బ్లాగర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు!
జబీర్ చేసిన ఆవిష్కరణలలో కెల్లా లోహాల రూపాంతరీకరణ (transmutation) కి సంబంధించిన అధ్యయనాలే అతి ముఖ్యమైనవి. పాదరసం ఓ అపురూమైన లోహంగా అతడు భావించేవాడు. మామూలు పరిస్థితుల్లో కూడా ద్రవరూపంలో ఉండే పాదరసంలో పార్థివ తత్వం అతి తక్కువగా ఉంటుంది అనేవాడు. సల్ఫర్ కి ఉండే ప్రత్యేక లక్షణం – జ్వలనీయత (combustibility) – అతణ్ణి ఆకట్టుకుంది. (సల్ఫర్ విషయంలో అతణ్ణి ఆకట్టుకున్న మరో లక్షణం బంగారం లాంటి దాని పచ్చని పసిమి). పాదరసాన్ని, సల్ఫర్ ని వివిధ నిష్పత్తులలో కలపితే వివిధ రకాల లోహాలు తయారు అవుతాయని అతడు అపోహ పడేవాడు. కనుక ఈ రెండు పదార్థాలని కచ్చితంగా ఏ నిష్పత్తిలో కలిపితే బంగారం పుడుతుంది అన్నదే ఇంకా తేలని ప్రశ్న. అయితే అలాంటి మిశ్రమం రూపాంతరీకరణ చెంది అందులోంచి బంగారం పుట్టడానికి మరో మూడో పదార్థం కావలసి ఉంది. అదేంటి అన్నది మరో తేలని ప్రశ్న.
అలా రూపాంతరీకరణ జరగడానికి దొహదం చేసే పదార్థం ఒక రకమైన పొడి అని ప్రాచీన సాంప్రదాయం చెప్తుంది. ఆ పొడిని గ్రీకులు “గ్సెరియాన్” (xerion) అని పిలిచేవారు. గ్సెరియాన్ అంటే గ్రీకులో “తడిలేనిది (అంటే పొడిగా ఉండేది)” అని అర్థం. దాన్ని కాస్తా అరబ్బులు “అల్-ఇక్సిర్” అని మార్చారు. అది యూరొపియన్ల భాషల్లో ఎలిక్సిర్ (elixir) అయ్యింది. కాలక్రమేణా ఆ పొడి పదార్థాన్ని ఇంగ్లీష్ లో philosopher’s stone (తత్వవేత్తల శిల) అని పిలువసాగారు. (1800 ల వరకు కూడా తత్వవేత్తలు అంటే ఆధునిక పరిభాషలో శాస్త్రవేత్తలు అన్న అర్థం ఉండేదని గుర్తుంచుకోవాలి).
నిమ్నజాతి పదార్థాలని బంగారంగా మార్చడానికి అవసరమైన ఈ ఎలిక్సిర్ కి ఇతర అద్భుతమైన లక్షణాలు ఉండేవని కూడా భావించేవారు. ఉదాహరణకి అది సర్వరోగ నివారణి అనుకునేవారు. దాని వల్ల అమరత్వం కూడా సిద్ధిస్తుందని నమ్మేవారు. ఆ విధంగా బంగారాన్ని పండించగోరిన రసాయన శాస్త్రవేత్తలు అమృతమైన జీవనాన్ని కూడా సాధించగోరుతున్నట్టు అయ్యింది.
ఆ కారణం చేత కొన్ని శతాబ్దాల పాటు పరుసవేదులు రెండు మహోన్నత లక్ష్యాల కోసం శ్రమిస్తున్నట్టు అయ్యింది. ఆ లక్ష్యసాధనలో రెండు సమాంతర మార్గాల వెంట పయనిస్తున్నట్టుయ్ అయ్యింది. ఒకటి బంగారం కోసం గాలింపు, రెండు వెలితి లేని స్వస్థత కోసం, మృతిలేని జీవనం కోసం అన్వేషణ.
(సశేషం...)
@Anonymous: ఈ బ్లాగులో సైన్సుకు సంబంధించినవి కాకుండా, అనవసర విషయాలు తొలగించబడతాయి. మరొకసారి ఇటువంటి సంబంధం లేని కామెంట్లు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.