మొదట్లో బద్ధ శత్రువు రాసిన పుస్తకాల నుండి నేర్చుకోవడానికి అహం, ఆగ్రహం అడ్డొచ్చినా, త్వరలోనే ఆ మానసిక అవరోధాలన్నీ మాయమయ్యాయి. మహత్తరమైన ఈ అరబిక్ రచనలన్నీ లాటిన్ లోకి తర్జుమా అయ్యాయి. అలాంటి ఉద్యమానికి మంచి స్పూర్తి ఇచ్చినవాడిలో ఒకడు గెర్బెర్ట్ (క్రీ.శ. 940-1003) అనే ఫ్రెంచ్ పండితుడు. క్రీ.శ. 999 లో ఇతగాడు సిల్వెస్టర్ – II అన్న పేరుతో పోప్ అయ్యాడు.
పరుసవేదం మీద అరబిక్ లో ఉన్న సాహిత్యాన్ని లాటిన్ లోకి తర్జుమా చేసిన మొట్టమొదటి వాళ్లలో ఒకడు రాబర్ట్ ఆఫ్ చెస్టర్ అనే ఓ ఇంగ్లీష్ పండితుడు. ఈ అనువాద కార్యక్రమాన్నిఅతడు క్రీ.శ. 1144 లో పూర్తి చేశాడు. అతడి తరువాత ఈ అనువాద ఉద్యమంలో పాల్గొన్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ అనువాదకుల్లో కెల్లా అగ్రగణ్యుడు జెరార్డ్ (క్రీ.శ. 1114-1187) అనే ఓ ఇటాలియన్ పండితుడు. క్రిమోనాలో పుట్టిన ఇతగాడు తన జీవితంలో అధిక భాగం స్పెయిన్ లోని టోలెడోలో జీవించాడు. (క్రీ.శ. 1085 లో క్రైస్తవ సేనలు టోలెడో నగరాన్ని ఆక్రమించుకున్నాయి.) మొత్తం 92 అరబిక్ గ్రంథాలని ఇతడు అనువదించాడు.
ఇలాంటి కృషి వల్ల క్రీ.శ. 1200 కల్లా యూరొపియన్ పండితులకి గతానికి చెందిన పరుసవేద సాంప్రదాయాలని అర్థం చేసుకోడానికి వీలయ్యింది. తెలుసుకున్న దాన్ని ఆధారంగా చేసుకుని మరిన్ని కొత్త విషయాలని తెలుసుకోడానికి ఉద్యమించారు.
అలా అప్పుడప్పుడే అంకురిస్తున్న యూరొప్ కి చెందిన పరుసవేద సాంప్రదాయంలో మొట్టమొదటి వాడుగా చెప్పుకోబడేవాడు ఒకడున్నాడు. ఇతడు బోల్స్టాట్ కి చెందిన ఆల్బర్ట్ (1200-1280) అనే పండితుడు. ఇతడికే ఆల్బర్టస్ మాగ్నస్ (“మహామహుడైన ఆల్బర్ట్”) అని మరో పేరు కూడా ఉంది. అరిస్టాటిల్ రచనలని ఇతడు లోతుగా చదివాడు. ఇతడి వల్లనే అరిస్టాటిల్ భావనలతో యూరొపియన్ పండితులకి గాఢమైన పరిచయం ఏర్పడింది. ఆ భావనలే మధ్యయుగపు చింతనకే కాక, ఆధునిక యుగపు ఆరంభానికి చెందిన చింతనకి కూడా పునాది రాళ్లు అయ్యాయి.
ఆల్బర్టస్ మాగ్నస్ పరుసవేదం మీద చేసిన రచనల్లో ఆర్సెనిక్ గురించి ఎంత విశదంగా రాశాడంటే అసలు ఆర్సెనిక్ ని మొట్టమొదట కనుక్కున్నది ఇతడేనా అనిపిస్తుంది. కాని అది నిజం కాదు. ఆర్సెనిక్ యొక్క శుద్ధ రూపాల గురించి ఇతడికి తెలిసి ఉండొచ్చేమోగాని, దాని అశుద్ధ రూపాల గురించి గతంలో పరుసవేదులకి బాగా తెలిసి ఉండేది.
(సశేషం...)
0 comments