ఆల్బర్టస్ మాగ్నస్ కి సమకాలీనుడైన ఓ గొప్ప ఇంగ్లీష్ పండితుడు ఉన్నాడు. క్రైస్తవ సాధువైన ఇతడి పేరు రోజర్ బాకన్ (1214-1292). వైజ్ఞానిక ప్రయాసకి ప్రయోగాత్మక పద్ధతి, గణిత పద్ధతుల వినియోగం జోడైతే గొప్ప ప్రగతి సాధ్యం అవుతుందని ఇతడు గాఢంగా నమ్మేవాడు. ఆ భావాలనే తన రచనల్లో కూడా ఎన్నో చోట్ల వ్యక్తం చేశాడు. కాని నాటి ప్రపంచం అతడి మాటలని అర్థం చేసుకోడానికి సిద్ధంగా లేదు.
బాకన్ ఓ విజ్ఞాన సర్వస్వాన్ని రాయడానికి ప్రయత్నించాడు. తన రచనల్లో మందుపాతరకి సంబంధించిన వివరణ కనిపిస్తుంది. మందుపాతర ప్రస్తావన గల పుస్తకాల్లో అదే మొట్టమొదటిది కావచ్చు. కనుక అసలు మందుపాతరని కనుక్కున్నది బాకన్ అని అపోహ పడతారు. కాని అది నిజం కాదు. అయితే నిజంగా మందుపాతరని కనుక్కున్నది ఎవరు అన్నది కచ్చితంగా తెలీదు.
మందుపాతర ప్రభావం వల్ల కరుడు కట్టుకుపోయిన మధ్యయుగపు సమాజాల పునాదుల్లో పగుళ్ళు బయలుదేరాయి. కఠిన శిలలతో కట్టిన కోట గోడలు నేలమట్టం అయ్యాయి. తుపాకీ చేత పట్టి నేల మీద నిల్చిన వాడు, అశ్వారూఢుడై అతి వేగంతో దూసుకువస్తున్న యోధుణ్ణి క్షణంలో మట్టికరిపించ గలిగాడు. మొట్టమొదటి సారిగా కేవలం సాంకేతిక ఆధిక్యత వల్ల ఒక నాగరికత పరాయి నాగరికతల మీద అధిపత్యం చెలాయించ గలిగింది. 1400 ప్రాంతాల్లో మొదలైన ఆ దండయాత్ర ఐదు శతాబ్దాల పాటు అంటే 1900 వరకు ఇంచుమించు నిరాఘాటంగా కొనసాగింది. అన్ని శతాబ్దాల పాటు అన్ని ఖండాల మీద యూరప్ చేసిన పెత్తనానికి సాంకేతిక నైపుణ్యం కారణభూతం అయ్యింది.
తదనంతరం స్పానిష్ పండితులు ఆర్నాల్డ్ ఆఫ్ విలనోవా (1235-1311) మరియు రేమండ్ లల్లీ (1235-1315) ల రచనలలో పరుసవేదంలో ఓ కొత్త అధ్యాత్మిక ధోరణి బయలుదేరింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వారి రచనలుగా చెప్పబడిన పుస్తకాలు అసలు వారి రచనలేనా కాదా అన్న సందేహం లేకపోలేదు. ఈ పుస్తకాలలో రూపాంతరీకరణ (transmutation) గురించిన చర్చ విస్తృతంగా ఉంటుంది. అసమర్థుడు, వ్యర్థుడు అయిన ఇంగ్లండ్ రాజు ఎడ్వర్డ్ – II కోరిక మీదట లల్లీ కాస్తంత బంగారాన్ని తయారు చేసినట్టు కథలు ఉన్నాయి.
మధ్య యుగానికి చెందిన పరుసవేదుల్లో కెల్లా ప్రముఖుడైన వాడు ఒకడు ఉన్నాడు. అయితే ఆ పెద్దమనిషి తన సొంత పేరు మీద కాక తనకి ఆరు శతాబ్దాల వెనక పుట్టిన అరబిక్ పరుసవేది ’గెబర్’ పేరు మీద రచనలు చేసేవాడు. ఈ “నకిలీ గెబర్” స్పెయిన్ కి చెందినవాడని, రమారమి 1300 కాలంలో జీవించి ఉండొచ్చని తప్ప మనకి పెద్దగా సమాచారం లేదు. ఆధునిక రసాయనిక పరిశ్రమల్లో అతి ముఖ్యమైన (నీరు, గాలి, బొగ్గు, చమురు తరువాత) పదార్థం అయిన సల్ఫురిక్ ఆసిడ్ గురించి మొట్టమొదట రాసినవాడు ఇతడే. శక్తివంతమైన నైట్రిక్ ఆసిడ్ యొక్క ఉత్పత్తి గురించి కూడా ఇతడు వర్ణించాడు. ఈ కొత్త ఆసిడ్లు ఖనిజాల నుండి తయారుచేసినవి. అంతకు పూర్వం తెలిసిన ఆసిడ్లు, వెనిగార్ లోని అసిటిక్ ఆసిడ్ వంటివి, జీవలోకం నుండి వచ్చినవే.
(సశేషం...)
0 comments