ప్రొ॥ జె. ఇ. గోర్డన్ ఆధునిక బయోమెకానిక్స్ (biomechanics), పదార్థ విజ్ఞాన (material science) రంగాల పితామహులలో ఒకరని చెప్పుకోవచ్చు.
1913 లో పుట్టిన ఈయన గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి నేవల్ ఆర్కిటెక్చర్ లో పట్టం పుచ్చుకున్నారు.
స్కాట్లాండ్ షిప్ యార్డ్ లలో పని చేస్తూ తొలిదశలలోనే ఓడల రూపకల్పనలో తన అసామాన్య నైపుణ్యం నిరూపించుకున్నారు. ఓడలు నిర్మించడమే కాక వాటిలో విస్తృతంగా ప్రయాణించి రూపకల్పనకి, ప్రవర్తనకి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థంచేసుకున్నారు. సరైన పదార్థం + సరైన నిర్మాణం – ఈ రెండూ కలిస్తేనే మన ప్రయోజనం కోరుకున్న విధంగా నెరవేరుతుందని తెలుసుకున్నారు.
గోర్డన్ యొక్క అభిరుచులు ఇంజినీరింగ్ రంగానికే పరిమితం కాదు. సాహిత్య, కళా రంగాలలో కూడా ఈయన ఎంతో ఆసక్తి చూపించేవారు. సాంప్రదాయక సాహిత్యంలో అతడికి మంచి ప్రవేశం ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ నౌకాదళంలో పని చేసిన ఈయన, రాత్రిళ్లు తీరిక వేళల్లో స్వాధ్యాయం చేసి గ్రీకు భాష నేర్చుకున్నారు. ప్రాచీన సాహిత్యంతో ఆయనకి ఉండే పరిచయం ప్రాచీన సంస్కృతులలో వాడబడ్డ కవచాల మీద, వాటిలో వాడే పదార్థాల మీద ఆయన చేసిన అధ్యయనాలకి శ్రీకారం చుట్టింది.
మానవ చరిత్రలో పదార్థాలకి ప్రబలమైన పాత్ర వుందని, కొత్త పదార్థాల ఆవిష్కరణ వల్ల చరిత్ర ఎన్నో ముఖ్యమైన మలుపులు తిరిగిందని ఆయన గుర్తించారు. రాబోయే కాలంలో పదార్థాల ప్రాబల్యం పెరుగుతుందని, వాటి ప్రాధాన్యత లోతుగా గుర్తించబడుతుందని, ఓ కొత్త “పదార్థ సంస్కృతి” ఆవిర్భవిస్తుందని ఆయన ముందే ఊహించారు. పదార్థాలకి, ప్రాచీన సంస్కృతులకి మధ్య ఉన్న సంబంధాన్ని బాగా గుర్తించిన గోర్డన్ ఈ రెండు విద్యావిభాగాలని కలుపుతూ ఓ కొత్త ఉమ్మడి విభాగాన్ని స్థాపించారు. ఆ విభాగం ఈ రెండు రంగాల్లో ఉమ్మడిగా పట్టం ప్రదానం చేస్తుంది. అయితే గోర్డన్ లాగా ఈ రెండు విభిన్న రంగాలని కలిపి జీర్ణించుకోగల సత్తా ఉన్న విద్యార్థులు అరుదు. కనుక ఈ విభాగం పెద్దగా రాణించలేదు.
గోర్డన్ పని చేసే కాలంలో పదార్థ విజ్ఞానం అంటూ ప్రత్యేకించి ఏమీ ఉండేది కాదు. నిర్మాణాలలో ఎక్కువ సాంప్రదాయబద్ధమైన పదార్థాలనే వాడేవారు. కనుక ఆ రోజుల్లో పదార్థ విజ్ఞానం లోహ విజ్ఞానం (metallurgy)తో సమానం. కాని గోర్డన్ నౌకానిర్మాణంలో ఆయన గడించిన అనుభవాన్ని ఉపయోగించి, నౌకా నిర్మాణంలో వాడే పదార్థాలని విమానాల రుపకల్పనలో వినియోగించే ప్రయత్నం ప్రారంభించారు. ఓడలలో వాడే చెక్క మాత్రమే కాకుండా ప్లాస్టిక్ మొదలైన సాంప్రదాయేతర పదార్థాలని యుధ్ధవిమానాలలో వినియోగించి ఎన్నో చక్కని ఫలితాలు సాధించారు.
ఆ కాలంలోనే గాలితో పూరించబడ్డ డింగీ (dinghy) అనబడే పడవల రూపకల్పనలో ఎంతో ప్రగతి సాధించారు. ఈ డింగీ అన్న పదం బెంగాలీ నుండి గాని, ఉర్దూ నుండి గాని వచ్చి వుంటుంది అంటారు (వికీ). ఈ చిన్న పడవలని యుద్ధ విమానాలు మోస్తాయి. అలాగే గాజు, కార్బన్, బోరాన్ మొదలైన పదార్థాలతో ప్రబలీకృత ఫైబర్ల (reinforced fibers) ప్రవర్తనని ఈయన అధ్యయనం చేశారు.
ఇంగ్లండ్ కి, ప్రపంచ పదార్థ వైజ్ఞానిక రంగానికి ఈయన చేసిన సేవలకి గుర్తింపుగా రాయల్ ఎయిరోనాటిక్స్ సొసయిటీ ఇతనికి రజత పతకం ఇచ్చి సత్కరించింది.
ప్రొ. గోర్డన్ రాసిన పుస్తకాలలో రెండు మచ్చుతునకలు ఉన్నాయి. అవి –
1. Structures or Why things don’t fall down.
2. The New Science of Strong Materials or Why You Don't Fall Through the Floor
ఈ రెండు పుస్తకాలు ఎన్నో భాషల్లోకి అనువదించబడ్డాయి. పాపులర్ సైన్స్ సాహిత్యంలో ముఖ్యంగా పదార్థ విజ్ఞాన రంగంలో ఈ రెండు పుస్తకాలకి పోటీ లేవని చెప్పుకోవచ్చు. తన వైజ్ఞానిక జీవితం యొక్క చివరి దశల్లో రాయబడ్డ ఈ పుస్తకాలలో విస్తృతమైన తన అనుభవం యొక్క సారాన్ని పొందుపరిచారు. లోతైన వైజ్ఞానిక విషయాలని చర్చిస్తున్నా ఈ పుస్తకాలు భారంగా పాఠ్యపుస్తకాలలా కాకుండా సరదాగా చందమామ కథలలా సాగిపోతాయి. ఈ పుస్తకాల రచనలో ప్రాచీన సంక్కృతులతో, ప్రాచీన సాహిత్యంతో రచయితకి ఉన్న పరిచయం ఎంతో ఉపయోగపడింది. ఉదాహరణకి -
గ్రీకు వీరుడు ఒడిసెస్ వాడిన వింటికి నారిని సంధించడం ఎందుకంత కష్టం?
ప్రాచీన గ్రీకులు రాత్రి వేళల్లో రధ చక్రాలని ఎందుకు ఊడదీసి పెట్టేవారు?
గ్రీకుల కాటపల్ట్ ఎలా పని చేస్తుంది?
పార్థెనాన్ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది?
విస్మయం గొలిపే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు గోర్డన్ పుస్తకాలని అందంగా అలంకరించి పాఠకులని పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వకుండా చదివింపజేస్తాయి.
గోర్డన్ రాసిన పుస్తకాలలో మొదటిదైన Structures నుండి కొన్ని విశేషాలని వరుసగా కొన్ని వ్యాసాలలో రాసుకొద్దామని ఉద్దేశం.
References:
http://en.wikipedia.org/wiki/J.E._Gordon
http://press.princeton.edu/chapters/i8225.html
0 comments