శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


(చాలా కాలం క్రిందట నిలిపేసిన ‘పాతాళంలో ప్రయాణం’ సీలియల్ ని మళ్లీ కొనసగిస్తున్నాం.)

అధ్యాయం 12
నిర్జన భూమి

ఆకాశం మేఘావృతమై ఉంది. కాని నిశ్చలంగా ఉంది. మరీ వెచ్చగానూ లేదు. అలాగని వర్షం కూడా లేదు. ఇలాంటి వాతావరణం కోసమే పర్యాటకులు పడి చస్తారు.


ఈ కొత్త, విచిత్ర ప్రపంచంలో గుర్రం మీద స్వారీ అంటే నాకు మొదట్నుంచి భలే ఉత్సాహంగా అనిపించింది. ఓహో, ఏం హాయి? ఎంత ఆనందం? అందుకే ఈ అశ్వారూఢానందంలో పీకల్దాకా మునిగిపోయాను!


“అసలైనా ఆలోచించి చూస్తే, గుర్రం మీద స్వారీ చెయ్యడం వల్ల పెద్దగా మునిగిపోయింది ఏవుందో నాకైతే అర్థం కాలేదు.
అందమైన పరిసరాలలో హాయిగా ముందుకి సాగిపోతాం. మహా అయితే ఓ కొండ ఎక్కుతాం. అంతగా అయితే ఓ పాత బిలం లోంచి కిందకి దిగుతాం. అంతేగా? ఆ సాక్నుస్సేమ్ మాత్రం ఇంతకన్నా పొడిచేసిందేంవుంది? ఇక భూమి కేంద్రం దాకా తీసుకుపోయే దారి సంగతి అంటారా? నన్నడిగితే అంతా వట్టి కాకమ్మకథ! అదంతా జరిగే పని కాదు. లేని దాని గురించి ఇలాంటి చక్కని సన్నివేశంలో ఆలోచించి మనసు పాడుచేసుకోవడం మంచిది కాదు.” ఈ తీరులో నా ఆలోచనలు ఆగాయి.

నా ఆలోచనలు ఒక పక్క అలా సాగుతుంటే మేం రెయిక్యావిక్ పొలిమేరలు చేరుకున్నాం.
హన్స్ మాకు కొంచెం ముందుగా వేగంగా నడుస్తున్నాడు. అతని వెనకే సామాన్లు మోస్తున్న గుర్రాలు బుధ్ధిగా నడుస్తున్నాయి. వాటి వెనుక మామయ్య, ఆయన వెనుక నేను…గుర్రాల మీద…

యూరొప్ లో కెల్లా అతి పెద్ద దీవుల్లో ఐస్లాండ్ ఒకటి. దానిది పద్నాలుగు వేల చదరపు మైళ్ల విస్తీర్ణత. జనాభా పదహారు వేలు. భౌగోళికులు దాన్ని నాలుగు విభాగాలుగా విభజించారు. వాటిలో ‘దక్షిణ-పశ్చిమ’ విభాగమైన ‘ సూడ్వెస్టర్ ఫోర్డ్యుంగర్’ ని కోసుకుంటూ ముందుకు సాగిపోతున్నాం.

రెయిక్యావిక్ పొలిమేరలు దాటాక హన్స్ మమ్మల్ని తీరం వెంట తీసుకుపోయాడు. అల్లంత దూరంలో ఆకుపచ్చగా కనిపించాలనుకుని బయల్దేరిన బయళ్లు వీల్లేక పసుపుపచ్చకి దిగాయి. ట్రాకైట్ శిలతో చేయబడ్డ ఎత్తైన శిఖరాల రూపురేఖలు తూరుపు ఆకాశంలో లీలగా కనిపిస్తున్నాయి. కొండల వాలు మీద అక్కడక్కడ మంచు ముద్దలు మురిపెంగా అద్దినట్టు ఉన్నాయి. ఆ మంచు మీద పడ్డ కాంతుల తళుకులు ఆ లోకాన్ని వింతగా ప్రకాశింపజేస్తున్నాయి. ఇక కొన్ని శిఖరాలైతే దూకుడు మీద మబ్బులని ఛేదించుకుని ఆ పైనున్న స్వర్లోకపు సొగసులని ఆత్రంగా చూస్తున్నాయి.

కొన్ని చోట్ల ఈ కరకు శిలాశ్రేణులు నేరుగా సముద్రంలోకే అడుగుపెట్టి, తీరం మీద ఉన్న కాస్తంత పచ్చిక కూడా కనిపించకుండా చేస్తున్నాయి. అలాంటి చోట్ల తీరం మీద ముందుకి సాగడం కష్టం అవుతోంది. అయినా మా గుర్రాలకి ఈ దారులన్నీ కొట్టినపిండి లాగుంది. మామయ్యకి తన గుర్రాన్ని డొక్కల్లో తన్నడం, కొరడాతో కొట్టడం, రెంకెలెయ్యడం మొదలైన విన్యాసాలు చెయ్యొద్దని ముందుగా హెచ్చరిక వచ్చింది. నోరు (చెయ్యి, కాలు కూడా) మెదపకుండా గుర్రం మీద బుధ్ధిగా కూర్చున్నాడు. చెట్టంత మనిషి అలా ఆ చిన్ని పోనీ మీద కూర్చుని ఉంటే, కింద కాళ్లు నేలకి తగులుతుంటే, ఓ విచిత్రమైన ఆరుకాళ్ల కీటకంలా కనిపించి చూస్తేనే నవ్వొస్తోంది.

“బంగారు గుర్రం! బహు చక్కని గుర్రం!” అంటూ మామయ్య మొదలెట్టగానే అనుకున్నాను గుర్రం మీద ఉపన్యాసం తన్నుకొస్తోందని. “చూశావా, ఏక్సెల్. ఈ ఐస్లాండ్ గుర్రం కన్నా మొండి గుర్రం ఉంటుందని అనుకోను. మంచు గాని, తుఫాను గాని, ఇరుకు దారులు గాని, కరకు శిలలు గాని, హిమానీ నదాలు గాని – ఏదీ దీన్ని ఆపలేదు. ఎప్పుడూ అడుగు తడబడదు. ముందుకు పోనని మొరాయించదు. ఏ చిట్టేరునో దాటాలన్నా ముందు వెనక చూడకుండా అందులో దూకి ఆదరాబాదరాగా ఆవలి గట్టుకి ఈదుకుపోతుంది. ఆ క్షణం ఓ ఉభయచరంలాగా మారిపోతుంది. దాన్ని తొందర పెడితే లాభం ఉండదు. తన ఓపికని బట్టి సాఫీగా ముందుకు పోనిస్తే రోజుకి ముప్పై మైళ్లయినా సజావుగా ముందుకు సాగిపోతుంది.”

“మన సంగతి బాగే వుంది. కాని మన గైడు సంగతేంటి?”


“ఓహ్! తనకేం భయం లేదు. తన విషయం అసలు ఆలోచించకు. తను చూడబోతే ఎంత దూరమైనా సులభంగా నడిచేసేట్టు ఉన్నాడు. పైగా ఒక్క నడక తప్ప తను మరింకేం చేస్తున్నాడనీ! అంతగా కావలిస్తే నా గుర్రాన్ని అతడికి ఇస్తాను. ఇలా గుర్రం మీద కుదేసినట్టు ఎంతసేపని కూర్చోను? కాస్త దిగి నడిస్తే హాయిగా ఉంటుంది.”

మా బృందం వేగంగానే ముందుకి సాగిపోతోంది. చుట్టూ ఎడారి భూమిలా ఉంది. అక్కడక్కడ విసిరేసినట్టు పూరి గుడిసెలు కనిపిస్తున్నాయి. చెక్కతో గాని, బురదతో గాని, గట్టిపడ్డ లావా రాయితో గాని చెయ్యబడ్డ ఇళ్ళవి. ఆ దారిన పర్యాటకులు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆ ఇళ్లలో మనుషులు ఎదురుచూస్తారు కాబోలు. ఆ ప్రాంతంలో బయటి వారు రావడం బాగా అరుదు. అసలక్కడ పెద్దగా దారులు కూడా ఉండవు. అరుదుగా పడే బాటసారుల అడుగుజాడలని, మొలుచుకొచ్చే పలచని పచ్చిక కొన్నాళ్లలోనే చెరిపేస్తుంది.


కాని చిత్రం ఏంటంటే రాజధాని నుండి ఎంతో దూరంలేని ఈ ఇంచుమించు నిర్జన ప్రాంతం ఐస్లాండ్ ప్రమాణాల బట్టి చూస్తే బాగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. రాజధానికి ఇంకా దూరంగా పోతే అక్కడ ఇంకెంత నిర్జనంగా ఉంటుందో? ఇప్పటికే ఈ ప్రాంతంలో అరమైలు దూరం దాటాం. ఈ అరమైలులో ఒక్క రైతుగాని, ఒక్క గొల్లవాడు గాని కనిపిస్తే ఒట్టు. అక్కడక్కడ కొన్ని గోవులు, గొర్రెలు వాటి సంగతి అవి చూసుకుంటున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే, అల్లంత దూరంలో కనిపిస్తున్న, పేలే జ్వాలాముఖులు ఎగజిమ్మే నిప్పు శిలల భీకర తాడనానికి బద్దలై కొంకర్లు పోయిన భయంకర మరుభూమి మరింకెంత నిర్జీవంగా ఉంటుందో?



(ఇంకా వుంది)
Image credits: http://www.aaroads.com/blog/2010/03/16/iceland-ii/











2 comments

  1. Srinivas garu..thank you very much for the series.

     
  2. apude aypoyindi anipinchindi....next series gurinchi waiting

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts