అసలు రూపాంతరీకరణ వల్ల బంగారాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యమైనా సరే, ఏ రసాయనిక ప్రయోజనమూ లేని జడ పదార్థం అయిన బంగారం కన్నా ఈ ఖనిజపు ఆసిడ్ల వల్ల మానవాళికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరుదుగా దొరుకుతుందని బంగారానికి అంత విలువగాని అదే సమృద్ధిగా దొరికేటట్టయితే దాని విలువ క్షణంలో పడిపోతుంది. కాని ఖనిజపు ఆసిడ్ల విషయం అలా కాదు. అవి ఎంత సమృద్ధిగా దొరికితే, వాటి విలువ, ప్రయోజనం అంతగా పెరుగుతుంది. కాని ఆ బంగారంలో ఏం మాయ ఉందో ఏమో? పనికొచ్చే ఆసిడ్లని పక్కన పెట్టి, ప్రయోజనం లేని బంగారాన్నే ఆరాధించారు. మరి మనుషుల తీరే అంత!
మొదట్లో కొంచెం ఆశాజనకంగా కనిపించిన పరుసవేదానికి మూడోసారి క్షీణదశ మొదలయ్యింది. గతంలో అప్పటికే గ్రీకుల తరువాత ఒకసారి, అరబ్బుల తరువాత ఒకసారి అలాంటి పతనాన్ని చవి చూసింది. పసిడి కోసం పరుగులాట ఓ పైత్యంలా దాపురించింది. మోసగాళ్ల మాట అటుంచి పదిహేడవ శతాబ్దానికి చెందిన మేధావులైన బాయిల్, న్యూటన్ లాంటి వాళ్లు కూడా ఆ ఆకర్షణకి లోనుగాకుండా ఉండలేకపోయారు.
అంతకు పూర్వం వేయేళ్ల క్రితం డయోక్లిటియన్ కాలంలో జరిగినట్టు, మరొక్కసారి పరుసవేదంలో అధ్యయనాలు నిషేధించబడ్డాయి. నిజంగా బంగారాన్ని పెద్ద ఎత్తులో ఉత్పత్తి చెయ్యడానికి వీలైతే ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకోబోయే కల్లోలం ఆ నిషేధానికి ఒక కారణం. అది కాకుండా పరుసవేదం పేరుతో జరుగుతున్న ఘరానా మోసాన్ని అరికట్టడం కూడా ఆ నిషేధంలోని ఒక ఉద్దేశం. 1317 లో పోప్ జాన్ XXII ఆ నిషేధాన్ని ప్రకటించాడు. దాని ఫలితంగా నిజంగా సత్తా ఉన్న పరుసవేదులు సమాజం కంటికి కనిపించకుండా రహస్యంగా తమ అధ్యయనాలు చేసుకోవడం మొదలెట్టారు. వారు లేని శూన్యంలో మోసగాళ్లు, దగాకోరులు రాజ్యం చేశారు.
ఇదిలా ఉండగా ఒక పక్క యూరప్ లో స్వేచ్ఛావాయువులు బలంగా వీచసాగాయి. కాన్స్టాంటినోపుల్ రాజధానిగా గల తూర్పు రోమన్ సామ్రాజ్యం (దీనికే బైజాంటైన్ సామ్రాజ్యం అని పేరు) అవసాన దశ చేరుకుంది. 1204 లో యూరొపియన్ క్రూసేడర్లు చేసిన దాడికి ఈ సామ్రాజ్యం బాగా చితికి పోయింది. ఆ ఒక్క నగరంలో మాత్రమే పదిలంగా మిగిలాయి అనుకున్న గ్రీకు సారస్వతానికి చెందిన ఆఖరు అవశేషాలు ఆ దెబ్బకి తుడిచిపెట్టుకుపోయాయి.
1261 లో ఆ నగరాన్ని గ్రీకులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. నగరం అయితే చేజిక్కింది గాని మునుపటి శోభ ఇప్పుడు లేదు. రెండ శతాబ్దాల పాటు టర్కిష్ సేనల దాడులు ఈ నగరం మీద ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి. చివరికి 1453 లో ఆ దండయాత్రలకి కాన్స్టాంటినోపుల్ లొంగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆ నగరం టార్కీ హయాంలోనే ఉండిపోయింది. కాన్స్టాంటినోపుల్ పతనం తరువాత, ముందు కూడా గ్రీకు పండితులు అక్కణ్ణుంచి పాశ్చాత్య యూరప్ కి పలాయనం అయ్యారు. వారితో పాటు వాళ్ళ గ్రంథాలయాల నుండి దొరికినంత సమాచారం మూటగట్టుకు తీసుకుపోయారు. ఆ విధంగా గ్రీకు సారస్వతానికి చెందిన కొన్ని అవశేషాలు పాశ్చాత్య యూరప్ కి దక్కాయి. కాని ఆ కాస్త పాటి జ్ఞానమే యూరప్ లో గొప్ప ప్రగతికి కారణం అయ్యింది.
(సశేషం...)
0 comments