ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి. అరేబియా, ఇండియన్ మహాసముద్రం ప్రాంతంలో అదో పెద్ద వ్యాపార కేంద్రంగా విలసిల్లేది.
ఆ ప్రాంతం వారు ఎక్కువ శాతం ముస్లిమ్లు. వీరికి ఎక్కువగా క్రైస్తవులైన యూరొపియన్లకి మధ్య ఎంతో కాలంగా వైరం ఉంది. స్థానికులతో వాకబు చేసి ఇండియాకి దారి ఎటో తెలుసుకోవాలి. కనుక తమ బృందం అంతా క్రైస్తవులు అన్న నిజం బయటపడకుండా వాస్కో ద గామా జాగ్రత్తపడ్డాడు. స్థానికుడైన ఓ షేక్ సహాయంతో ఇండియాకి దారి చూపగల ఇద్దరు అరబ్బీ నావికులని కుదుర్చుకున్నాడు వాస్కో. సాయం చేసినందుకు పారితోషకంగా 30 బంగారు ‘మాటికల్’ (4000) ఇచ్చాడు. ప్రయాణం తరువాత కన్నా ముందే ఇస్తే ఆ నావికులు కుటుంబీకులు సంతోషిస్తారని అలా చేశాడు. అయితే ఆ ధనం తమ కుటుంబాలకి ఇవ్వడానికి వాళ్లు ఊళ్లోకి వెళ్లాలి. వెళ్లిన వాళ్లు వస్తారో రారో అని ఒకణ్ణి మాత్రం పోనిచ్చి, రెండో వాణ్ణి ఓడలోనే అట్టేబెట్టుకున్నాడు.
ఆ వెళ్లినవాడు ఏం చేశాడో, ఏం అయ్యాడో తెలీదు. కొన్నాళ్ళ వరకు వాడి ఆచూకీ లేదు. వాడి కోసం ఎదురుచూస్తుండగా ఒక రోజు ఉన్నట్లుండి రెండు అరబ్బీ యుద్ధనౌకలు వారి ఓడల కేసి వస్తుండడం గమనించాడు వాస్కో. బహుశ తాము క్రైస్తవులమని స్థానికులకి తెలిసిపోయిందేమో? ఆ వెళ్లిన నావికుడు ఎలాగో ఆ రహస్యాన్ని తెలుసుకుని షేక్ కి తెలియజేసి ఉంటాడు. వస్తున్న అరబ్బీ నౌకలకి తగిన బుద్ధి చెప్పేందుకు గాను, చిన్న ఓడ అయిన ‘బెరియో’లో ఉన్న పాలో ద గామా, అరబ్బీ ఓడల కేసి గురి పెట్టి ఫిరంగులు పేల్చాడు. ఆ దెబ్బకి రెండు ఓడలలోని అరబ్బీ సైనికులు ఓడలని వొదిలేసి నీట్ళోకి దూకి పలాయనం చిత్తగించారు. జరిగిన గొడవ చాలనుకుని నౌకాదళం మొసాంబిక్ రేవుని వొదిలి ఇంకా ముందుకి సాగిపోయింది.
(మాలిందిలో వాస్కో స్మారక చిహ్నం)
(మాలిందిలో వాస్కో స్మారక చిహ్నం)
ఏప్రిల్ 14 నాడు నౌకాదళం కెన్యా దేశంలోని ‘మాలింది’ నగరాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం కూడా ఓ షేక్ పాలనలో ఉంది. ఇతగాడికి పోర్చుగీస్ గురించి, సముద్రయానంలో వారి సత్తా గురించి బాగా తెలుసు. వాస్కో బృందంతో స్నేహం చేస్తే తనకే మేలని గ్రహించాడు. వాస్కోని సందర్శించడానికి స్వయంగా వాస్కో ఓడకి విచ్చేశాడు. ఎన్నో విలువైన బహుమతులు తెచ్చి ఇచ్చాడు. వాస్కో ద గామా కూడా తనకి చేతనైనంతలో మంచి బహుమతులే ఇచ్చాడు. ఇండియాకి దారి చూపగల మార్గగామిని ఇచ్చి పంపుతానని షేక్ మాట ఇచ్చాడు. ఇద్దరు నేతలూ స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకున్నారు.
ఇలా కొన్నాళ్లు వరుసగా ఇరు పక్కల వాళ్లు వేడుకలు జరుపుకుంటూ విందులు విలాసాలలో మునిగితేలారు. వాస్కో ద గామాకి ఈ ఆలస్యం నచ్చలేదు. షేక్ కావాలని జాప్యం చేస్తున్నాడేమో ననిపించింది. ఒక రోజు తమ ఓడలోకి వచ్చిన షేక్ బంటుని ఒకణ్ణి పట్టుకుని బంధించాడు వాస్కో ద గామా. తనకి ఇస్తానన్న మార్గగామిని తక్షణమే పంపిస్తే గాని ఆ బంటుని వదలనని హెచ్చరిస్తూ షేక్ కి కబురు పెట్టాడు. అనవసరంగా వీళ్లతో కలహం కొని తెచ్చుకోవడం ఇష్టం లేక షేక్ వెంటనే ఓ సమర్ధుడైన మార్గగామిని పంపాడు.
ఆ మర్గగామి రాకతో వాస్కో ద గామా బృందంలో త్వరలోనే ఇండియా చేరుకుంటాం అన్న ఆశ చిగురించింది.
(ఇంకా వుంది)
0 comments