి, సహజ విపత్తులు మొదలైన కారణాల వల్ల జనాభా తగ్గుతుంది. జనాభా ఆ విధమైన సహజ పరిస్థితుల్లో తగ్గాలే గాని, కృత్రిమమైన సంక్షేమ పథకాల వల్ల జనాభాని అరికట్టడానికి ప్రయత్నిస్తే అది బెడిసి కొడుతుంది అంటాడు మాల్థస్.



ఈ భావాలు మొదట్లో డార్విన్ కి అంతగా రుచించకపోయినా, మాల్థస్ భావాలకి జీవపరిణామానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్న డార్విన్ మహదానందం చెందాడు.



(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts