శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.
2. మన విద్యావిధానం ఎక్కువగా శోధన మీద కాక, స్మృతి మీద ఆధారపడి ఉంది.

ఎల్.కె.జి. నుంచి పీ.హెచ్.డి. వరకు మన దేశంలో చదువు అంటే గురువు చెప్పింది (లేదా గురువు చెప్పిన పుస్తకాలు చెప్పింది) గుర్తుపెట్టుకోవడం, దాన్ని భక్తిగా ఆచరించడం! ఎల్.కె.జి. లో ఎక్కాలతో మొదలవుతుంది. కొంచెం పెద్దయ్యాక పిరియాడిక్ టేబుళ్లు, భౌతిక, గణితశాస్త్రాల్లో ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటాము. (“ఒక చక్రీయచతుర్భుజం యొక్క భుజములు a, b, c, d అయినచో దాని వైశాల్యమును ఈ సూత్రముతో కనుగొనవచ్చును.”) ఇక ఇంజినీరింగ్ లో ఒకప్పుడు లాగర్థమ్ టేబుళ్లు, స్టీమ్ టేబుళ్లు కూడా గుర్తుపెట్టునేవారంటే నమ్మబుద్ధి కాదు, గాని ఆశ్చర్యం లేదు. ఇక జీవశాస్త్రంలో, వైద్యరంగంలో అధికశాతం జ్ఞాపకంతోనే పని.

జ్ఞాపక శక్తి అంటే మనకి అపారమైన గౌరవం. కనుకనే క్విజ్ లకి మన వ్యవస్థలో మంచి పలుకుబడి. సైన్సు లో కూడా క్విజ్ లు తెగ నడిపిస్తున్నారు. (సైన్స్ లో క్విజ్ ల ప్రయోజనం ఏంటో నాకు ఎప్పుడూ అర్థం కాదు!)
(“ఎక్స్-రేలని కనిపెట్టినది ఎవరు?” ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు అడిగేది ఎవరు?!!!)

అలాగే లక్షల మంది రాసే ఎంట్రన్స్ పరీక్షల్లో, దిద్దడం సులభం అని ’మల్టిపుల్ చాయిస్’ ప్రశ్నలు పాపులర్ అయ్యాయి. అక్కడా అదే పంథా...

ఉదాహరణకి,
జే.సీ. బోస్ కనిపెట్టిన పరికరం పేరేమి?
అ) రిస్కోగ్రాఫ్, ఆ) ఇస్కోగ్రాఫ్, ఇ) ఏస్కోగ్రాఫ్, ఈ) క్రెస్కోగ్రాఫ్
(ఈ ప్రశ్న వల్ల ఒరిగేది ఏమిటి? జేసీ బోస్ కనిపెట్టిన ఎన్నో పరికరాలలో ఇది ఒక్కటి మాత్రమే. కాని పాఠ్యపుస్తకం ఆ విషయాన్ని చెప్పదు. పేజీల పరిమితి వల్ల అవన్నీ చెప్పడానికి కుదరదు. ఇంకా ఊరికే పరికరం పేరు తెలిసి ఏం లాభం? దాన్ని ఎందుకు కనిపెట్టవలసి వచ్చింది? అది ఏం చేస్తుంది? దాని వల్ల విజ్ఞానం ఎలా పురోగమించిది? ఏ విషయాన్నీ లోతుగా శోధించకుండా, ఆ విషయాల పట్ల పిల్లల్లో స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలుగజేయకుండా, ఈ జీవం లేని సమాచారంతో పిల్లల బుర్రల్ని కూరడమే ప్రతీ చోటా మనకి కనిపిస్తోంది. మరి ఇలాంటి పరిణామాలని ఏ క్విజ్ లు, ఏ ఎంట్రన్స్ పరీక్షలు సరిదిద్దగలుగుతాయి?)

కనుక సారాంశం ఏంటంటే, మన సమాజంలో సైన్సు తెలియడం అంటే, వైజ్ఞానిక ఫలితాలు బోలెడు గుర్తుపెట్టుకుని ఉండడం. కాని విజ్ఞాన రంగంలో వైజ్ఞానిక ఫలితాలు అనేవి ఒక సుదీర్ఘ ప్రక్రియలో చివర్లో వచ్చేవి. కాని ఆ ఫలితాలకి అంత పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. అవి కాలానుగతంగా మారిపోతూ ఉంటాయి. (ఒక దశాబ్దం ఆస్పిరిన్ మంచిది అంటారు, తదుపరి దశాబ్దం కాదంటారు.) కాని ఆ ఫలితాలని ఎలా తెలుసుకున్నారు? ఈ పద్ధతికే పూర్తి ప్రాధాన్యత. ఎందుకంటే ఫలితం మాత్రమే తెలిస్తే దాన్ని గుడ్డిగా నమ్మి గుర్తుపెట్టుకోవడం తప్ప మనం చేసేదేమీ ఉండదు. కాని పద్ధతి తెలిస్తే దాన్ని మనమూ ఆచరించి ఆ ఫలితం సరైనదో కాదో మనకై మనమే పరీక్షించుకోవచ్చు. ఇంతకీ ఏంటా పద్ధతి?

సత్యానికి ఏమిటి ప్రమాణం? ఏ గురువో, నిపుణుడో, మతాధికారో చెప్పాడు కనుక ఒక విషయం సత్యం కాదు. ఒక విషయాన్ని మనకై మనం, చేసి చూసి, తెలుసుకున్న రోజు ఆ సత్యం మనదవుతుంది. ప్రయోగం ద్వార ప్రకృతి చెప్పిన సాక్ష్యమే సత్యాన్ని నిర్ణయిస్తుంది. కనుక ప్రయోగం చేసి సత్యాపన చేసుకోవడాన్నే వైజ్ఞానిక పద్ధతి అంటారు.

ఈ పద్ధతి యొక్క ప్రాధాన్యతని బాగా పరిచయం చేశాడు గనుకనే గెలీలియోని ’ఆధునిక విజ్ఞానానికి పితామహుడు’ అంటారు. గెలీలియో కాలంలో చంద్రుడు నునుపుగా, పరిపూర్ణ గోళంలా ఉండేవాడని అనుకునేవారు. కాని టెలిస్కోప్ లో ప్రత్యక్షంగా చందమామని చూసిన గెలీలియో దాని మీద పెద్ద పెద్ద కొండలని, మిట్టలని, లోయలని చూశాడు. మతాధికారులు, తాత్వికులు నమ్మలేదు. అదెలా సాధ్యం అని వాదించారు. ’ఎలా సాధ్యమో దేవుడెరుగు! కావాలంటే మీ అంతకు మీరే చూడండి.’ అని చెప్పి చూశాడు గెలీలియో. టెలిస్కోప్ లో కనపించేదంతా దృశ్యభ్రాంతి (optical illusion) అని ముందు కొట్టిపారేశారు. చాలా కాలం సాగాయీ వివాదాలు. చివరికి రోమ్ కి చెందిన కొందరు జెసూట్ లు తామే స్వయంగా ఓ టెలిస్కోప్ ని నిర్మించుకుని, స్వయంగా చూసి, నిర్ధారణ చేసుకున్నారు.

కనుక సైన్సు అంటే గుర్తుపెట్టుకోవడం కాదు. స్వయంగా పరీక్షించి చూసి, ఆ అనుభవాన్ని రక్తంలో పట్టించుకోవడం. అలా పట్టించుకున్న రోజు ఆ జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ తరువాత ఇక నిపుణుడితో పని లేదు. పుస్తకాలని అవతల పారేయొచ్చు.

“అదేంటి అలా అంటావు? మన విద్యావిధానంలో కూడా లాబ్ లు, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా? మరి అవన్నీ ప్రయోగాలే కదా?” అంటారేమో. నిజమే కాని ఆ ప్రయోగాలు కూడా అన్నీ ఎవరో డిజైన్ చేసినవే. దాన్ని గుడ్డిగా నేర్చుకుని ఆచరించడం తప్ప మనకి అందులో పెద్దగా వెసులుబాటు ఉండదు. (ఇంటర్మీడియెట్ చివరి ప్రాక్టికల్ పరీక్షల్లో ’titration,’ ‘salt evaulation’ అనే ప్రయోగాలకి సమాధానాలు, ప్యూన్ చేతిలో పది రూపాయలు పెడితే ఎలా వస్తాయో, అందరికీ తెలిసిన విషయమే!) ఇలాంటి పద్ధతిలో థియరీకీ, ప్రాక్టికల్స్ కి పెద్దగా తేడా లేదు.

కనుక మన విద్యావిధానంలో ప్రతీ అంశం – ఏం చదవాలో (థియరీ!), ఏం చెయ్యాలో (ప్రాక్టికల్!) – అన్నీ ఎవరో నిర్ణయిస్తారు. పిల్లలు వాళ్లంతకు వాళ్లు, వాళ్లకి బుద్ధి పుట్టినట్టు చెయ్యడానికి పెద్దగా ఏమీ ఉండదు. ప్రశ్నలు, సమాధానాలు రెండూ గురువే ఠక్కు ఠక్కున చెప్పేస్తూ ఉంటాడు. (ఆ గురువు కూడా తన గురువు ఠక్కు ఠక్కున చెప్పగా నేర్చుకున్న విషయాలే అవన్నీ!) మరి పిల్లల్లో పుట్టిన ప్రశ్నలని పట్టించుకునేదెవరు? ఆ ప్రశ్నలకి సమాధానాలు వెంటనే తెలీకపోయినా, అవసరమైతే వాటిని జీవితాంతం అన్వేషించుకోమని, ప్రేమగా ప్రోత్సహించేదెవరు? ప్రశ్న మనదైనప్పుడు దాని సమాధానం కోసం చేసే ప్రయత్నంలో మనకి ఆసక్తి ఉంటుంది. ప్రశ్న మరొకరిది అయినప్పుడు ఉత్సాహం చచ్చిపోతుంది.

కనుక మన విద్యావిధానంలో అన్నీ వెసులు బాటులేని ప్రణాళికతో కచ్చితంగా నియంత్రించబడుతుంది. మన చదువు ఓ పాతికేళ్లపాటు సాగే మార్చ్ పాస్ట్ లా ఉంటుంది!

చదువు అంటే మృగరాజు అడవిలో తిరుగులేని స్వేచ్ఛావిహారం చేస్తున్నట్టు ఉండాలి. నింగికి సరిహద్దులని తడిమే భేరుండపు గమనంలా ఉండాలి. అలుపు సొలుపూ లేని పసివాడి ఆటలా, అల్లరిలా ఉండాలి.

మరి మన చదువులు అలా ఉంటాయా? ఉండగలవా?

దీని గురించి మరో పోస్ట్ లో...

11 comments

 1. మీరు చెప్పింది అక్షర సత్యాలు.. పూర్తిగా ఎకీభవిస్తున్నాను..

   
 2. lakshman Says:
 3. I am also accepting with you.

   
 4. lakshman Says:
 5. I have gone through all of your articles and really they are good.

   
 6. jeevani Says:
 7. This comment has been removed by the author.  
 8. jeevani Says:
 9. మంచి టపా. విద్య మీద ఎవరు రాసినా నాకు పుండు మీద కారం చల్లినట్లు ఉంటుంది.
  మన దేశంలో విద్య అనేది ఒక ప్రయోగశాల. నిరంతరం పిల్లల మీద ప్రయోగాలు సాగుతూనే ఉంటాయి. ఇప్పటికీ మన విద్యావిధానానికి ఒక స్పష్టత లేకపోవడం దారుణమైన విషయం.ముందుగా చదివేవాడు చదవని వాడుగా విభజించి చూస్తే...
  మన విద్య ఎంతసేపూ చదివేవాడికి ఉపయోగపడుతుంది. చదువుకోవాలని ఇష్టం లేనివాడికి అణుభారాలు, ఫిజికల్ సైన్సు అవసరమా? వాడు అవన్ని చదివి సాధించేది ఏమిటి? ఇక చదివేవారు ఖర్మజీవులు. పరీక్షల దృష్టితో చదవడం తప్పించి మరోటి లేదు.
  పిల్లలను ప్రత్యక్ష అనుభవం, స్పర్శ, దృష్టి పద్ధతులలో నేర్చుకునేలా చేయాలి. వందలాది వేలాది కథలను నిరంతరం చదివేలా చేయాలి.
  నాకూ ఈ విద్యా వ్యవస్థ మీద కసి ఉంది. జీవని విద్యాలయాన్ని అలా రోల్ మోడల్ గా తీర్చిదిదినపుడు బహుశా ఆ బాధ తీరుతుంది.

   
 10. 1: ఏవిషయం నైనా ప్రశ్నించాలంటే ఆ విషయం గురించి కొంత ముందు తెలియాలి. దానికే స్కూళ్ళు చదువులు మాస్టర్లు.
  2: మనం ప్రతీదానిని ప్రశ్నించు కుంటూ నడిస్తే జీవితం లో మనమేమీ చెయ్యలేము. స్కూళ్ళల్లో చదువులు ముందరికి కదలవు. ప్రశ్నించు కుంటూ జీవితం సాగించు కోవటం అందరికి చేత గాదేమో..
  3:మన సంస్కృతి మన గొప్పతనము నిజమే. అది దశాబ్దాల కింద. ఈ మధ్యలో వందల సంవత్సరాలు మనం ఇంకొకరి పాలనలో ఉన్నాము. మన సంస్కారం, భాష, పరిజ్ఞానము మారి పోయాయి. ఇంకొకళ్ళు చెప్పినది వినటం నేర్చు కున్నాము, భాష లోను, తినటం లోను, జీవించటం లోనూ.
  4. ఏవిధంగా మనం బైటికి వచ్చి పూర్వ వైభవం పొందగల మని. దాని కోసమే ఈ పోస్ట్ లైతే చాలా సంతోషం.
  రామకృష్ణారావు

   
 11. బాగా చెప్పారు, నా దృష్టిలోకొచ్చిన ఇలాంటి విషయం. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తరగతిలో ఎంతసేపు బోర్డు మీదున్న దాన్ని రాసుకొన్న దాన్ని కంప్యూటర్లో కాపీ చేసి ఎక్సిక్యూట్ చేయటం మినహాయించి అది ఎందుకు అలా అయింది, ఏం నేర్చుకోవటానికి ఆ ప్రోగ్రాం ఉద్దేశించబడింది అని ఆలోచించే వారు చాలా తక్కువ. అందుకు తగ్గట్టే గురువులు, పరీక్షల్లో అదే ప్రోగ్రాంను ఇవ్వడమే కాని అందులోని సారాంశాన్ని ఉపయోగించి జవాబు రాబట్టే విధమైన ప్రశ్నలు అడగరు. అలాంటప్పుడు సృజనాత్మకంగా ఆలోఆచించి ఉపయోగమేమిటన్నది విధ్యార్థి వాదన.

   
 12. మన వేద కాలంలో మన గ్రంధాలు చదవటానికి వ్రాయటానికి కాగితాలు కంప్యూటర్స్ లేవు. నేను స్కూలు లో చదివిన రోజుల్లో తెల్ల కాగితాల పుస్తకం కోసం పొద్దున్నే వెళ్లి వరుసలో నుంచున్న రోజులున్నాయి.మన అర్థ శాస్త్రం నుండి సుసృతుని సర్జెరీ దాకా తరతరాలు వ్యాపించటానికి కారణం రోజూ కుర్చుని వల్లే వేయటం. అదే మనం ఎక్కాలు నేర్చుకోవటం దగ్గరనుండి సుమతి,వేమన శతకాలు వరకు ఉపయోగిస్తున్నాము . ఇది కొందరికి నచ్చక పోవచ్చు. జీవితం లో ధక్కా మోక్కిలు తిన్న నాలాంటివారికి విదేశాల్లో మనుషుల్లో మేదగా లంటే బాగా ఉపయోగించినవి ఎక్కాలు సుమతి,వేమన శతకాలు నిగమశార్మోపక్యనం పంచతంత్రం. అవి వల్లెవేయటం మూలాన బుర్రలో ఉన్నాయి కావలిసినప్పుడు వాడుకున్నాను .
  కొత్తగా కనుగొన్న సూత్రం, మీరు ఎమన్నా చదివి 24 గంటల లోపల దానిని మరల మననం చెయ్యక పోతే 80% మీరు మర్చేపోతారు.
  ఈకాలం లో కంపూటర్ మీద పిల్లలు ఎక్కాలు సైన్సు నేర్చుకున్నా వల్లెవేయిటమే . రొజూ ఒకటేపని మరల మరల చెయ్యటం.
  వేదాల కాలం నుంచి మన విద్యని పోకుండా మనకు అందేట్లు చేసిన గురువులకి నా శతకోటి స్కారములు.
  రామకృష్ణారావు

   
 13. రామకృష్ణ రావు గారు@:

  వేదకాలంలో కాగితాలు లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్నాయిగా. (వల్లే వెయ్యాలంటే టేప్ రికార్డర్లు కూడా ఉన్నాయి. మనం అక్కర్లేదు). ఇన్ని వసతులు ఉన్న ఇప్పుడు కూడా వల్లె వెయ్యాల్సిన అవసరం ఏంటి?

  శుశృతుడు కూడా కేవలం ధన్వంతరి చెప్పిన ముక్కలు వల్లె వేస్తూ కూర్చుని ఉంటే, ఆ కొత్త శస్త్ర చికిత్సా పద్ధతులు కనిపెట్టలేక పోయేవాడు.

  వల్లె వేస్తున్నప్పుడు ఎవరో కనిపెట్టిన విషయాన్ని వల్లె వేస్తున్నాం. అందరూ ఎల్లకాలం వల్లె వేస్తూ కూర్చుంటే కొత్తప ద్ధతులు కనిపెట్టేది ఎవరు? కొత్తగా పుట్టుకొచ్చే సమస్యలని పరిష్కరించేది ఎవరు?

  రోజు ఒకే పనిని పదే పదే ఒడుపుగా చెయ్యగలిగావారు నేతలు కాలేరు, మార్గగాములు కాలేరు.

   
 14. జీవని గారు@:
  మీ ’కసి’ హర్షించదగ్గది. దాన్ని భద్రంగా దాచుకోండి. ఏదో ఒకనాడు అది ఏదో సృజనాత్మక రూపంలో వెల్లివిరియగలదు.

   
 15. Anonymous Says:
 16. Vidyarthulu margagamuluga undadniki moola purushulu guruvulu. Guruvuley vidyadanam cheyakunda ammalakkallaga matladutu kalanni vrutha chesthu unte yemani cheppali? Naaku telisi mana vidyavidanam yenduku intha astha vyasthanga undante daniki karanam GURUVU. Vallakey yemi cheyalo telidu mari pillalakemi cheptaru? Class lo doubt aduguthey ninnu lab lo chusukunta ani cheppadam vidyarthula srujananu tunchiveyadam tappa inkenti sir! memu chaduvutunna college lo (most of the colleges lo) jarugu tunnadi ide kada.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email