శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది?

బోస్ తరువాత ఆ శోధనా స్రవంతి ఎందుకు ఆగిపోయింది అని ఎవరో అడిగారు. దానికి సూటిగా సమాధానం చెప్పే ముందు ఒక విషయం పేర్కొంటాను.

“The Saga of Indian Science” by Pushpa Bhargava and Chandana Chakrabarti
అన్న పుస్తకంలో రచయితలు భారతీయ వైజ్ఞానిక వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి విస్తృతంగా చర్చిస్తారు. అందులోని నాలు ముఖ్యమైన అంశాలని మా సహోద్యోగి ఒకాయన ఈ మధ్యనే ఈమెయిల్ ద్వార మా సంస్థలో circulate చేశాడు. ఆ అంశాల సారాంశం ఇది:

1) ఇండియాలో [వైజ్ఞానిక రంగంలో] జరగాల్సి ఉండి, జరగకుండా మిగిలిపోయిన దాని బాధ్యత అధికశాతం శాస్త్రవేత్తల మీదే ఉంది. ప్రభుత్వం స్వయంగా నియమించిన శాస్త్రవేత్తలలో జవాబుదారీతనాన్ని ఆశించని కారణంగా, శాస్త్రరంగంలో అత్యంత ప్రతిభావంతులైన, సృజనాత్మకత గల వ్యక్తుల బాటలో అనవసరమైన అవరోధాలని కల్పించిన కారణంగా, కేవలం ఆజ్ఞాపన చేత సృజనని కల్పించలేమని దాన్ని పోషించి పెంచాలన్న ఎరుక లేకుండా ప్రవర్తిస్తున్నందున ప్రభుత్వం కూడా ఆ లోపంలో కొంత భాధ్యత పంచుకోవాలి.

2) మన దేశంలో వెలువడుతున్న పీ.హెచ్.డీ. థీసిస్ లలో నాణ్యత, నవ్యత కొరవడుతున్నాయి. గత నాలుగు శతాబ్దాలలో, మన దేశంలో ఏ వైజ్ఞానిక విభాగంలొనైనా, వెలువడ్డ పీహెచ్.డీ థీసిస్ లలో కేవలం 3-5% శాతం థీసిస్ లు మాత్రమే డాక్టరేట్ పట్టానికి అర్హత గలవి.

3) మన వైజ్ఞానిక సమాజంలో సహజ ప్రతిభ కొరవడుతోంది. కక్షలతో, అసూయలతో, ఆంతరిక కలహాల రాజకీయాల తెగులుతో మన వైజ్ఞానిక వ్యవస్థల సామర్థ్యం, ఉత్పాదకత కుంటువడుతోంది. వృత్తిపరంగా, ఆర్థికంగా, సామజికంగా శాస్త్రవేత్తలపై కచ్చితమైన జవాబుదారీ తనాన్ని విధించగల యంత్రాంగం లోపిస్తోంది. విలువైన, ఖరీదైన వైజ్ఞానిక సాధన సామగ్రిని కొనుగోలు చేసినా, వాటి వినియోగంలో, నిర్వహణలో తగినంత పొదుపు, శ్రద్ధ లేకపోవడం మన వైజ్ఞానిక వ్యవస్థలలో తరచు కనిపిస్తూ ఉంటుంది.

4) చాలా మంది శాస్త్రవేత్తలు మరొకరు తమ కన్నా ఉన్నత స్థితిలో ఉన్నారంటే, బాగా రాణిస్తున్నారంటే సహించలేరు. తమ మాటలకి గుడ్డిగా వత్తాసు పలుకుతూ, వంధిమాగధుల్లా చుట్టూ చేరిన వారికే వాళ్ల సహకార, సహాయాలు అందుతాయి. ఈ విధంగా మన వైజ్ఞానిక సంస్థలు ఎన్నో ’భజనమేళాల’తో నిండి ఉన్నాయి. వారితో తందానా అన్న వారికే ఆయా బృందాలలో సభ్యత్యం, దానితో పాటు వచ్చే లాభాలు ప్రాప్తిస్తాయి. అంతేగాని ఆ సభ్యత్వానికి, శాస్త్రవేత్తల సహజ ప్రతిభకి పెద్దగా సంబంధం లేదు.

కుండ బద్దలు కొట్టినట్టుగా మన వైజ్ఞనిక వ్యవస్థకి పట్టిన కొన్ని తెగుళ్ల గురించి రాశారు రచయితలు.

ఇవన్నీ అక్షరసత్యాలు అనను. అలాగని సత్యదూరం కూడా కావు. పైన చెప్పబడ్డ లోపాలు అంతో ఇంతో మన వైజ్ఞానిక వ్యవస్థల్లో చాలా వాటిల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే అన్ని వ్యవస్థలూ అలాగే ఉన్నాయని కాదు.

నేషనల్ సెంటర్ ఫర్ బయలాజికల్ సైన్సెస్ (NCBS) లాంటి సంస్థల్లో, నవతరం యొక్క సభ్యత్వం నిండుగా ఉన్న సంస్థల్లో, వాతావరణం అధ్బుతంగా, ప్రగతిశీలంగా ఉంటుంది. అలాగే కచ్చితమైన లక్ష్యాలతో చిత్తశుద్ధితో పని చేసే ఇస్రో లాంటి వ్యవస్థలు అద్భుత ఫలితాలు సాధిస్తూ మన దేశానికి గర్వకారణం అవుతున్నాయి.

మరైతే అన్ని సంస్థలూ అలా ఎందుకు లేవు? అని అడిగితే పైన చెప్పిన కారణాలు కొంతవరకు వర్తిస్తాయి. కాని ఇంకా లోతుగా పోతే సమస్య, కేవలం ఒక వ్యవస్థాత్మక సమస్య కాదు, రాజకీయ, నిర్వహణాత్మక సమస్య అసలే కాదు. సమస్య అసలు మన సంస్కృతిలోనే ఉందని నా అభిప్రాయం.

కాని ఈ విషయాల గురించి బ్లాగులో స్వేచ్ఛగా చర్చించడానికి సందేహిస్తున్నాను. ఇలాంటి “ఈ - చర్చలు” మా సంస్థలో తరచు జరుగుతుంటాయి. సీనియర్, జూనియర్ అన్న భేదం లేకుండా అందరూ ఉత్సాహంగా, మన:పూర్వకంగా పాల్గొంటుంటారు. ఒక్కొక్కరి దృక్పథంలోను ఒక సత్యం ఉంటుంది. అందరి దృక్పథాలు విన్నప్పుడు సమస్య యొక్క సమగ్ర స్వరూపం అర్థమవుతుంది. ఒకరినొకరు విభేదించుకున్నప్పుడు కూడా ఆ విమర్శ సంస్కారవంతంగా, సమంజసంగా ఉంటుంది.

కాని బ్లాగు ప్రపంచంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉందని నాకు ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదట్లోనే అర్థమయ్యింది. అవతలివాడు ఏం చెప్తున్నాడో కూడా వినకుండా అక్షేపణకి దిగిపోతారు. దానికి అసభ్యపదజాలం తోడవుతుంది. ఇక పదం పదానికి షిట్టుషిట్టని జపం చేసే “మలజపానందస్వాముల” సంగతి సరే సరి! చాలా మందికి అభిప్రాయం-వాస్తవం-సత్యం ఈ మూడింటికీ తేడా తెలీదు. మనసుకి నచ్చినదే నిజమని నమ్ముతారు. ఈ తేడా తెలీనప్పుడు చర్చ అసంభవం. ప్రమాదకరం కూడా.

కనుక ఈ విషయాన్ని ఇక్కడితో వొదిలిపెడుతున్నాను. తగిన వాతావరణం నెలకొందని నమ్మకం కుదిరిన రోజు, చర్చకి వేదిక సిద్ధమయ్యింది అనిపించిన రోజు, ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం.

4 comments

  1. budugu Says:
  2. I dont think you will ever get that environment in blogs. In places like your work, there is a responsibility on ppl to stick to their stance or their credibility is at stake.
    In blog world, there is no price on creidibility. Hence this problem. But as an antidote there is moderation in blogs which is totally under your control.
    I really wouldlike to see your opinions.

     
  3. Anonymous Says:
  4. I know you want raise the reservation issue here

     
  5. శోధనా స్రవంతి ఆగిపోయింది అనడం కన్నా తగ్గుముఖం పట్టింది అని చెప్పొచ్చు.
    ప్రతిభావంతులు ( భారతీయులలో ) ఉన్నారు. కాని ఇక్కడ పరిస్థితులు నచ్చక, మార్చడం కష్టం అని తెలిసి ఇతర దేశాలకు వెళ్తున్నారు.
    ఇది చదవగానే నాకు ఒక సంఘటన గుర్తుకు వచ్చింది.
    బిటెక్ చివరి సంవత్సరం మధ్యలో Visiting Professorsగా ఇద్దరు మా విద్యాలయానికి అమెరికా నుంచి వచ్చారు. వాళ్లు మాకు భోధించడమే కాకుండా వాళ్ళు చెప్పిన వాటి మీద మేము ఆలోచించేలా చేశారు.
    మాకు అలా భోధించిన వాళ్ళు మా HOD కాకుండా నలుగురు మాత్రమే ఉన్నారు.
    అప్పుడు వాళ్ళని (Visiting Professors) మీరు ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని అడిగితే, వాళ్ళు ఇలా అన్నారు.
    'ఇక్కడ విద్యార్థులకి అక్కడ విద్యార్థులకి పెద్ద తేడా లేదు. మాకు పైగా ఇక్కడ చేయడం ఇష్టం. కాని ఇక్కడ ఇది వరుకు చాలా రాజకీయాలు జరిగేవి. అందుకే'
    మొత్తానికి ఇప్పుడు పరిస్థితులు మారినా, మంచి Professors అందరు వెళ్ళిపోయారు. పరిస్థితి ఇలా ఉందని తెలిస్తే మంచి విద్యార్థులు కూడా రారు.
    మా HOD ఒంటరి పోరాటం చూస్తే బాధ కలుగుతుంది.
    ఈ సుడిగుండం నుంచి బయటపడాలంటే ఏమి చేయగలం?

     
  6. అరవింద్ గారు:
    ఇంచుమించు ప్రతీ కాలేజిలోను ఇలాంటి కథ ఏదో ఒకటి ఉంటుంది.
    అధికశాతం మంది ఏమీ పట్టనట్టు ఉంటే ఒకరిద్దరు తెగించి పోరాడుతూ ఉంటారు.
    దీనికి సులభ పరిష్కారం ఏమీ లేదు. సమస్యని గుర్తించి, ’ఇది మారాలి’ అని నమ్మిన వ్యక్తలు, మన వాస్తవ ప్రపంచపు హీరోలు, పూనుకుని వ్యవస్థని ఎదిరించి పోరాడడం తప్ప వేరే పరిష్కారం లేదు.
    ఏ దేశంలో మార్పు వచ్చినా అలాగే వచ్చింది. మహ్యత్యాల కోసం ఎదురుచూడలేం.

    బోస్ తో మొదలైన శోధనా స్రవంతి పూర్తిగా ఆగిపోలేదు. (అంటే బోస్ నడిచిన ప్రత్యేక పరిశోధనా మార్గంలో మన దేశంలో నాకు తెలిసి మన దేశంలో ఎవరూ నడుస్తూ ఉండకపోవచ్చు. అలాగని అసలు వైజ్ఞానిక స్ఫూర్తి పూర్తిగా చచ్చిపోయిందని కాదు.)
    ప్రస్తుతం మన వైజ్ఞానిక వ్యవస్థల్లో వస్తున్న సత్పరిణామం యువతరం శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో వ్యవస్థలోకి ప్రవేశించడం. కొత్త భావాలతో, గొప్ప తెగువతో, ఆత్మవిశ్వాసంతో, అవసరమైతే పైతరంతో ఘర్షణ పడుతూ, వాతావరణాన్ని మెల్లగా మారుస్తున్నారు. నేను చూసిన, విన్న ప్రతీ భారతీయ వైజ్ఞానిక సంస్థలోనూ ఫ్రస్తుతం ఈ ఒరవడులు కనిపిస్తునాయి. ఈ పరిణామంలో యువతరానికి చాలా పెద్ద పాత్ర ఉంది.

    ఇది ఇలాగే సాగితే ఒకట రెండు దశాబ్దాల్లో వైజ్ఞానిక రంగంలో మనం గర్వించదగ్గ ఎత్తున ఉంటామని నాకైతే ఆశాభావం ఉంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts