“ఏంటి నువ్వనేది?”
“ఇదుగో చూడండి” అంటూ పొరలు పొరలుగా అమరి వున్న సాండ్ స్టోన్, లైమ్ స్టోన్ శిలా స్తరాలని చూపించాను. నెమ్మదిగా స్లేట్ శిల యొక్క తొలి సూచనలు కనిపించడం కూడా చూపించాను.
“అయితే?”
“మొట్టమొదటి మొక్కలు, జంతువులు ఆవిర్భవించిన దశలో ఉన్నాం అంటాను.”
“కావాలంటే దగ్గర్నుండి చూడండి.”
లాంతరుని సొరంగం గోడలకి దగ్గరిగా పెట్టి చూడమన్నాను. మామయ్య అలాగే చూశాడు కాని ముఖంలో ఆశ్చర్యపు ఛాయలైనా లేవు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకి నడిచాడు.
నేను అన్నది ఆయనకి అర్థం అయ్యిందా లేదా? అల్లుడు అన్న దాన్ని ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తోందా? తూర్పు దిశగా పోతున్న సొరంగాన్ని ఎంచుకున్నప్పుడు పప్పులో కాలేశానని ఒప్పుకొడానికి ఇబ్బందిగా వుందా? ఇంత జరిగినా ఈ సొరంగ మార్గం యొక్క అంతు వరకు పోవాలనే మంకు పట్టు వొదిలిపెట్టడా? ఈ దారి వెంట పోతే స్నెఫెల్ పర్వతం యొక్క మూలానికి చేరుకోలేమని ఆయనకి ఇప్పటికీ అర్థం కాలేదా?
కాని ఆలోచించగా రాతి స్తరాలలో వచ్చిన ఈ మార్పులకి నేను మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానేమో నని నాకే సందేహం కలిగింది. బహుశ నేనే పొరబడ్డానేమో? కంకర రాతి పునాది మీద ఇవి కేవలం కొన్ని పొరలేనేమో?
నేను అనుకున్నదే నిజమైతే త్వరలోనే కొన్ని ఆదిమ జీవరాశులకి చెందిన శిలాజాలు కనిపించాలి. అప్పుడిక సందేహానికి తావు ఉండదు. చూద్దాం ఏం జరుగుతుందో.
మరో నూరు అడుగులు వేశామో లేదో సందేహపు ఛాయలకు కూడా తావు ఇవ్వకుండా ఆధారాలు కనిపించసాగాయి. అనుమానం లేదు. ఎందుకంటే సైలూరియన్ దశలో సముద్రాలలో కనీసం పదిహేను వందల వృక్ష, జంతు జాతులు ఉండేవి. అంతవరకు కఠిన లావా నేల యొక్క స్పర్శకి అలవాటు పడ్డ నా పాదాలు ఉన్నట్లుండి శిధిలమైన పురాతన మొక్కలకి, గవ్వల ధూళిని తాకాయి. గోడలలో fucoids (ఒక విధమైన సముద్రపు నాచు), lycopodites (వినష్టమైనపోయిన ఒక వృక్ష జాతి) కి సంబంధించిన అవిస్పష్టమైన ముద్రలు కనిపిస్తున్నాయి.
http://www.marlin.ac.uk/habitatsbasicinfo.php?habitatid=356&code=1997#
కాని ప్రొఫెసర్ లైడెన్ బ్రాక్ మాత్రం ఈ అధారాలన్నీ చూసీ చూడనట్టు ధీమాగా ముందుకి పోతున్నాడు.
ఎదురులేని మొండితనం అంటే ఇదేనేమో. ఇక ఉండబట్టలేక పోయాను. ఓ పరిపూర్ణంగా రూపొందిన గవ్వని తీసుకుని మామయ్య వద్దకి పరుగెత్తి చూపిస్తూ ఇలా అన్నాను –
“ఇదుగో చూడు మామయ్యా!”
“అదో క్రస్టేషియన్ జాతి జీవానికి చెందినది. ప్రస్తుతం వినష్టమైపోయిన జాతి. దాని పేరు ట్రైలోబైట్. అంతకన్నా మరేం లేదు,” అన్నాడు మామయ్య.
“అంతకన్నా మరేం లేదా?”
“వుంది. నువ్వు ఊహించిందే నిజం కావచ్చు. నేను పొరబడి వుండొచ్చు. కాని ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం కుదరాలంటే ఈ సొరంగం అంతం వరకు వెళ్లాలి.”
“మీ పట్టుదలని మెచ్చుకుంటాను. బాగానే వుంది. కాని పొంచి వున్న ప్రమాదాన్ని మీరు గమనించినట్టు లేదు.”
“ఏం ప్రమాదం?”
“నీటి కొరత.”
“దాందేవుంది. ఇక నుండి నీటిని పొదుపుగా వాడదాం.”
(19 వ అధ్యాయం సమాప్తం)
0 comments